డైవర్షన్ పాలిటిక్స్ కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్: హరీశ్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కోసమేనని హరీశ్ రావు విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చకు దూరంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
విధాత, హైదరాబాద్ : ఆరు గ్యారెంటీలపై స్పష్టత ఇవ్వకుండా.. ప్రజా సమస్యలపై చర్చకు పారిపోయి, కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీని అర్థాంతరంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్ రావు విమర్శించారు. మంత్రి పొంగులేటి అవినీతిని మేం ఆధారాలతో బయటపెడితే.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిందని ఆరోపించారు. ప్రతిపక్షం లేకుండానే ముఖ్యమైన బిల్లులను ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. రాఘవ కనస్ట్రక్షన్ కంపెనీ అక్రమాలపై హౌస్ కమిటీ పనికిరాదని చెప్పి, శాసనసభ్యులకు, శాసనసభకు గౌరవాన్ని తగ్గించారని తప్పుబట్టారు.
సోమవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న 19 సమస్యలపై షార్ట్ డిస్కషన్ కోసం బీఆర్ఎస్ పక్షాన నోటీసులు ఇచ్చినా, ఏ ఒక్క అంశం పైనా ప్రభుత్వం సభలో చర్చకు రాలేదు అన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి ఒక్క ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాం కూడా లేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు. సభా సాంప్రదాయాలకు పూర్తిగా తిలోదకాలిచ్చారు అని, నియమ నిబంధనలు, సభా మర్యాదలను, ప్రతిపక్షాల పట్ల కనీస గౌరవాన్ని తుంగలో తొక్కారు అన్నారు. సభలో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాడిన అహంకారపూరిత, వీధి రౌడీల భాషను ఎథిక్స్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడ్డప్పుడల్లా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం, గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరేమీ లేదు అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజైనా, అప్రాప్రియేషన్ రోజైనా ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా ఎత్తివేసిందని హరీశ్ రావు గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం రోజు, ఆర్థిక మంత్రి బడ్జెట్ పెట్టిన రోజు ప్రశ్నోత్తరాలు లేవు అని మండిపడ్డారు. సభ జరిగిన రోజుల్లో సగం రోజులు ప్రశ్నోత్తరాలు నడపలేదు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలు చర్చకు రాకుండా చేశారు అని విమర్శించారు. ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీని సమయానికి ప్రారంభించలేదు అని, శాసనసభను గాంధీభవన్‌లాగా మార్చేశారు అని ఆరోపించారు. వారం రోజులు సభను ఎక్స్‌టెండ్ చేయమని అడిగినా ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. కేరళ ఎన్నికల ప్రచారం కోసం అసెంబ్లీని 30వ తేదీనే హడావుడిగా ముగించారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, ప్రజా సమస్యలు ముఖ్యమా? లేక కేరళ ఎన్నికల ప్రచారం ముఖ్యమా? అని నిలదీశారు. హేట్ స్పీచ్ బిల్లును చివరి రోజు తెచ్చి ఎలాంటి చర్చ లేకుండానే ముగించారని, పద్దులన్నీ ఆఖరి రోజు పెట్టి గిలెటిన్ చేసుకొని పారిపోయారు అని, ఇరిగేషన్ పద్దు మీద కూడా కనీస చర్చ లేకుండా పాస్ చేసుకున్నారని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టాం
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఇద్దరూ మా బడ్జెట్ చింపుతారా? అని మాట్లాడుతున్నారని, అది పూర్తిగా డొల్ల బడ్జెట్ట కాబట్టే చింపి మా నిరసనను వ్యక్తం చేశాం అని హరీశ్ రావు తెలిపారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారని, టి మంది మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తానని చెప్పి మూడు బడ్జెట్లలో ఎందుకు నిధులు పెట్టలేదు అని ప్రశ్నించారు. మీ మోసాలను అర్థం చేయించడానికే సభలో వినూత్నంగా చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపామని తెతలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 16 వేల ఉద్యోగాలే అని వారే శాసనసభకు ఇచ్చిన సమాధానంతో స్పష్టమైందన్నారు. గడిచిన రెండున్నర సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్‌కు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని రుజువు చేశాం అని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై కూడా స్పష్టంగా బహిర్గతం చేశాం అని, రెండున్నర ఏళ్లలో దళితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఈ ప్రభుత్వ వైనాన్ని సభా సాక్షిగా ఎండగట్టాం అని, దళితులపై రేవంత్ రెడ్డిది కేవలం కపట ప్రేమ మాత్రమేని బహిర్గతం చేశాం అని చెప్పుకొచ్చారు. చిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు సహా అన్ని వర్గాల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీశామని, మాకు శాసనసభ మాత్రమే వేదిక కాదు, ప్రజాక్షేత్రంలో అన్ని వేదికలపైనా ప్రభుత్వ తప్పిదాలను ఎండగడతాం అని తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టంచేశారు.
కాళేశ్వరంపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వ్యాఖ్యలు అభ్యంతరకరం
కాళేశ్వరంపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం.. ఇది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఫెవికాల్ బంధానికి నిదర్శనం అని హరీశ్ రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 90 వేల కోట్లు, లక్ష కోట్లు కొట్టుకుపోయాయి అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ఎలా మాట్లాడుతారు? అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ‘ఎకనామిక్ సర్వే’, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టిన బడ్జెట్ లెక్కలే కాళేశ్వరం విజయానికి సజీవ సాక్ష్యాలు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోతే.. మల్లన్న సాగర్‌లో 25 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాతో రండి.. కాళేశ్వరం జలాలతో గలగలా పారుతున్న గోదావరి నీళ్లను, పండుతున్న పొలాలను చూపిస్తాం అన్నారు.
భువనగిరి జిల్లాలో ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు కాలువలకు వెళ్లి నీళ్లు వదులుతున్నారు కదా.. అవి కాళేశ్వరం నీళ్లు కావా? అని హరీశ్ రావు నిలదీశారు. గంధమల్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు, అది కాళేశ్వరంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు తాగునీటి కోసం మూసీ పక్కనుంచి 20 టీఎంసీల నీళ్లు తెస్తామని రూ. 8,000 కోట్లతో కాలువలు తవ్వుతున్నారు కదా.. కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్నసాగర్ నుంచి ఆ నీళ్లు ఎలా వస్తున్నాయి? అన్నారు. ఈ నిమిషానికి కూడా మల్లన్న సాగర్‌లో 25 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. వాస్తవాలను మరుగునపరిచి బీఆర్ఎస్‌పై బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణకు వస్తే కేంద్ర మంత్రులకు కాళేశ్వరం నీళ్లు చూపిస్తాం
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కి, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ నాయకులకు నేను సవాల్ విసురుతున్నానని హరీశ్ రావు పేర్కొన్నారు. మీరు తెలంగాణకు వస్తే… యాదాద్రి భువనగిరి, చొప్పదండి, జగిత్యాల, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్ రైతుల్ని అడుగుదాం పదండని, గలగలా పారుతున్న ఆ గోదావరి నీళ్లు ఎక్కడివో అడుగుదాం. కాళేశ్వరం నీళ్ల వల్ల పండిన పచ్చని పొలాలను చూద్దాం, రైతులను పలకరిద్దాం రండి అని సవాల్ చేశారు. సిద్దిపేటలో ఈ నిమిషానికి 80,000 ఎకరాల పంట పండింది.. అవన్నీ కాళేశ్వరం నీళ్లతో పండిన పంటలే కదా అన్నారు. నేను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి 20 ఉత్తరాలు రాశాను. ప్రభుత్వం కేవలం రూ. 50 కోట్లు విడుదల చేస్తే.. కొత్తగా ఒక సంవత్సరానికి రెండు లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. కానీ ఆ నిధులు ఇవ్వకుండా పగపట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర తెలంగాణపై పగబట్టింది. కరీంనగర్, నల్గొండ, యాదాద్రి, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు 50 కోట్లు ఇస్తే రెండు లక్షల ఆయకట్టుకు నీళ్లు వస్తాయన్నారు. కానీ అలా నీళ్లు ఇస్తే కాళేశ్వరం పోయింది అని తాము చెప్పిన అబద్ధం ఎక్కడ బయటపడుతుందో అన్న అక్కసుతో రైతులకు శిక్ష వేస్తున్నారని ఆరోపించారు. మా మీద మీకు పగ, ద్వేషం ఉంటే మాకు శిక్ష వేయండి.. కానీ రైతుల పొట్ట కొట్టకండని. తక్షణమే ఆ నిధులు విడుదల చేసి కాలువలకు నీళ్లు వదలేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని అడిగితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు పారిపోయారు? అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ఘనతలను గతంలో కేంద్రమే ప్రశంసించింది
కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని, కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శం అని కేంద్ర మంత్రులు, అధికారులు చెప్పారు అని హరీశ్ రావు గుర్తు చేశారు. ఇది తెలంగాణకు వరప్రదాయిని అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని, తెలంగాణకు ఇది ముక్తేశ్వర ప్రాజెక్టు అని ఆనాటి గవర్నర్ నరసింహన్ కొనియాడారని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. కాళేశ్వరం కంటే గొప్ప ప్రాజెక్టు దేశంలో లేదని సాక్షాత్తూ ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు చెప్పారని, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేందర్ సింగ్ గోదావరి నదికి నడకలు నేర్పి జీవనదిగా మార్చారు అని ప్రశంసించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పనులు జరుగుతున్నాయి, ప్రాజెక్టు డిజైన్లు, ప్రణాళికలు చాలా బాగున్నాయి అని సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుస్సేన్ కితాబిచ్చారని, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రాజెక్టును విజిట్ చేసి ఇదొక అద్భుతం అని చెప్పారని వెల్లడించారు. అమెరికాలోని సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డు ఇచ్చి సత్కరించిందని, సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు కూడా ప్రాజెక్టును ప్రశంసించారని తెలిపారు. నిన్నగాక మొన్న ఇదే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా’ (చాప్టర్ 8) రిపోర్ట్ ప్రకారం.. “2014లో తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2023 నాటికి ఏకంగా 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ నిర్మించిన ‘కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ’ పథకాలే” అని కుండబద్దలు కొట్టిందని హరీశ్ రావు వెల్లడించారు. ఇక నిన్న బడ్జెట్‌లో సాక్షాత్తూ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డే.. కాళేశ్వరం ప్రాజెక్టులో పారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 2024 లో 3000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది. 2025లో కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చాము అని స్పష్టంగా చెప్పారని తెలిపారు.
ప్రాజెక్టు లక్ష కోట్లు కొట్టుకుపోతే.. ఈ కొత్త ఆయకట్టుకు పారకం ఎక్కడినుంచి వచ్చింది? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి :
విప్ప చెట్ల పెంపకానికి సీఎం రేవంత్ కు లేఖ రాశా: అనిరుధ్ రెడ్డి
Stampede At Sheetla Temple | ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది భక్తుల మృతి!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram