హైలైట్స్:
- వద్దే వద్దంటున్న పర్యావరణవేత్తలు
- అదీవాసీ హక్కుల కార్యకర్తల ఆందోళన
- మిత్రుడు అదానీ కోసమే ఈ ప్రాజెక్టు.. రాహుల్
గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు. ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారతదేశపు ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఒకటి గా చెబుతున్న దీనిపై ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య చర్చను తిరిగి రేకెత్తించింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం వాణిజ్యానికి ఊతమిస్తుందని, సముద్రమార్గ అనుసంధానం పెరుగుతుందని, ఆర్థికాభివృద్ధి చెందుతుందని అంటుండగా, పర్యావరణవేత్తలు మాత్రం దేశంలోని అత్యంత పర్యావరణ సున్నితమైన ద్వీప ఆవరణ వ్యవస్థల్లో ఒకటైన గ్రేట్ నికోబార్ పై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. జంతుజాలం అంతరించిపోతుందని, ప్రకృతి విధ్వంసం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమాత్రం ఖాతరు చేయకుండా పచ్చజెండా ఊపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టారని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. రెండు వారాల క్రితం నికోబార్ గిరిజన నాయకులతో ఆయన సమావేశమయ్యారు. గుజరాత్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి కట్టబెట్టేందుకే మోదీ ఈ ప్రాజెక్టును సిద్ధం చేశారని రాహుల్ విమర్శించారు. ఈ సందర్భంగా ద్వీపంలో రాహుల్ స్కూబా డైవింగ్ చేశారు.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వివరాలు…
అండమాన్ నికోబార్ దీవులలోని గ్రేట్ నికోబార్ లో నాలుగు ప్రధాన అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. గలాతియా బే లో ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్సిఫ్ మెంట్ టెర్మినల్ (ఐసీటీటీ)ని అభివృద్ధి చేయనున్నారు. పర్యాటకులు, విదేశీయులను ఆకర్షించేందుకు గ్రీన్ ఫీల్డు ఏయిర్ పోర్టు ను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల వసతికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కొత్తగా టౌన్ షిప్ అభివృద్ధి చేయనున్నారు. పెరగనున్న జనాభా అవసరాలు, విద్యుత్ డిమాండ్ ను తీర్చేందుకు పవర్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాంతం ప్రపంచంలో కీలక నౌక రవాణా మార్గమైన మలక్కా జలసంధికి సమీపంలో ఉండడంతో సద్వినియోగం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. గ్రేట్ నికోబార్ ను వాణిజ్యం, సరకుల రవాణా, పర్యాటకం, పెట్టుబడులకు సంబంధించి అంతర్జాతీయ సముద్ర కేంద్రంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్నది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో భాగంగా తీరం వెంబడి 2025 నుంచి 2047 వరకు దశల వారీగా పనులు చేపట్టి పూర్తి చేయనున్నారు. 161 చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులో 131 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని తప్పించనున్నారు. ప్రాజెక్టు అమలులో భాగంగా 7.11 లక్షల భారీ వృక్షాలు, చెట్లను నేలమట్టం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
పర్యావరణంపై ప్రభావమెంత…
గ్రేట్ నికోబార్ లో గలాతీయ నేషనల్ పార్క్, కంపాబెల్ బే నేషనల్ పార్క్ ప్రాంతాలు విస్తారమైన మడ అడవులు, దట్టమైన అడవులుగా ప్రసిద్ధి చెందాయి. ఇదే కాకుండా మంచినీటి చిత్తడి నేలలతో పాటు పగడపు దిబ్బలు, సముద్రపు గడ్డి విస్తారంగా విస్తరించి ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా కన్పించని జీవజాతులు, అరుదైన స్థానిక జాతులు కూడా మనుగడ సాగిస్తున్నాయి. ప్రపంచంలో అంతరించి పోతున్న సముద్ర తాబేలు అయిన లెదర్ బ్యాక్ లకు నిలయంగా ప్రసిద్ధిగాంచింది. పర్యావరణ పరంగా అత్యంత ముఖ్యమైన ప్రాంతాలలో ఒకటైన గలాతియా బే సముద్ర తాబేళ్లు గూడు కట్టే అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటిగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం జరగబోయే నష్టాలు ఇలా ఉన్నాయి. మడ అడవులను నరికేయడం, అటవీ భూములను విభజించడం మూలంగా జంతుజాతుల ముఖ్యమైన మార్గాలు, గూడు కట్టుకునే ప్రదేశాలు, నివాసాలను శాశ్వతంగా మూసివేయగలవు. కేవలం అడవులను తొలగించడం కాదు ఓడరేవులు, చిన్న చిన్న టౌన్ షిప్ లు, రోడ్లు, మౌలిక సదుపాయాలతో విధ్వంసం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పు ద్వీపాలలో చాలా సంక్లిష్టంగా ఉంటుందని, ఇప్పటికే వృక్షజాలం, జంతుజాలం కోసం ఆవాసాలను అందిస్తోంది. ఆవాసాలలో మార్పులు సున్నితంగా ఉండనున్నాయి.
పర్యావరణవేత్తల ఆందోళన బేఖాతర్…
అయితే గలాతియా బే వద్ద ప్రతిపాదిత ట్రాన్సిఫ్ మెంట్ టెర్మినల్ పై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓడల రాకపోకల రద్దీ, విద్యుత్ కాంతులు, నిర్మాణ పనులు, మనుషుల కదలికలు, యంత్రాల శబ్ధాల వంటి కారణంగా లెదర్ బ్యాక్ తాబేళ్లు గూడు కట్టడం, సంతానోత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ ద్వీపంలో నివసించే అనేక అరుదైన, స్థానిక జీవజాతుల అవాసాలను నష్టం వాటిల్లడమే కాకుండా పర్యావరణ మార్పుల మూలంగా ప్రభావితం కావచ్చనే ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భారీ స్థాయి తీరప్రాంతం నిర్మాణం, భూమిని పునరుద్దరించే పనులు కూడా ఉండడంతో సముద్ర, తీరప్రాంత వ్యవస్థలకు ముప్పు తప్పదంటున్నారు. పగడపు దిబ్బలు, సముద్ర గడ్డి క్షేత్రాలు, మడ అడవులు, దట్టమైన చెట్లు, తీరప్రాంత ఆవరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం ఉంటుందంటున్నారు. నౌకాయాన కార్యకలాపాలు, పట్టణీకరణ మూలంగా కలిగే దీర్ఘకాలిక పర్యావరణ మార్పుల గురించి కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమంటే… గ్రేట్ నికోబార్ తరచూ భూకంపాలు సంభవించే జోన్ ల ఉంది. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ మూలంగా ఈ ద్వీపం గణనీయంగా ప్రభావితమైన విషయం అందరికీ విధితమే. సునామీ వల్ల దీని తీరప్రాంతం, భూభాగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించే ముందుగా సునామీలు, భూకంపాలు, సముద్ర మట్టం పెరుగుదల, వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న విషయాలు, ప్రమాదాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. షోంపెన్, నికోబారు వాసులు గ్రేటర్ నికోబార్ దీవిలో కొన్నిశతాబ్ధాల నుంచి ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో పెరగనున్న పర్యాటకులు, జనసందడి కారణంగా గిరిజనుల సహజ జీవనశైలి, సామాజిక వ్యవస్థలకు ముప్పు వాటిల్లుతుందని వారి హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టుతో పర్యావరణానికి ముప్పులేదు…
వీరి వాదన ఇలా ఉంటే ప్రాజెక్టు రూపకల్పనలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశామని, దీనికన్నా ముందే అనేక ప్రత్యామ్నాయాలను పరిశీలించామని ప్రభుత్వం పేర్కొంటున్నది. ప్రకృతి కి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు అభివృద్ధి పరిధిని వీలైనంతగా పరిమితం చేయడం లేదా తగ్గించడం జరిగిందని, పర్యావరణానికి ముప్పు తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు అమలు చేయడం, వట వృక్షాలు, చెట్లు నరికివేత మూలంగా జరిగిన నష్టాన్ని పూడ్చివేసేందుకు పెద్ద ఎత్తున చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. శాస్త్రవేత్తలు, గిరిజనులు, ఆదీవాసీల హక్కుల కోసం పోరాడుతున్న వారు తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతించడంతో దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. పర్యావరణ నిబంధనలు పాటించాలని, ప్రకృతి విధ్వంసం జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.