• Telugu News
  • /Hyderabad

హెచ్ సీఏ అధ్యక్షుడి ఎన్నిక చెల్లదు: తెలంగాణ హైకోర్టు

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అమర్నాథ్ నియామకం చెల్లదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్త ఎన్నికలు జరపాలని ఆదేశించింది.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Jun 08, 2026, 3:33 pm IST
Read Time: 3 mins
హెచ్ సీఏ అధ్యక్షుడి ఎన్నిక చెల్లదు: తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్ అధ్యక్షుడిగా అమర్నాథ్ ఎన్నిక చెల్లదని, వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించండని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హెచ్ సీఏం అధ్యక్షుడు అమర్నాథ్ ను వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని.. స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

2023 అక్టోబర్ 20న జరిగిన హెచ్ సీఏ ఎన్నికల్లో.. నాటి అధ్యక్షుడు జగన్ మోహన్ రావు చేతిలో ఒకే ఒక్క ఓటు తేడాతో అమర్నాథ్ ఓడిపోయారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఫోర్జరీ పత్రాలతో జగన్ మోహన్ రావు పోటీ చేశారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గెలాక్సీ క్రికెట్ క్లబ్‌కు చెందిన అమర్‌నాథ్ ఫిర్యాదుతో అంబుడ్స్‌మన్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్ అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావు ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించారు. జగన్ మోహన్ రావు స్థానంలో అమర్ నాథ్ ను హెచ్ సీఏ అధ్యక్షుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సంస్థ కార్యకలాపాలు ఆగిపోకూడదనే ఉద్దేశంతో, రన్నరప్‌గా నిలిచి 62 ఓట్లు సాధించిన అమర్‌నాథ్‌ను అధ్యక్షుడిగా ప్రకటించారు.

అయితే తన తొలగింపును సవాలు చేస్తూ జగన్ మోహన్ రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు అంబుడ్స్ మన్ ఆర్డర్ తో హెచ్ సీఏ ప్రెసిడెంట్ అయిన అమర్ నాథ్ నియామకం చెల్లదని తీర్పు వెలువరించింది. కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని హెచ్ సీఏ సెక్రెటరీ జీవన్ రెడ్డిని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హెచ్ సీఏ ఎన్నికల ప్రక్రియ వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చినట్లయ్యింది.