హైదరాబాద్‌లో నగల షాపులను ముంచిన వ్యక్తి.. రూ.20 కోట్ల బంగారంతో పరారీ?

హైదరాబాద్‌లో భారీ జ్యువెలరీ మోసం వెలుగులోకి వచ్చింది. నితిన్‌ అనే వ్యక్తి నాలుగు జ్యువెలరీ షోరూం యజమానులను నమ్మించి 13 కిలోలకుపైగా బంగారు ఆభరణాలు తీసుకుని పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

Reported by: ADHARVA | హైదరాబాద్​ | Edited by: విధాత హైదరాబాద్ డెస్క్ | Jun 22, 2026, 5:49 pm IST
Read Time: 4 mins
హైదరాబాద్‌లో నగల షాపులను ముంచిన వ్యక్తి.. రూ.20 కోట్ల బంగారంతో పరారీ? హైదరాబాద్‌లో వెలుగుచూసిన రూ.20 కోట్ల జ్యువెలరీ మోసం కేసుపై సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైలైట్స్:

  • రూ.20 కోట్ల బంగారం మాయం
  • నలుగురు వ్యాపారులకు మోసం
  • 13 కిలోలకుపైగా ఆభరణాలు
  • సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్‌: నగరంలో ఆభరణాల మోసం కలకలం రేపింది. నితిన్‌ అనే వ్యక్తి నలుగురు నగల షోరూం యజమానులను నమ్మించి, సుమారు రూ.20 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై బాధిత వ్యాపారులు హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది.

నమ్మించి నగలతో ఉడాయించిన ఘనుడు

పోలీసులకు అందిన ఫిర్యాదుల ప్రకారం, నితిన్‌ తనకు ప్రముఖ నగల వ్యాపారులు,  షోరూంలతో బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పి వ్యాపారులను నమ్మించాడు. ఆ నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని కొంతకాలంగా వారినుంచి బంగారు ఆభరణాలు తీసుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ విధంగా అతను మొత్తం 13 కిలోలకుపైగా బంగారు ఆభరణాలు సేకరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తీసుకున్న ఆభరణాలకు డబ్బులు చెల్లించకపోవడం, ఆభరణాలు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన వ్యాపారులు అతడిని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే నితిన్‌ అందుబాటులోకి రాకపోవడంతో మోసం జరిగినట్లు గుర్తించారు.

నాలుగు నగల దుకాణాలకు భారీ దెబ్బ

Jewellery showrooms linked to Hyderabad gold fraud case

హైదరాబాద్‌ జ్యువెలరీ మోసం కేసులో నమోదైన షోరూంలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఈ మోసంలో నవ్య జ్యువెలర్స్‌, సిద్ధి వినాయక్‌ జ్యువెలర్స్‌, బన్సీలాల్‌ జ్యువెలర్స్‌, శ్యామ్‌ బాబా జ్యువెలర్స్‌ యజమానులు బాధితులుగా ఉన్నట్లు సమాచారం. వ్యాపార లావాదేవీల పేరుతో తీసుకున్న ఆభరణాల విలువ దాదాపు రూ.20 కోట్ల వరకు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.

బాధితుల ఫిర్యాదుల ఆధారంగా సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఎక్కడున్నాడు? తీసుకున్న బంగారాన్ని ఎవరికి విక్రయించాడు? ఈ వ్యవహారంలో మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.

రికార్డులపై పోలీసుల దృష్టి

ఆభరణాలు ఏ ఆధారంతో ఇచ్చారు? వాటికి సంబంధించిన బిల్లులు, లావాదేవీ పత్రాలు, మెసేజ్‌లు లేదా ఇతర ఒప్పందాలు ఉన్నాయా? అనే అంశాలపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడిని పట్టుకుని బంగారు ఆభరణాలను రికవరీ చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు సమాచారం.