అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క
రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజల అవసరాలను గమనించి, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అధిక వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో పరిస్థితులను పంచాయతీ రాజ్, గ్రామీణాబివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన, ఈఎన్సీలు కృపాకర్ రెడ్డి, ఎన్ ఆశోక్, ఇతర సంబంధిత అధికారులతో మంత్రి నిరంతరం సమీక్షిస్తున్నారు

- 124 ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు
- రూ.148 కోట్ల మేర నష్టం
హైదరాబాద్, ఆగస్టు 16 (విధాత): రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజల అవసరాలను గమనించి, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అధిక వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో పరిస్థితులను పంచాయతీ రాజ్, గ్రామీణాబివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన, ఈఎన్సీలు కృపాకర్ రెడ్డి, ఎన్ ఆశోక్, ఇతర సంబంధిత అధికారులతో మంత్రి నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా మంచినీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అధిక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. వర్షాల వల్ల తలెత్తే ఎమర్జెన్సీ పరిస్థితులపై తక్షణ స్పందన అవసరమని, ఏ సమస్య ఎదురైనా వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని సీతక్క అధికారులను ఆదేశించారు.
రూ.147.70 కోట్ల మేర నష్టం
భారీ వర్షాల వల్ల పంచాయతీ రాజ్ విభాగానికి చెందిన రహదారులకు వాటిల్లిన నష్టం పై అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 84.97 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు మంత్రి సీతక్కకు నివేదించారు. ఇందులో 48 ప్రాంతాల్లో ఉపరితల రోడ్లు దెబ్బతినగా..తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ.3.32 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ కోసం రూ.42.63 కోట్లు ఖర్చు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. కల్వర్ట్లు, లోకాజ్ వేలు, క్రాస్ డ్రేయిన్ పనులు మొత్తం 77 ప్రాంతాల్లో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. 30 ప్రాంతాల్లో గండ్లు పడగా, తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ. కోటి కి పైగా ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే శాశ్వత పునరుద్ధరణ కోసం రూ. 5.45 కోట్లు ఖర్చు అవుతాయని సమాచారం. పంచాయతీరాజ్ పరిధిలో మొత్తం 124 రోడ్లు దెబ్బతినగా..తాత్కాలిక పునరుద్ధరణ పనుల కోసం సుమారు రూ. 6 కోట్లు శాశ్వత పునరుద్ధరణ కోసం రూ. 141 కోట్ల వరకు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన పునరుద్ధరణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.