ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, ఖరీఫ్,రబీ కలిపి దేశంలోనే రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 147 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామని తెలంగాణ ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యాసంగి సీజన్ లో దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు రూ.35,077 కోట్లు రైతుల ఖాతాలో వేశామని చెప్పారు. దేశంలో పండే వరిలో 61 శాతం తెలంగాణ నుంచే వస్తుందని తెలిపారు.

పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు రూ.1.35లక్షల కోట్లు ఇచ్చిందని, తాము రెండేళ్లలోనే రైతులకు రూ.లక్ష కోట్లు ఇచ్చామని ఉత్తమ్ వెల్లడించారు. ధాన్యంకొనుగోళ్లపై ప్రతిపక్షాలు ప్రభుత్వన్ని బద్నాం చేసేందుకు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. యాసంగిలో 8,575 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టామని, కేంద్రం టార్గెట్ 52లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే అయితే..మా ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడకుండా ఇప్పటికే 75 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించిందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణ కంటే ఎక్కువ ధాన్యం సేకరించలేదని మంత్రి వెల్లడించారు. కేంద్రం ప్రతి ఏటా తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ టార్గెట్ తగ్గించుకుంటోందని, ఇది మంచి పద్దతి కాదన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం తెలంగాణ ధాన్యం సేకరణ కోటా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.