అవినీతిలో డీఎస్పీ భీమ్ రెడ్డి డబుల్ సెంచరీ !

ఇప్పటిదాకా ఏసీబీకి పట్టుబడిన అవినీతి తిమింగలాలు రూ.100కోట్ల మేరకు అక్రమాస్తులతో సంపాదనతోనే సంచలనం సృష్టించారనుకుంటే..డీఎస్పీ భీమ్ రెడ్డి ఏకంగా రూ.200కోట్ల మేరకు అక్రమాస్తులతో డబుల్ సెంచరీ కొట్టేసి అవినీతిలో సరికొత్త రికార్డు కొట్టడం అందరిని విస్మయానికి గురి చేసింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 03, 2026, 11:30 am IST
Read Time: 7 mins
అవినీతిలో డీఎస్పీ భీమ్ రెడ్డి డబుల్ సెంచరీ !

విధాత, హైదరాబాద్ : ఇప్పటిదాకా ఏసీబీకి పట్టుబడిన అవినీతి తిమింగలాలు రూ.100కోట్ల మేరకు అక్రమాస్తులతో సంపాదనతోనే సంచలనం సృష్టించారనుకుంటే..డీఎస్పీ భీమ్ రెడ్డి ఏకంగా రూ.200కోట్ల మేరకు అక్రమాస్తులతో డబుల్ సెంచరీ కొట్టేసి అవినీతిలో సరికొత్త రికార్డు కొట్టడం అందరిని విస్మయానికి గురి చేసింది.  డీఎస్పీ భీమ్ రెడ్డి కూడబెట్టిన అక్రమాస్తుల చిట్టా చూస్తుంటే…ఓ డీఎస్పీ స్థాయి అధికారినే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టారంటే…పై స్థాయి అధికారులు ఇంకే స్థాయిలో అక్రమార్జన సాగిస్తున్నారోనన్న సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS) విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

సర్వీసులో ఉన్న సమయంలో అవినీతి పద్ధతులు, అక్రమ మార్గాల ద్వారా ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణలపై, అవినీతి నిరోధక చట్టం-1988 (2018 సవరణతో)లోని సెక్షన్లు 13(1)(b) మరియు 13(2) కింద ఈ కేసు నమోదైంది. ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలు మరియు సన్నిహితులకు చెందిన తెలంగాణ, కర్ణాటకలలోని 15 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. సోదాలలో 2కిలోల బంగారం, రూ.200కోట్ల మేరకు అక్రమాస్తులను గుర్తించారు. ఎక్కువగా బీనామీల పేర్లపై ఆస్తులు నమోదై ఉన్నాయి. ఏసీబీ గుర్తించిన అక్రమాస్తులన్నింటికి భీమ్ రెడ్డి మాత్రమే సంపాదించారా లేక ఆయన వెనుక మరెవరైనా ఉన్నారా అన్న కోణంలోనూ విచారణ కొనసాగుతుంది.

డీఎస్పీ భీమ్ రెడ్డి ఆస్తుల చిట్టా.. సోదాల సమయంలో లభించిన పత్రాలు..!

1. హైదరాబాద్, ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో ఒక విల్లా,

2. టెలికాం నగర్‌లో ఒక నివాస గృహం (జి+2+పెంట్ హౌస్),

3. టెలికాం నగర్‌లోని సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాట్,

4. గచ్చిబౌలిలోని ‘క్రాంతి సియోన్ అపార్ట్‌మెంట్స్’లో ఒక ఫ్లాట్,

5. మణికొండ, లాంకోహిల్స్ రోడ్డులో 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న G+5 వాణిజ్య సముదాయంలో వాటా..!

6. మణికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఒక వాణిజ్య స్థలం..!

7. తెల్లాపూర్‌లోని అభినంద రెసిడెన్సీలో రెండు నివాస ఫ్లాట్లు..!

8. ప్రగతి రిసార్ట్స్‌లో 500 చదరపు గజాల ఒక ఖాళీ స్థలం..!

9. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి..!

10. కర్ణాటకలో 6-00 ఎకరాల వ్యవసాయ భూమి..!

11. కర్ణాటకలో మరో 38 ఎకరాల వ్యవసాయ భూమి,

12. బెంగళూరులోని దేవనహళ్లిలో 1 ఎకరం భూమి,

13. నాగోల్‌లోని కామినేని ఆసుపత్రి సమీపంలో 200 చదరపు గజాల విస్తీర్ణం గల ఒక ఖాళీ స్థలం,

14. జిపిఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 చదరపు గజాల విస్తీర్ణం గల ఒక ఖాళీ స్థలం,

15. పటాన్ చెరులో 440గజాల ఓపెన్ ప్లాటు,

16. పటాన్‌చెరులో 200 చదరపు గజాల విస్తీర్ణం గల ఒక ఖాళీ స్థలం,

17. వికారాబాద్, మోమిన్‌పేట్‌లో 1,000 చదరపు గజాల విస్తీర్ణం గల ఒక భూమి పార్ట్

18. వికారాబాద్, మోమిన్‌పేట్‌లో 2 ఎకరాల వ్యవసాయ భూమి,

19. మెస్సర్స్ శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్‌లో రూ. 75,00,000/- పెట్టుబడి,

20. సీసీ కుంటలోని ముచింతల గ్రామంలో 4-20 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు కనుగొనబడింది.

ఇంకా, సోదాల సమయంలో, ఏఓ ఇంట్లో సుమారు రూ. 3.60 లక్షల నికర నగదు, అతని బినామీ ఇంట్లో మరో రూ. 40 లక్షల నికర నగదు లభ్యమైంది. సుమారు 2 కిలోగ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 20 కిలోగ్రాముల వెండి వస్తువులు, సుమారు రూ. 19 లక్షల 91 వేల బ్యాంకు నిల్వలు కూడా లభించాయి. స్థిరాస్తుల మార్కెట్ విలువ, వాటి పత్రాలలోని విలువ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. . భీమ్ రెడ్డి నివాసంలో 23 విదేశీ మద్యం సీసాలను కూడా అధికారులు గుర్తించి, తదుపరి చర్యల కోసం ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించారు. అదనపు ఆస్తుల గుర్తింపు ప్రక్రియ మరియు దర్యాప్తు కొనసాగుతుంది.