హోర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత…!

హోర్మూజ్ జలసంధిలో సింగపూర్ కార్గో నౌక ‘ఎవర్ లవ్లీ’పై క్షిపణి దాడితో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Jun 26, 2026, 2:52 pm IST
Read Time: 3 mins
హోర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత…!

పశ్చిమాసియాలోని హెర్మూజ్ జలసంధి వద్ద మరోసారి యుద్ద వాతావరణం నెలకొంది. సింగపూర్‌ కార్గో నౌక ‘ఎవర్ లవ్లీ’పై క్షిపణి దాడి మళ్లీ ఉద్రిక్తతలను రాజేసింది. ఒమన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరాక్‌లోని ఉమ్మ్ ఖసర్‌లో సరుకును దించుకుని సింగపూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
తమకు ఇష్టంలేని మార్గాల్లో వెళ్లే నౌకలకు భద్రత ఉండదని,ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించిన కొన్నిగంటల్లోనే ఈ దాడి జరుగడంతో దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనతో ఐక్యరాజ్యసమితి అలర్ట్ అయ్యింది. వెంటనే హెర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలు సురక్షితంగా వెళ్లేలా చేపట్టిన ఇంటర్నేషనల్ మారిటైమ్‌ ఆర్గనైజేషన్‌ ఎస్కార్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.ఎవర్ లవ్లీ’ నౌక దాడికి గురైనప్పటికీ ఎవరి సహాయం కోరకుండా తన ప్రయాణాన్ని కొనసాగించింది.

ప్రస్తుతం హెర్మూజ్ జలసంధి ప్రాంతంలో వందలాది నౌకలు, వేలాది మంది నావికులు చిక్కుకున్నారు. వారి భద్రతపై పునఃసమీక్ష జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. బ్రిటన్ మారిటైమ్ అధికారులు ఈ దాడిని నిర్ధారించగా, దీని వెనుక ఇరాన్ హస్తం ఉందని ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు.అయితే, ఈ దాడి తామే చేశామని ఇరాన్ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. హోర్మూజ్ జలసంధిలో ఎలాంటి చిన్న సమస్య తలెత్తినా, ఆయిల్‌ సరఫరాకు అంతరాయం కలిగినా, ప్రపంచ ఆర్థికవ్యవస్థలు భారీ కుదుపులకు లోనవుతుండటం గమనార్హం.