Cyclone Montha lashes Warangal | అల్లకల్లోల ఓరుగల్లు : మొంథా ధాటికి రెడ్​ అలర్ట్​ జారీ

మొంథా తుఫాన్‌ ప్రభావంతో వరంగల్‌, హన్మకొండ, ఖాజీపేట త్రినగరాలు జలమయమయ్యాయి. వాతావరణశాఖ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. రోడ్లు, కాలనీలు నీటమునిగాయి. వరంగల్​ రైల్వే స్టేషన్​లో పట్టాలు నీటిలో మునగడంతో పలురైళ్లు రద్దు చేసారు. బస్టాండ్‌ ప్రాంతాలు కూడా ముంపులోకి వెళ్లాయి. జనగామలో పంటపొలాలు నీట మునిగాయి.

Cyclone Montha lashes Warangal | అల్లకల్లోల ఓరుగల్లు : మొంథా ధాటికి రెడ్​ అలర్ట్​ జారీ

Montha Cyclone lashes Warangal – City submerged, red alert issued as torrential rains cause chaos

విధాత ప్రధాన ప్రతినిధి, వరంగల్​:

Cyclone Montha on Warangal | మొంథా తుఫాన్‌ సముద్ర తీరాన్ని దాటి బలహీనపడినా, దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రాన్ని తాకుతూ భయంకర దృశ్యాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా వరంగల్‌, హనుమకొండ‌, జనగామ జిల్లాలు ముంపుతో అల్లాడుతున్నాయి. వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించగా, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు.

Warangal Railway Station submerged under floodwater after heavy rains from Montha Cyclone, with halted trains and waterlogged tracks

ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నగరం జలమయమయింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లమీద నదుల్లా ప్రవహిస్తోంది. ఖిలావరంగల్‌, బస్టాండ్‌ సెంటర్‌, హెడ్‌పోస్ట్‌ ఆఫీస్‌, CKM హాస్పిటల్‌, జేపీఎన్‌ రోడ్‌, వరంగల్​ చౌరస్తా, బట్టలబజార్‌, అండర్‌బ్రిడ్జ్‌ ప్రాంతాలు నీటమునిగిపోయాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిల్వ ఉండడంతో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ మళ్లిస్తున్నారు.

రైల్వే ట్రాక్‌ల పైకి నీరు చేరడంతో అనేక రైళ్లు నిలిపివేయబడ్డాయి. విజయవాడ వైపు వెళ్లే రైళ్లు రద్దు చేయగా, కొన్నింటిని పగిడిపల్లి మీదుగా మళ్లించారు. ప్రయాణికులు స్టేషన్లలో ఇరుక్కుపోయారు.

 

హనుమకొండ‌లో రికార్డు స్థాయి వర్షపాతం – 30 సెంటీమీటర్లకు పైగా అవకాశం

హనుమకొండ‌లో ఉదయం నుండి 20–25 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. రాత్రికి 30–35 సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. కొత్త బస్టాండ్‌లో నీరు చేరి వందలాది ప్రయాణికులు ఇరుక్కుపోయారు. గోకుల్‌నగర్‌, కృష్ణనగర్‌, సమ్మయ్యనగర్‌, నయీంనగర్‌, రామ్​నగర్‌ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

జూబ్లీ మార్కెట్‌ రోడ్‌, కొత్తవాడ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువులు పొంగి పొర్లుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

నగర అభివృద్ధిపై ప్రజల ఆగ్రహం

పౌరసదుపాయాల లేమిపై ప్రజలు మండిపడుతున్నారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం, గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం మాదిరిగానే మౌలిక సదుపాయాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తున్నారు. మురుగునీటి వ్యవస్థ బలహీనత వల్ల ప్రతి సంవత్సరం ముంపు సమస్య కొనసాగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనగామలో పరిస్థితి విషమం – ఆందోళనలో రైతులు

జంగావ్ జిల్లా కోడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో వర్షాల ధాటికి రోజువారీ జీవితం స్తంభించింది. రైతులు, కూలీలు పనికి వెళ్లలేకపోతున్నారు. పంట పొలాలు మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

వాతావరణశాఖ ప్రకారం రాబోయే ఐదు గంటల పాటు తీవ్ర వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. రాబోయే కొన్ని రోజుల పాటు కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించింది. అధికారులు రెడ్‌ అలెర్ట్‌ కొనసాగిస్తూ అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచారు.

⚠️ కలెక్టర్‌ సత్య శారద సూచనలు – కంట్రోల్‌ రూమ్‌లు సిద్ధం

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద అన్ని శాఖలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తహసీల్దార్‌లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు.

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు:
📞 Collectorate: 1800-425-3424, 91542-52936
📞 GWMC: 1800-425-1980, 97019-99676

వాగులు, చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లకూడదని సూచించారు.

Montha Cyclone Impact:
వరంగల్‌, హన్మకొండ జిల్లాలపై మొంథా తుఫాన్‌ ప్రభావం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన నగరాలు జలమయమైపోయాయి. రోడ్లు నదుల్లా మారి రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణశాఖ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది.