సిగరెట్‌ తెమ్మని డ్రైవర్‌ను దింపి క్యాబ్‌తో పరార్‌

మేడిపల్లి పరిధిలో ప్రయాణికుడిలా నటించిన ఓ వ్యక్తి క్యాబ్‌ డ్రైవర్‌ను సిగరెట్‌ తెమ్మని దింపి వాహనంతో పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Reported by: ADHARVA | హైదరాబాద్​ | Edited by: విధాత హైదరాబాద్ డెస్క్ | Jun 22, 2026, 4:52 pm IST
Read Time: 3 mins
సిగరెట్‌ తెమ్మని డ్రైవర్‌ను దింపి క్యాబ్‌తో పరార్‌ ప్రతీకాత్మక చిత్రం

హైలైట్స్:

  • ప్రయాణికుడిలా నటించిన నిందితుడు
  • సిగరెట్‌ పేరుతో డ్రైవర్‌ను దింపాడు
  • స్విఫ్ట్‌ టూర్‌ క్యాబ్‌తో పరార్‌
  • సీసీటీవీ పరిశీలిస్తున్న మేడిపల్లి పోలీసులు

మేడిపల్లి(హైదరాబాద్​): హైదరాబాద్‌ శివారులోని మేడిపల్లి పరిధిలో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ను మోసం చేసి వాహనంతో పరారైన ఘటన వెలుగుచూసింది. ప్రయాణికుడిలా నటించిన ఓ వ్యక్తి, డ్రైవర్‌ను నమ్మించి కారు నుంచి దింపి, క్షణాల్లో వాహనంతో మాయమయ్యాడు.

నల్గొండ జిల్లాకు చెందిన చి. భాను ప్రభు (26) అద్దె క్యాబ్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జూన్‌ 20న ఉప్పల్‌ రింగ్‌ రోడ్‌ వద్ద తన స్విఫ్ట్‌ టూర్‌ సీఎన్‌జీ వాహనంతో ప్రయాణికుల కోసం వేచి ఉండగా, గుర్తు తెలియని వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. చెంగిచెర్ల వరకు వెళ్లేందుకు రూ.450 ఇస్తానని చెప్పడంతో భాను ప్రభు ప్రయాణాన్ని అంగీకరించాడు.

సిగరెట్​ తెమ్మని…

వాహనం మేడిపల్లికి చేరుకున్న తర్వాత ఆ వ్యక్తి తనకు కాలు నొప్పిగా ఉందంటూ, దగ్గరలోని పాన్​షాప్​ నుంచి సిగరెట్‌ తీసుకురావాలని డ్రైవర్‌ను కోరాడు. భాను ప్రభు కారును ఆపి దుకాణం వైపు వెళ్లాడు. అదే సమయంలో కారులో ఉన్న వ్యక్తి క్షణాల్లో డ్రైవర్‌ సీట్లోకి మారి కారును వేగంగా నడుపుకుంటూ పరారయ్యాడు. డ్రైవర్‌ కారును వెంబడించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో, మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.