ఒంటి నిండా బంగారు ఆభరణాలతో కనిపిస్తూ..గోల్డ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన పాతబస్తీకి చెందిన పల్లపు సురేశ్‌కుమార్ అలియాస్ సూర్యాభాయ్ ఓ చీటింగ్ కేసులో అరెస్టయ్యాడు. విదేశాల నుంచి తక్కువ ధరకే బంగారం తెప్పిస్తానంటూ రూ.30 లక్షలు తీసుకుని భారీ మోసానికి పాల్పడ్డాడని అతనిపై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి,సీపీ సజ్జనార్‌తో పరిచయాలున్నాయని చెప్పి, ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్పి బాధితులను సూర్య నమ్మించి మోసగించాడని బాధితులు అభియోగాలు మోపారు.
బంగారం ఇవ్వకపోవడం, డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్లి నిలదీయడంతో 3 ఐఫోన్లు ఇచ్చి వాటి విలువ రూ.10లక్షలు ఉంటుందని, అలాగే మరో రూ.20లక్షల చెక్ ఇచ్చి పంపించారని బాధితులు బాధితులు కృష్ణచారి, నవీన్ సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఆ తర్వాత తమను బెదిరించి ఫోన్లు తీసుకెళ్లారని అత్తాపూర్ పోలీసులకు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన అత్తాపూర్ పోలీసులు సూర్యాభాయ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు.. కేసును నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.