సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజు అరెస్టు..ఉద్రిక్తత

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజును సిట్ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో ఉద్రిక్తత నెలకొనగా లాకప్ డెత్ అనుమానాలపై విచారణ వేగం పెరిగింది.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Jun 23, 2026, 1:24 pm IST
Read Time: 3 mins
సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజు అరెస్టు..ఉద్రిక్తత

లాకప్ డెత్ కు గురైనట్లుగా అనుమానిస్తున్న సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజును సిట్ పోలీసుల బృందం మంగళవారం మధ్యాహ్నం అరెస్టు చేసింది. విజయవాడ సింగ్ నగర్ లోని నాగరాజు ఇంటికి భారీ పోలీసు బలగాలతో చేరుకున్న సిట్ అధికారులు నాగరాజును అరెస్టు చేసి తీసుకెళ్లారు. నాగరాజును విచారించిన అనంతరం ఇదే రోజు అతడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.

అయితే నాగరాజు అరెస్టును వ్యతిరేకిస్తూ…ఆయన మద్దతు దారులు భారీ సంఖ్యలో తరలివచ్చి సిట్ పోలీసులను అడ్డుకున్నారు. నాగరాజును అరెస్టు చేసి తీసుకెళ్లకుండా పోలీసు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి నాగరాజును స్టేట్ పోలీస్ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లారు.

రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో నాగరాజును ప్రధాన నిందితుడిగా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి, లాకప్ లో నిర్బంధించడం, అతడు మరణించాక శ్మశాన వాటికకు తరలించడం వంటి వాటికి సంబంధించి సీసీ ఫుటేజీలు మాయం కావడం, శ్మశాన వాటికలో అనాధ శవాల వివరాల మాయం కావడంతో నాగారాజుపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. సాయికృష్ణ సీఐ నాగరాజు చేతిలో లాకప్ డెత్ కు గురైనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ నాగరాజు అరెస్టుతో సాయికృష్ణ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడే అవకాశం కనిపిస్తుంది.