విప్ప చెట్ల పెంపకానికి సీఎం రేవంత్ కు లేఖ రాశా: అనిరుధ్ రెడ్డి
విప్ప చెట్ల పెంపకానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి లేఖ. 10 లక్షల మొక్కల నాటకం, ఆదివాసీలకు ఉపాధి, రాష్ట్రానికి ఆదాయం లక్ష్యంగా ప్రతిపాదన.
విధాత, హైదరాబాద్ : విప్ప సారా తేవాలని…ఇందుకోసం విప్ప మొక్కలు నాటాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లుగా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. విప్ప పువ్వు సారా, ఉత్పత్తుల తయారీ కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో 10లక్షల మొక్కలు, చెట్లు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశానన్నారు. ఇందుకోసం అన్ని పార్టీలకు చెందిన 55మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మద్దతుగా సంతకాలు చేశారని వెల్లడించారు. ప్రధాని మోదీ సైతం మన్ కీ బాత్ లో పిల్లలకు మహువా లడ్డూ తినాలని చెప్పారని గుర్తు చేశారు. ఆదివాసీల అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, ప్రభుత్వాలకు ఆదాయం కోణంలో విప్ప పువ్వు ఉత్పత్తులకు మద్దతునివ్వాలని బీఆర్ఎస్ ను సైతం కోరుతున్నామన్నారు. నా ప్రతిపాదనలకు క్రమంగా అన్ని వర్గాల ప్రజల నుంచి, ఎస్టీ సోదరుల నుంచి మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రకృతి సహజసిద్దమైన నీరా ఉత్పత్తి కూడా ఆరోగ్యానికి మంచిదని…నీరా ఉత్పత్తుల అభివృద్ది జరుగాల్సిందేనని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.
నేను విప్ప సారా, అనుబంధ ఉత్పత్తులు తీసుకరావాలని కోరితే…సారా తేవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనిరుధ్ రెడ్డి తప్పుబట్టారు. బ్రిటీష్ కాలంలో వారి లిక్కర్ అమ్మకాల కోసం కుట్ర పూరితంగా విప్ప సారాను నిషేధించారని.. ఆ తర్వాత బ్రిటీష్ వాళ్లే విప్పపువ్వులను మన దేశం నుంచి దిగుమతి చేసుకుని.. మహువా డ్రింక్స్ పేరుతో బాటిల్ ఒక్కటి రూ.6వేల నుంచి 10వేల వరకు విక్రయిస్తుండటాన్ని అంతా గమనించాలని గుర్తు చేశారు. మెక్సికోలో టెకిలా, చైనాలో మెతాయి, జపాన్ లో సాకే అని ఆర్గానిక్ డ్రింక్స్ ను తయారు చేసి ఎగుమతి చేసి భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నారని పునరుద్ఘాటించారు. అలాంటప్పుడు ప్రపంచంలోనే విప్ప పువ్వుతో మాత్రమే లభించే విప్ప పువ్వు డ్రింక్స్, ఉత్పత్తులను ఎందుకు తయారుచేసి విక్రయించకూడదని ప్రశ్నించారు. గతంలో సారా బంద్ చేసినప్పుడు రూ.400కోట్ల ఎక్సైజ్ టర్నోవర్ ఉందని…తర్వాతా 700కోట్ల విస్కీ కొంటున్నారని గుర్తు చేశారు.
గతంలో సారాను నిషేధించిన టీడీపీ పార్టీ..ఇప్పుడు ఏపీలో విప్ప పువ్వు ఆధారిత డ్రింక్ విక్రయిస్తుందని వెల్లడించారు. చిత్తూరు వద్ద ఫ్యాక్టరీ పెట్టి విప్ప పువ్వు డ్రింక్ తయారు చేసి ఎగుమతి చేస్తుందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, గోవా, జార్ఖండ్ రాష్ట్రాలలో విప్ప పువ్వుతో తయారుచేసిన డ్రింక్స్ విక్రయిస్తున్నారని, తద్వారా గిరిజన, ఆదివాసీలకు ఉపాధి, రాష్ట్రాలకు ఆదాయం లభిస్తుందన్నారు. అలాగే తెలంగాణలో విప్ప పువ్వు డ్రింక్స్, ఉత్పత్తులను ప్రభుత్వమే సొంత బ్రాండ్ తో తయారీ, విక్రయాలు సాగించాలని సూచిస్తున్నామన్నారు. గోవాలో పెన్ని పేరుతో విప్ప డ్రింక్ అమ్ముతున్నారని, మనవాళ్లు చాలమంది అక్కడికి వెళ్లి తాగుతున్నారని తెలిపారు. విప్ప ఉత్పత్తులను ప్రవేశ పెట్టడం ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్య, వైద్యం కోసం ఖర్చు పెట్టవచ్చని సూచించారు.
ఓ రాజకీయ నాయకుడిగా నేను విప్ప సారా కోసం మాట్లాడితే..అదిగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నేను సారా తాగమని చెప్పడం లేదని, మహిళలు తమ భర్తలను తాగొద్దని ఒట్టు వేయించుకోవాలని సూచించారు. అదే సినిమా వాళ్లు మాత్రం సినిమాల్లో మందు తాగమని చెబితే చప్పట్లు కొడుతారన్నారు. సినిమాల్లో బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో మామా ఏక్ పెగ్ లా, మందుబాబులం అని చూపిస్తే పెగ్గులు తాగుతున్నారు అని, రాజకీయ నాయకుడి టేబుల్ మీద గ్లాస్ కనిపిస్తే అదిగో మందు తాగుతున్నాడని ప్రచారం చేస్తారని విమర్శించారు. అసలు సినిమాల్లో మద్యం తాగడమనేదే చూపించొద్దు అని, సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా? అని ప్రశ్నించారు. సినీ హీరోలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలి అని, అభిమానులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. నేను డ్రగ్ టెస్ట్ చేయించుకున్నానని తెలిపారు. టెస్ట్ చేయించుకోకపోతే హీరోలు డ్రగ్స్ తీసుకున్నట్టేనన్నారు. డ్రగ్స్ టెస్టుల తర్వాతే సినిమా విడుదలనే షరతు పెట్టాలని డిమాండ్ చేశారు.
రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యేగా నాకు పిల్లల చదువులపై కూడా దృష్టి సారించే సమయం కూడా ఉండటం లేదన్నారు. నిత్యం ప్రజల కోసమే ఆలోచించే నాయకుడిగా నేను స్వయంగా అధ్యయనం చేశాకే విప్ప సారా గురించి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. విప్ప పువ్వుతో సారానే కాదు, ఆకులతో కాస్మోటిక్స్, బెరడుతో ఔషదాలు చేయవచ్చన్నారు. విప్పపువ్వు సారాతో వంట నూనె తయారు చేసి వినియోగిస్తే కూడా ఆరోగ్యానికి మంచిదన్నారు. మన దేశంలో దొరికే ప్రకృతి ప్రసాదం విప్పపువ్వుతో విప్ప వైన్, కూల్ డ్రింక్స్, కేక్, ఐస్ క్రీమ్, ఆయిల్, లడ్డూ, చాక్లెట్, కాస్మోటిక్స్ లు తయారుచేసి విక్రయించడం ద్వారా ఆదివాసీలకు, రాష్ట్రానికి ఆదాయంతో పాటు ప్రజల ఆరోగ్యం కాపాడాలని నేను ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందన్నారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారి ప్రెస్ మీట్
https://t.co/5qaoS2Kdns— Telangana Congress (@INCTelangana) March 31, 2026
ఇవి కూడా చదవండి :
Padi Kaushik Reddy| బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
CAG Report | బాంబు పేల్చిన కాగ్ రిపోర్ట్… తెలంగాణ బడ్జెట్ లోపాలు బట్టబయలు.. లక్ష్యాలకు 76% మాత్రమే అమలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram