తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు? కేంద్ర సర్వీసుల నుంచి వెనక్కు రావడం వెనుక కారణమిదేనా?

తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జాజును నియమిస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసులలో ఉన్నారు. ఆయనను తెలంగాణకు తిరిగి పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది. ఆయనను కొత్త సీఎస్‌గా నియమించేందుకే తిరిగి తెలంగాణకు తెప్పిస్తున్నారని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

Reported by: Jagan Mohan Talluri | విధాత ప్రత్యేకం | Edited by: విధాత ఎక్స్క్లూజివ్ డెస్క్ | Jun 24, 2026, 8:06 pm IST
Read Time: 10 mins
తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు? కేంద్ర సర్వీసుల నుంచి వెనక్కు రావడం వెనుక కారణమిదేనా?

హైలైట్స్:

  • కేంద్ర అనుభవం, సుదీర్ఘ సర్వీసు కలిసొచ్చిందా!
  • జయేశ్‌ రంజన్, వికాస్ రాజ్‌లకు దక్కదా?
  • ఇద్దరికీ పదవీ విరమణ తరువాత సముచిత స్థానం!

విధాత, హైదరాబాద్:

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పోటీపడుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు ముగ్గురు పేర్లు విన్పించగా తాజాగా మరో అధికారి పేరు చేరింది. ఈ నెలాఖరుకు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆ పదవి దక్కించుకునేందుకు ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసులలో ఉన్న సంజయ్‌ జాజు సెంట్రల్ డిప్యుటేషన్ రద్దు చేసుకుని తెలంగాణకు రావడంతో ఆయనకే పదవికి లభిస్తుందని సీనియర్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల ఆశీస్సులు కూడా ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయనకే మొగ్గు చూపుతున్నారని తెలుస్తున్నది.

ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు పదవీకాలం గతేడాది ముగిసింది. కేంద్ర ప్రభుత్వం రెండు విడతలు పొడగింపు ఇవ్వడంతో ఈ నెలాఖరుకు ఆయన పదవీ విరమణ చేయనున్నారు. మరో మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని సమాచారం. అయితే మరోసారి పొడిగింపునకు కేంద్రం సుముఖంగా లేనట్టు ఐఏఎస్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

కృష్ణారావు తరువాత ఈ పదవి పొందేందుకు పలువురు అర్హులు ఉన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శశాంక్ గోయల్ (1991), అర్వింద్ కుమార్ కుమార్ (1992). జయేశ్‌ రంజన్ (1992), సంజయ్ జాజు (1992)తో పాటు వికాస్ రాజ్ (1992), సభ్యసాచి ఘోష్ (1994) ఉన్నారు. శశాంక్ న్యూఢిల్లీలో తెలంగాణ భవన్‌లో రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అర్వింద్ కుమార్ సస్పెన్షన్‌లో ఉన్నారు. జయేశ్‌ రంజన్ మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, వికాస్ రాజ్‌ టీ ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ జాజు తన డెప్యుటేషన్ ముగించుకుని తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. సభ్యసాచి ఘోష్ సంక్షేమ పథకాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు జయేశ్‌ రంజన్ పేరు ప్రముఖంగా విన్పించింది. ఆయనే తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇక బాధ్యతలు తీసుకోవడమే మిగిలి ఉందని సచివాలయ ఉద్యోగులు సైతం అనుకున్నారు.

కేవలం రెండు వారాల వ్యవధిలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు వారాల క్రితం అనూహ్యంగా వికాస్ రాజ్ పేరు తెరమీదికి వచ్చింది. బీహార్ రాష్ట్రానికి చెందిన వికాస్ రాజ్‌కు ఢిల్లీలో హైకమాండ్ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని, ఎస్సీ కులం కూడా కలిసి వచ్చిందని కొందరు అధికారులు ధృవీకరించారు. ఎవరూ ఊహించని విధంగా మంగళవారం సంజయ్ జాజు డెప్యుటేషన్ రద్దు చేస్తూ జారీ చేసిన సర్క్యూలర్ సచివాలయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. సంజయ్ జాజు వినతిపై డీఓపీటీ మంగళవారం ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ తెలంగాణ క్యాడర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన తదుపరి సీఎస్ రేస్ లో ఉన్నారన్న చర్చ జోరందుకున్నది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్‌కు సన్నిహితంగా ఉన్నారనే అభిప్రాయాలు జయేశ్‌ రంజన్‌కు మైనస్‌గా మారిందని సీనియర్‌ అధికారుల్లో జోరుగా చర్చ సాగుతున్నది. తొలుత ఆయనకు సీఎస్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నప్పటికీ మారిన సమీకరణల నేపథ్యంలో వెనక్కి తగ్గారంటున్నారు. రంగారెడ్డి జిల్లా భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడులు రప్పించడంలో, సమ్మిట్ నిర్వహణలో విఫలం అయ్యారనే అపవాదును మూటగట్టుకున్నారనేది మొన్నటి వరకు సచివాలయంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. గత ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండడం మూలంగా ఆయన పట్ల రేవంత్ విముఖంగా ఉన్నారంటున్నారు. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు వికాస్ రాజ్ తనదైన శైలిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయని, అయితే ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు కీలక పదవులలో పనిచేసిన సంజయ్ జాజు పదిహేను సంవత్సరాల క్రితం డిప్యూటేషన్‌పై ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం కేంద్ర డిప్యూటేషన్‌ ముగించుకుని తెలంగాణ సర్వీసులోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో పలు పదవులలో 15 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండడం ఆయనకు కలిసి వచ్చిందని, కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో సన్నిహిత సంబంధాలను తోసిపుచ్చలేని స్థితి ఏర్పడిందని సచివాలయానికి చెందిన ఒక అధికారి వ్యాఖ్యానించారు. 2028 లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, జాజు కు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసు ఉండడం కూడా కలిసివచ్చింది.

కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకారం 2028 లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి కాని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల చట్టాన్ని తీసుకుని వస్తే 2029 లేదా, అంతకు ముందే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంజయ్ జాజు పట్ల మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో ఎంసీహెచ్ కమిషనర్ గా నియమితులు అయి విజయవంతంగా పనిచేశారని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జయేష్ రంజన్, వికాస్ రాజ్ లకు పదవీ విరమణ తరువాత సముచితమైన పదవులు అప్పగించి వారి సేవలను వినియోగించుకోవాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని, ఆ మేరకు నచ్చచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. జయేష్ రంజన్ 2027 సెప్టెంబర్ నెలలో, వికాస్ రాజ్ 2028 మార్చి నెలలో పదవీ విరమణ చేయనున్నారు.

Jagan Mohan Talluri
jaganmohan.talluri@gmail.com