Komatireddy Rajagopal Reddy fire| ప్రజల కోసం ప్రశ్నించకపోతే పదవిలో ఉండటానికి అనర్హుడిని: రాజగోపాల్ రెడ్డి ఫైర్
నా నియోజకవర్గం మునుగోడు ప్రజల సమస్యలపై ప్రశ్నించకపోతే నేను ఈ ఎమ్యెల్యే పదవిలో ఉండటానికి అనర్హుడనని భావించాల్సి వస్తుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం తీరుపై అసహనం వెళ్లగక్కారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారని, ఏం వచ్చినా ఆ జిల్లాకు, వారికే పోతున్నాయని బయట టాక్ నడుస్తుందని, మంత్రులు, సీఎం నియోజకవర్గంలో కాంట్రాక్టులకు బిల్లులు వస్తున్నాయని, ఎమ్మెల్యేల నియోజకవర్గంలో పనులకు బిల్లులు రాకపోవడం బాధకరం అన్నారు.
విధాత,హైదరాబాద్ : నా నియోజకవర్గం మునుగోడు ప్రజల సమస్యలపై ప్రశ్నించకపోతే నేను ఈ ఎమ్యెల్యే పదవిలో ఉండటానికి అనర్హుడనని భావించాల్సి వస్తుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం తీరుపై అసహనం వెళ్లగక్కారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారని, ఏం వచ్చినా ఆ జిల్లాకు, వారికే పోతున్నాయని బయట టాక్ నడుస్తుందని, మంత్రులు, సీఎం నియోజకవర్గంలో కాంట్రాక్టులకు బిల్లులు వస్తున్నాయని, ఎమ్మెల్యేల నియోజకవర్గంలో పనులకు బిల్లులు రాకపోవడం బాధకరం అన్నారు. ఎమ్మెల్యేలతోనే ప్రభుత్వం ఏర్పడిందని, బిల్లుల కోసం మంత్రులు, సీఎం చుట్టు ఎమ్మెల్యేలు తిరగాల్సి రావడం బాధగా ఉందని అసంతృప్తి వెళ్లగక్కారు. ముందుగా ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టుల పనులకు నిధులు ఖర్చు పెట్టాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని విద్య, వైద్యం, రోడ్లు, సాగుతాగునీటి ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరారు.
సీఎంకు కొడంగల్ ఎంతో.. నాకు మునుగోడు అంతే..
తెలంగాణ ప్రజలు ఆకలినైనా తట్టుకుంటారుగాని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించబోరని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. సొంత పార్టీనే తెలంగాణ కోసం ఎదురించి పోరాడానన్నారు. మాకు ఓటేసి గెలిపించిన ప్రజలకు నాకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుందన్నారు. సీఎంకు కొడంగల్ అభివృద్ది ఎంతనో.. నాకు మునుగోడు అభివృద్ది అంతే అన్నారు. మంత్రి ఉత్తమ్ నియోజకవర్గంలో ఎకరానికొక లిఫ్టు , 5వేల ఎకరాలకొక లిఫ్టు పెడుతున్నారని, మాకు కాలువలు, రిజర్వాయర్లు, చెరువు, కుంట కూడా దిక్కులేదన్నారు. నన్ను ఎన్నుకునే ప్రజలకు ఏం చెప్పాలంటూ వాపోయారు. నాకు మాట్లాడటం చేతకాకనా? ..మీలాగ ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగే వ్యకిని కానని..మా ప్రభుత్వం ఉండికూడా నా ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడకపోతే అది నేరం అని చెప్పుకొచ్చారు. ఒకవేళ నా ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండటానికి అనర్హుడనని తేల్చి చెప్పారు. రెండున్నరేళ్లుగా ఇదే అంశాలపై బాధపడుతున్నానని, ఈరోజు మాట్లాడుతున్నానన్నారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రాంతాల వారిగా, నియోజకవర్గాల వారిగా వివక్ష చూపకుండా ప్రాధాన్యతను అనుసరించి వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి నిధులు కేటాయించాలని కోరారు.
బీఆర్ఎస్ విధ్వంస పాలనతో రాష్ట్రానికి సమస్యలు
మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో విద్య, వైద్య రంగాలతో పాటు అన్ని రంగాలను విధ్వంసం చేశారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. నియంత మాదిరిగా చేసిన కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిర్ణయాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా, అన్ని రకాలుగా సంక్షోభంలోకి నెట్టారన్నారు. బీఆర్ఎస్ అప్పుల భారం కాంగ్రెస్ ప్రభుత్వానికి ముళ్ల కిరిటంలా మారిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యావ్యవస్థ బలోపేతం కోసం సంస్కరణలు చేస్తుండటం అభినందనీయమన్నారు. ప్రభుత్వ విద్యా సంస్ధలలో కనీస వసతులు లేవని దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. తుమ్మడి హట్టి వద్ద కట్టాల్సిన ప్రాణహిత చేవెళ్లను ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి చేసిన నిర్వాకం అందరికి తెలిసిందేనన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీరందించలేదన్నారు. పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టును కేసీఆర్ డిండీ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ గా మార్చి రెండున్నరేళ్లలో పూర్తి చేస్తాననని చెప్పి.. ఆర్ఆండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయకుండా రూ.5వేల కోట్లతో ముందుగా రిజర్వాయర్లు కట్టారన్నారు. ఇప్పటిదాక ఎక్కడి నుంచి వాటికి నీళ్లు తీసుకరావాలో నిర్ణయించలేదన్నారు. హెడ్ వర్క్ పనులు, కాల్వల పనులు కాలేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయన్నారు.
ప్రాధాన్యత వారిగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి
కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లతో మూడేళ్లలో పూర్తి చేశారని, పాలమూరు రంగారెడ్డిని మాత్రం ఇప్పటిదాక పూర్తి చేయలేదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. పాలమూరు, నల్లగొండ, మునుగోడు, దేవరకొండ ప్రజలు తెలంగాణ ఉద్యమం చేయలేదా…ఈ ప్రాంత ప్రజల పట్ల, ప్రాజెక్టుల పట్ల ఎందుకు ప్రభుత్వాలు వివక్ష ప్రదర్శిస్తున్నాయని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మునుగోడు నియోజవర్గ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో శ్రద్ద చూపాలని కోరారు. డిండి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఈ రోజు ఆగిపోయి ఉన్నాయన్నారు. ఉదయం సముద్రం రిజర్వాయర్ పూర్తయినా..కాలువలు, భూసేకరణ పనులు చేయక నీరందించే మార్గం లేకుండా పోయిందని, అసంపూర్తి పనులు పూర్తి చేయించి లక్ష ఎకరాలకు నీరివ్వాలని కోరారు. ఉదయ సముద్రం ప్రాజెక్టును ఏ కేటగిరిలో పెట్టాలన్నారు.
హ్యామ్ రోడ్లతో జాగ్రత్త సోదరా..!
హ్యామ్ రోడ్ల కనెక్టవిటీ విషయంలో జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉందని, ఎక్కడా అవసరమైన భూసేకరణ చేయకుండా..బ్లాక్ స్పాట్ లను గుర్తించకుండా వేలకోట్లతో రోడ్లు నిర్మించడం ఎలా చేస్తారని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.. రోడ్ల నిర్వాసితులు పనులకు అడ్డుపడే అవకాశం ఉందన్నారు. 100శాతం భద్రతా ప్రమాణాలు ఖరారుచేశాకే టెండర్లు ఖరారు చేయాలని, రోడ్ల పనుల పర్యవేక్షణకు థర్డ్ పార్టీ ఇండిపెండెంట్ ఇంజనీరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. హ్యామ్ రోడ్ల పనుల్లో జాగ్రత్తగా లేకపోతే కాంట్రాక్టర్లు ఎక్సెస్ పనులతో వేలకోట్లు అధిక బిల్లులు కోరే అవకాశం ఉందని, దేశంలో హ్యామ్ రోడ్ల వ్యవస్థ విజయవంతమైన చరిత్ర లేదని, మంత్రి వెంకట్ రెడ్డి దీనిపై దృష్టి పెట్టాలని కోరారు.
ప్రాధాన్యత వారిగానే పనులు జరిపిస్తాం: మంత్రి ఉత్తమ్
రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ…ప్రాధాన్యత మేరకు పెండింగ్ ప్రాజెక్టు పనులు జరిపిస్తున్నామని, ఉదయ సముద్రం ప్రాజెక్టు పెండింగ్ బిల్లులు చెల్లించి పనులు కొనసాగేలా చూస్తున్నామని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టుల భూసేకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వరకు రూ.5వేల కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు కూడా ముందుకు తీసుకెలుతూ నల్లగొండ జిల్లాకు నీరందించే లక్ష్యంతో సాగుతున్నామన్నారు. కృష్ణా ప్రాజెక్టులన్నింటిపై కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, మా ప్రభుత్వంలో రెండున్నరేళ్లలో వాటిన్నింటిని ప్రాధాన్యతల వారిగా పూర్తి చేయిస్తామని స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram