నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు మృగశిర కార్తే రోజున తెలంగాణలోని ప్రవేశించాయి. గద్వాల జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రెండు,మూడు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ సహా దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. మరోవైపు ‘మృగశిర కార్తె’ ప్రారంభం రోజునే రుతుపవనాలు రాష్ట్రాలను తాకడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొలాలను దుక్కి దున్ని, ఏరువాక పనులు ప్రారంభించడానికి ఈ వర్షాలు ఎంతో అనుకూలమని, ఈ ఏడాది సాగు పనులు లాభసాటిగా సాగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు.. ఏపీ, మహారాష్ట్రలో 30శాతం విస్తరించినట్లు వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో పూర్తిగా వ్యాపించినట్లు పేర్కొన్నారు.ఈ రోజు పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ఇవి మరింతగా విస్తరించినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రుతుపవనాల కదలికలు అత్యంత వేగంగా, బలంగా ఉండటంతో రాబోయే రెండు మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగిలిన అన్ని ప్రాంతాలకు ఇవి పూర్తిగా విస్తరించనున్నాయని తెలిపింది. అలాగే ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మారాయని పేర్కొంది. ప్రస్తుతం రుతుపవనాల విస్తరణకు తోడుగా వాతావరణంలో మరో కీలక మార్పు చోటుచేసుకుందని, తూర్పు ఉత్తర ప్రదేశ్, దాని పొరుగు ప్రాంతాల నుంచి ఉత్తర కోస్తాంధ్ర, యానాం మీదుగా.. ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఒక బలమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం వల్ల రాబోయే 48 నుంచి 72 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.