Telangana Rice Exports | ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. దేశంలోనే అత్యధికంగా టన్నుకు 3600

తెలంగాణ బియ్యానికి దేశంలో అత్యధిక ధర వస్తున్నదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. మన రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి అవుతున్నాయని సోమవారం అసెంబ్లీలో వెల్లడించారు. బియ్యం ఎగుమతుల విషయంలో బీఆరెస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపణలకు మంత్రి గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

  • By: TAAZ |    telangana |    Published on : Mar 23, 2026 7:15 PM IST
Telangana Rice Exports | ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. దేశంలోనే అత్యధికంగా టన్నుకు 3600
  • ఎగుమతులతో పౌర సరఫరాల శాఖపై తప్పిన 13 కోట్ల భారం
  • బియ్యం ఎగుమతికై సిఫార్సు చేసిందే హరీశ్‌రావు
  • చివరి గింజ వరకు ధాన్యం కొంటాం
  • శాసనసభలో మాజీ మంత్రి హరీశ్‌రావుపై ధ్వజమెత్తిన మంత్రి ఉత్తమ్

హైద‌రాబాద్‌, విధాత‌:

Telangana Rice Exports | ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమ‌తి అవుతున్నాయ‌ని, ఈ ఎగుమ‌తులు స‌మ‌ర్థ‌నీయ‌మేన‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం అసెబ్లీలో అసెంబ్ల‌లో ప్రశ్నోత్తరాల సమయంలో బియ్యం ఎగుమతుల అంశంపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు చేసిన విమ‌ర్శ‌ల‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ‌ బియ్యాన్ని ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ‌పై రూ.13 కోట్ల భారం తప్పింద‌ని చెప్పారు. ఎగుమతులతో తెలంగాణ‌ బియ్యానికి భారీగా డిమాండ్ పెరిగి, భారతదేశంలోనే అత్యధికంగా క్వింటా ఒక్కింటికి రూ.3600 ధర పలికిందన్నారు. 2025-26లో (O.M.S.S) ఓపెన్ మార్కెట్ స్కీమ్ కింద భారత ఆహార సంస్థ నిర్వ‌హించిన వేలంలో 3,000 రూపాయల ధర పలకలేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌ బియ్యం క్వింటాకు 1800 నుండి 1900 వరకే ధర పలికిందని తెలిపారు.

రైతుల కోస‌మే గ్లోబ‌ల్ బ్రాండ్‌

రైతుల ప్రయోజనం కోస‌మే తెలంగాణ‌ బియ్యానికి గ్లోబల్ బ్రాండ్ వ‌చ్చేలా ప్రోత్సాహం కల్పిస్తున్నామని మంత్రి ఉత్త‌మ్ తెలిపారు. ఒప్పందం ప్రకారం తెలంగాణ‌ రాష్ట్రం నుండి 22,750 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేసి, తెలంగాణ‌ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుందన్నారు.

త‌న అనుచ‌రుడికి అవ‌కాశం ఇవ్వాలని వ‌త్తిడి తెచ్చిన హ‌రీశ్‌

హరీశ్‌రావు కోరుతున్నట్లు హౌస్ కమిటీనే నియమిస్తే ఆయన మంత్రిగా ఉన్న ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలను పరిశీలించేందుకే పరిమితం చేయాల‌ని మంత్రి ఉత్త‌మ్‌ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఎగుమతులపై దృష్టి మళ్లించేందుకే హరీశ్‌రావు ఆరోపణలకు పునుకుంటున్నాని విమర్శించారు. వాస్తవానికి హరీశ్ రావే పౌర సరఫరాల శాఖా కమిషనర్‌ను సంప్రదించి, బియ్యం ఎగుమతులలో తనకు అనువైన అనుచరుడికి అవకాశం ఇవ్వాలంటూ వత్తిడి తెచ్చారని ఉత్తమ్‌ ఆరోపించారు. నిజాలు ఇలా ఉండగా సభను రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

ప్ర‌భుత్వం నుంచి ప్ర‌భుత్వం మ‌ధ్య‌నే ఒప్పందం

ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతుల ఒప్పందంపై ఎటువంటి అపోహలకు ఆస్కారమే లేదని ఆయన కొట్టి పారేశారు. అంతర్జాతీయ కొనుగోలుదారులతో తెలంగాణ‌ బియ్యం ఎగుమతుల ప్రక్రియలో తెలంగాణ‌ ప్రభుత్వం ఆయా దేశాల ప్రభుత్వ ప్రతినిధులతో మాత్రమే సంప్రదించి ఒప్పందం కుదుర్చుకుంటుందన్నారు. ఇక్కడి ప్రభుత్వం అక్కడి ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి, ఆయా దేశాల కొనుగోలు దారులతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు హరీశ్‌రావు లేవనెత్తిన అపోహలకు తావు ఉండనే ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్ కు తెలంగాణ‌ బియ్యం ఎగుమతి చెయడం విజయవంతంగా జరిగిందని తద్వారా థాయ్ లాండ్,వియత్నాం,కంబోడియా వంటి దేశాలకు చెందిన బియ్యం బ్రాండ్ల సరసన తెలంగాణ‌ బియ్యాన్ని నిలబెట్టినట్లయిందన్నారు.

కేంద్రం ఇచ్చిన అనుమ‌తి కంటే ఎక్కువ‌గా కొనుగోలు చేశాం

కేంద్ర ప్రభుత్వం తన నిర్దేశిత లక్ష్యం 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాం కొనుగోలుకు పరిమితమైన‌ప్ప‌టికీ తెలంగాణ‌ రైతుల నుండి చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదని మంత్రి అన్నారు. గడిచిన ఖరీఫ్ సీజన్ లో 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు.కేంద్ర ప్రభుత్వం 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే మద్దతు ధర చెల్లిస్తుండగా మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు కావడంతో నిలువ చేయడానికి కొంత మేర ఇబ్బంది అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

ఇవి కూడా చదవండి.. 

ఇరాన్ పై దాడులకు ఐదు రోజుల బ్రేక్ : ట్రంప్ సంచలన ప్రకటన

హరీశ్ రావు వర్సెస్ మంత్రులు ! … బడ్జెట్ చర్చలో వాగ్వివాదాలు!!

Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి ఊహించ‌ని దెబ్బ ప‌డ‌నుందా.. మెగా ఫ్లాపుల జాబితాలో చిత్రం చేరే ప్రమాదం