తెలంగాణ ఏసీబీ అవినీతి అధికారుల భరతం పట్టడంతో దూకుడుగా ముందుకెలుతుంది. వరుస దాడులతో అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది. తాజాగా నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి నివాసంలో మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో హైదరాబాద్ మచ్చబొల్లారం, నిజామాబాద్ ప్రగతినగర్‌లోని ఆయన నివాసాలతో పాటు సూపరింటెండెంట్ కార్యాలయం, ఆయన బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
గత ఆరేళ్లుగా మల్లారెడ్డి నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఏసీబీ అధికారులు మల్లారెడ్డినై నజర్ పెట్టారు. ప్రగతి నగరంలోని ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించినట్టు సమాచారం. మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయంతో పాటు ఆయనకు సంబంధించిన 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలలో లెక్క చెప్పని రూ.3కోట్ల విలువైన స్థిర, చరాస్తులు వెలుగులోకి వచ్చాయి. 4 నివాస సముదాయాలు, ఒక 1 కమర్షియల్ భవనం, 8 ఒపెన్ ప్లాట్లు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమి, అల్వాల్ నివాసంలో రూ.3.3 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.50 లక్షల బ్యాలెన్స్, ఒక ఎస్ యూవీ కారు, స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 3 బ్యాంక్ లాకర్లు తెరవాల్సి ఉంది. గుర్తించిన అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో కోట్లలో ఉంటందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఇటీవల ఏసీబీ వరుస దాడులతో భారీ అవినీతి తిమింగలాలను పట్టకున్న సంగతి తెలిసిందే. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి అక్రమాస్తుల కేసులో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో రూ. 150కోట్ల మేరకు అవినీతి సొమ్ము బయటపడింది. అంతకుముందు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రూ.300 కోట్లకు పైగా ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు. ఆ తర్వాతా రూ.100కోట్ల అక్రమాస్తుల మార్కు దాటిన వారిలో వరుసగా జలమండలి జీఎం అనంతలక్ష్మీ కుమార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఉండటం గమనార్హం. రంగారెడ్డి జిల్లా సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కే శ్రీనివాసులుపై జరిపిన సోదాల్లోనూ రూ.100 కోట్లకు పైగానే ఆక్రమాస్తులు గుర్తించారు.
టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఎరుగు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ నూనె శ్రీధర్, మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు , ట్రాన్స్‌పోర్ట్ శాఖ డిప్యూటీ కమిషనర్ మూడ్ కిషన్లపై నిర్వహించిన సోదాల్లోనూ వంద కోట్ల మేరకు అక్రమాస్తులు గుర్తించారు. హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి కేసులో, ఇటీవల మాజీ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఏసీపీ భుజంగరావుపై ఏసీబీ జరిపిన సోదాల్లోనూ భారీగా అక్రమాస్తులు గుర్తించిన సంగతి తెలిసిందే.