చిక్కిన మ్యాన్ ఈటర్ పెద్దపులి

మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో యువకుడిని హతమార్చిన మ్యాన్ ఈటర్ పెద్దపులిని అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు, మత్తుమందు సహాయంతో బంధించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 06, 2026, 3:11 pm IST
Read Time: 3 mins
చిక్కిన మ్యాన్ ఈటర్ పెద్దపులి

మ్యాన్ ఈటర్ గా మారిపోయిన ఓ పెద్దపులి ఎట్టకేలకు అటవీ అధికారులకు బందీగా చిక్కింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా అధికార యంత్రాంగాన్ని, ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన మ్యాన్ ఈటర్ పెద్దపులిని అటవీశాఖ అధికారులు బంధించారు. తడోబా అభయారణ్యాల్లోని వారం క్రితం ఆ పెద్దపులి ఓ యువకుడ్ని హతమార్చింది. ఫారెస్టు బఫర్ జోన్‌లో ఉన్న చోర్ గావ్‌కు చెందిన సంజయ్ అనే యువకుడిపై వారం కిందట పొలంలో పనులు చేస్తుండగా పెద్దపులి దాడి చేసి చంపి తినేసింది. దీంతో పరిసర గ్రామాల ప్రజల తాము పొలాల వద్దకు వెళ్లాలంటేనే వణికిపోయారు. మ్యాన్ ఈటర్ గా మారిన ఆ పెద్దపులిని పట్టుకోవాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్పందించిన అటవీ అధికారుల మ్యాన్ ఈటర్ పెద్దపులిని ప‌ట్టుకునేందుకు రంగంలోకి దిగారు.

వారంరోజులుగా అదే గ్రామ పరిసరాల్లో తిరుగుతున్న పెద్ద పులిని ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించి, షూటర్ ద్వారా మత్తు ఇచ్చిన అధికారులు ఎట్టకేలకు దానిని బంధించారు. మ్యాన్ ఈటర్ ను బంధిచడంతో ఆ ప్రాంత గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన పులిని చంద్రాపూర్ జిల్లా కేంద్రంలోని ప్రత్యేక కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.