రూ.200 పెట్టుబడితో..రూ.25 లక్షల వజ్రం సొంతం!

రూ.200తో భూమిని లీజుకు తీసుకున్న మహిళా రైతు అదృష్టం మారింది. మధ్యప్రదేశ్ పన్నాలో 6.54 క్యారెట్ల వజ్రం లభించగా దాని విలువ రూ.25 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు తెలిపారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jun 23, 2026, 3:24 pm IST
Read Time: 4 mins
రూ.200 పెట్టుబడితో..రూ.25 లక్షల వజ్రం సొంతం!

రూ. 200పెట్టుబడితో ఓ మహిళ రూ. 25లక్షల జాక్ పాట్ కొట్టేసి లక్షాధికారిగా మారిన ఘటన వైరల్ గా మారింది. నొయిడాకు చెందిన మీనాసింగ్ అనే మహిళా రైతు వజ్రాలకు ప్రఖ్యాతిగాంచిన మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలోని జారువాపూర్ గ్రామంలో రూ.200పెట్టుబడి పెట్టి చిన్న మైనింగ్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. గత కొన్ని రోజులుగా ఆమె కుటుంబం సాగిస్తున్న వజ్రాల వేటలో ఆమెకు 6.54క్యారెట్ల క్వాలిటీ డైమండ్ దొరికేసింది. దీంతో ఆ మహిళా రైతు అదృష్టం మారిపోయింది. మీనాసింగ్ కు దొరికిన వజ్రం విలువ మార్కెట్ లో రూ. 25లక్షల వరకు ఉంటుంది. తనకు లభించిన విలువైన వజ్రాన్ని ఆమె వెంటనే పన్నా డైమండ్‌ ఆఫీసులో డిపాజిట్ చేసింది.

డైమండ్ ఇన్ స్పెక్టర్ నూతన్ జైన్ మాట్లాడుతూ మీనాసింగ్ అనే మహిళకు దొరికిన వజ్రానికి త్వరలో వేలం నిర్వహిస్తామని, దాని విలువ రూ.25లక్షల వరకు ఉండవచ్చని, ప్రభుత్వ పన్నులు మినహాయించి.. మిగిలిన డబ్బును ఆమెకు అందిస్తామని తెలిపారు. గతంలోనూ ఆమెకు ఇలాగే ఓ విలువైన వజ్రం దొరికిందని..వేలం వేసి ఆమెకు దక్కాల్సిన డబ్బులను అందించామని గుర్తు చేశారు.

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా భూములు వజ్రాలకు ప్రసిద్ది. ఈ భూములను నిర్ణీత కాలానికి రైతులు లీజుకు తీసుకుని వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. గతంలో ఇలాగే బజారియా గ్రామంలో బజారియా గ్రామంలో రూ.200తో లీజుకు తీసుకున్న భూమిలో దేశ్ రాజ్ అనే రైతుకు 6.65 క్యారెట్ల ఈ డైమండ్‌ దొరికింది. వేలంలో ఆ వజ్రం రూ.25లక్షలకు అమ్ముడుపోవడంతో అతను లక్షాధికారి అయిపోయాడు. అలాగే సతీశ్‌పట్టి ప్రాంతంలోని కృష్ణ కల్యాణ్‌పూర్‌లో సతీశ్‌ ఖాతిక్‌, సాజిద్‌ మహ్మద్‌లు కూడా రూ. 200కు లీజుకు తీసుకున్న భూమిలో తవ్వకాలు జరుపగా వారికి 15.34 క్యారెట్‌ల వజ్రం లభ్యమైంది. అది జామ్‌ క్వాలిటీతో ఉన్న అరుదైన వజ్రం కావడంతో వేలంలో వారికి రూ. 50లక్షల సొమ్ము దక్కింది.