హైలైట్స్:

  • 400 సీట్లు లక్ష్యంగా బీజేపీ అశ్వమేధ యాగం
  • సోలోగా 2029 ఎన్నికలకు రోడ్డు మ్యాప్ సిద్ధం?
  • దారికి రాకుంటే సామ దాన భేద దండోపాయాలు

విధాత, హైదరాబాద్:
దేశంలో 2029 సార్వత్రిక ఎన్నికలు లేదా ముందస్తు పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా 400 సీట్లు కైవసం చేసుకోవాలని బీజీపీ ఆరాటపడుతున్నదా? గత లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బల నేపథ్యంలో ఆ దిశగా ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నదా? ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడకూడదని భావిస్తున్నదా? దేశవ్యాప్తంగా పాన్ ఇండియా ఫుట్‌ప్రింట్‌ను అమలు చేసే యోచనలో బీజేపీ అధినాయకత్వం ఉన్నదా? ఇప్పడు ఇవే అంశాలు ఢిల్లీ రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. 2029 లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులతో సంబంధం లేకుండా బీజేపీ అభ్యర్థులు మాత్రమే గెలిచేలా ప్రణాళికలు రూపొందించారని ఈ చర్చల్లో వినిపిస్తున్నది. ఈ క్రమంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తన అనుకూల ప్రాంతీయ పార్టీలకు కాషాయ రంగు పులిమేందుకు బీజేపీ అశ్వేమేథ యాగాన్ని తలపెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాసంలో పార్టీ కీలక నాయకత్వం నిర్వహించినట్టు చెబుతున్న సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ హాజరయ్యారు. ప్రాంతీయ పార్టీలను సామ దాన భేద దండోపాయ విద్యల ద్వారా తమ పార్టీలో విలీనం చేసుకునేందుకు ఈ సమావేశంలో వ్యూహాలు సిద్ధం చేశారని తెలుస్తున్నది. చెప్పిన ప్రకారం వింటే సరే లేదంటే దారికి తెచ్చుకునేందుకు ఎంతదాక అయినా వెళ్లనున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ప్రాంతీయ పార్టీలతో మొదలైన చర్చలు

బీజేపీ ముఖ్యుల సమావేశానికి ముందే తమిళనాడులో తమిళ మనీల కాంగ్రెస్ (ముపనార్) అధినేత జీకే వాసన్, అమ్మా మక్కల్ మున్నెట్ర కళగం అధినేత టీటీవీ దినకరన్‌తో పీయుష్ గోయల్ సమావేశమయ్యారని తెలుస్తున్నది. వారి పార్టీలను బీజేపీలో విలీనం చేయాలని గోయల్‌ కోరగా.. సానుకూల స్పందన రాలేదని సమాచారం. ఎన్డీఏలో కలిసేందుకు దినకరన్ అంగీకారం తెలపగా, వాసన్ మాత్రం ఏ విషయం చెప్పలేదని అంటున్నారు. ద్రవిడ సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నామని, హిందూత్వ భావజాలం కలిగిన బీజేపీతో కలవడం అంటే రాజకీయ ఆత్మహత్య చేసుకున్నట్టేనని వాసన్ భావిస్తున్నారని సమాచారం.

ఏపీలో బీజేపీ నేతగా పవన్‌కు ఆఫర్‌?

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనుగడలో ఉండటానికి మద్దతిస్తున్న వారిలో బీహార్‌కు చెందిన జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్, ఏపీలోని టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు. కొద్ది నెలలుగా చంద్రబాబు చేస్తున్న డిమాండ్లు, పనుల మూలంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ పెద్దలు ముభావంగా ఉన్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన డిమాండ్లను పరిష్కరిస్తే ఒక సమస్య, పరిష్కరించకపోతే మరో సమస్యలా తయారైందని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌తో బీజేపీ పెద్దలు చర్చలు జరపుతున్నారని, జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ఆయనకు సూచిస్తున్నారని సమాచారం. పార్టీని విలీనం చేసి, బీజేపీ నాయకుడిగా ఎన్నికలకు వెళదామని చెబుతున్నారని తెలుస్తున్నది. తద్వారా అటు చంద్రబాబును, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒకేసారి ఓడించి, ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవచ్చంటూ ఉద్బోధ చేస్తున్నారని ఢిల్లీ వర్గాల కథనం. పార్టీలో చేరిన తరువాత ఎన్నికల వ్యయాన్ని తాము చూసుకుంటామని, అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెబుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనలపై ఇప్పటి వరకు పవన్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో బీజేపీ పెద్దలు ఆయన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. ప్రముఖ కంపెనీ కైటెక్స్ గ్రూపు అధినేత సాబు ఎం జాకబ్ ట్వంటీ ట్వంటీ పేరిట పార్టీని ఏర్పాటు చేసి, ఆ తరువాత బీజేపీలో కలిపేసిన విషయం తెలిసిందే.

బీహార్ నుంచి యూపీ వరకు విలీనంపై చర్చలు…

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పుట్టుకువచ్చిన ఇండియన్ ఇంక్లూసివ్ పార్టీ అధినేత ఐపీ గుప్తా ఎన్నికలలో ఒక సీటులో గెలుపొందారు. తమ పార్టీలో విలీనం చేసుకునేందుకు ఐపీ గుప్తాతో బీజేపీ నాయకులు చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఆర్ఎల్ఎస్పీ అధినేత ఉపేంద్ర కుశ్వాహ ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్నారు. ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియగా, నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని తెలుస్తున్నది. ఎమ్మెల్యే కాకుండానే ఆయన కుమారుడు దీపక్ ప్రకాశ్‌కు అప్పటి నితీశ్‌ కుమార్ ప్రభుత్వంలో మంత్రి పదవి కట్టబెట్టడాన్ని ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. తాజాగా రాజ్యసభ సభ్యత్వం కొనసాగాలంటే బీజేపీలో పార్టీని విలీనం చేయాలని ప్రతిపాదన పెట్టారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

యూపీలో అప్నాదళ్‌ (సోనేలాల్‌), నేషనల్‌ లోక్‌దళ్‌ టార్గెట్‌

ఉత్తర ప్రదేశ్ నుంచి అప్నాదళ్ (సోనేలాల్) ఎంపీ అనుప్రియా పటేల్ కేంద్రంలో మంత్రిగా కొనసాగుతున్నారు. విలీనం చేయడానికి తనకు అభ్యంతరం లేదని చెబుతూనే.. అదే జరిగితే ఈ ఖాళీని తన సోదరి పల్లవి పటేల్‌ భర్తీ చేస్తుందని, అప్నాదళ్‌ సానుభూతి పరులను తనవైపు తిప్పుకొనే అవకాశం ఉందని చెప్పారని సమాచారం. అది అంతిమంగా సమాజ్ వాదీ పార్టీకి మేలు చేస్తుందని హెచ్చరించారని ఢిల్లీ వర్గాల కథనం. 2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ లోక్‌దళ్ అధినేత, కేంద్ర మంత్రి జయంత్ చౌదరి త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పది అసెంబ్లీ స్థానాల్లో ఆయన పార్టీ ప్రభావం ఉండగా ఆయన పాతిక స్థానాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పార్టీలో చేరితే వచ్చే ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిస్తామని చెప్పగా అనుచరులతో చర్చిస్తున్నారని సమాచారం.

షిండేకు బ్రెయిన్‌ వాష్‌?

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వం కొనసాగుతున్నది. 2029 పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 35 సీట్లను గంపగుత్తగా కొల్లగొట్టడానికి బీజేపీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నదని తెలుస్తున్నది. తమ పార్టీలో శివసేనను కలిపేయాలని ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేను కోరినట్టు సమాచారం. అయితే.. విలీనం చేస్తే మరాఠా వాదానికి, ఛత్రపతి శివాజీ లక్ష్యానికి గండిపడుతుందని బీజేపీ పెద్దలకు షిండే చెప్పారని తెలుస్తున్నది. శివసేనను బీజేపీలో విలీనం చేస్తే.. ఆ ఖాళీని శివసేన (యూబీటీ) భర్తీ చేసుకుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. బాలా సాహెబ్ బాల్ థాకరే వారసుడిగా తన పార్టీని నిలబెట్టానని పేర్కొన్నారని తెలుస్తున్నది. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులున వీలైనన్ని చోట్ల నిలబెట్టి గెలిపించుకోగలిగారు. అయినప్పటికీ ఆయనతో నిరంతరం చర్చలు జరుగుతునే ఉన్నాయని చెబుతున్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో కూడా…

గత కొద్ది సంవత్సరాలుగా ఈశాన్య రాష్ట్రాలలో పార్టీ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోదీ శ్రద్ధ పెట్టారు. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే అధికారం చేపట్టగా, తాజాగా జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ను బీజేపీ అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకున్నది. ఇప్పటికే త్రిపుర రాష్ట్రంలో టిప్రా మోత పార్టీ, పండిట్ కిశోర్ మాణిక్య డెబ్బర్మా పార్టీలను బీజేపీలో విలీనం చేసుకున్నారు. మిజో నేషనల్ ఫ్రంట్‌ను బీజేపీలో కలిపేసుకునేందుకు ఆ పార్టీ పెద్దలతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఆ రాష్ట్రంలో మిజో నేషనల్ ఫ్రంట్ రెండో అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్నది. మేఘాలయలో కన్రాడ్ సంగ్మాకు చెందిన ఎన్.పీ.పీ బీజేపీ మిత్రపక్షంగానే వ్యవహరిస్తున్నా, విలీనం చేయాలని సంగ్మాపై ఒత్తిడి పెంచుతున్నారని చెబుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బలపడేందుకు 2016లో ఏర్పాటు చేసిన నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ (నెడా)కు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తమ లక్ష్యాలను సాధించేందుకు బీజేపీ పెద్దలు ప్రాంతీయ పార్టీలపై ఒత్తిడి చేయడం, ఎత్తుకు పై ఎత్తుల వేయడం, ప్రోత్సహాకాలు ప్రకటించడం, విభేధాలు తీసుకురావడం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విలీనం చేసేందుకు ముందుకు రాని ప్రాంతీయ పార్టీలలో చిచ్చు పెట్టడం, చీలికలు తీసుకువచ్చే కుట్రలకు కూడా వెనకాడడం లేదని అంటున్నారు.

ఒడిశాలో 24 సంవత్సరాల పాటు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రభుత్వాన్ని, పార్టీని నడిపిన బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌ను బీజేపీ ఇప్పటికే ఓడించింది. అధికారం కోల్పోయిన తరువాత కటక్, భువనేశ్వర్‌లో బీజేడీ నాయకులు నవీన్ పట్నాయక్‌కు వ్యతిరేకంగా గళం విప్పి తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ పరిణామాలను నవీన్ ఊహించలేక, పార్టీని గాడిలో పెట్టలేక సతమతవుతున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.