Revanth Reddy| రెండు రాష్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర విభజనతో ఏపీ, తెలంగాణలో రెండుగా విడిపోయినా కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల బలపడాలని, రెండు రాష్ట్రాలు కలిసి ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. వికారాబాద్ లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Revanth Reddy| రెండు రాష్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : రాష్ట్ర విభజనతో ఏపీ, తెలంగాణలో రెండుగా విడిపోయినా కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల బలపడాలని, రెండు రాష్ట్రాలు కలిసి ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. వికారాబాద్ లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌తో పోటీ పడుతున్న ఏ రాజకీయ పార్టీ కూడా స్వతంత్రం కంటే ముందు పుట్టలేదు అని,
దేశ స్వాతంత్ర్యంకు ముందు 141 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిందని, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి, దిక్సూచిగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్‌తో పాటు వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీగా సీపీఐ మిత్రపక్షంగా ఉందన్నారు. దేశాన్ని,కాంగ్రెస్ ను విడదీయలేరు అని, దేశం ఆత్మనే కాంగ్రెస్ అన్నారు.

కాంగ్రెస్ పై బీజేపీ కుట్రలు

కాంగ్రెస్ పైన బీజేపీ కుట్ర చేస్తోందని, పార్లమెంట్ లో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా బీజేపీ కుట్ర చేసిందని, సోనియా, రాహుల్ పైన కేసులు పెట్టి అవమానిస్తోందని రేవంత్ ఆరోపించారు. మూడు తరాలు ప్రాణ త్యాగం చేసిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరమా? అని, రాజకీయంగా గాంధీ కుటుంబాన్ని అడ్డు తొలగించుకోవడం కోసం బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. దళితులు,మైనార్టీ లు, బడుగు బలహీన వర్గాలు,పేదల గొంతును నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్ర్యం,ఇచ్చిన రాజ్యాంగంను ఉపయోగించుకొని పుట్టిన పార్టీ లు ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. భారత దేశ ఆత్మ గౌరవం గ్రామాల్లో ఉందని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, సమూలంగా మార్చాలని కుట్ర జరుగుతున్న సమయంలో ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతోందన్నారు.

దేశం కోసం బలిదానాలు చేసిన గాంధీ కుటుంబం

దేశం మహాత్మా గాంధీ , జవహర్ లాల్ నెహ్రూ దేశం కోసం జైలు కు వెళ్లారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మహాత్మా గాంధీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళు కనీసం లాఠీ కూడా ఎత్తలేదు అని, కానీ స్వాతంత్ర్యం వచ్చాక భారతీయుల పార్టీ కి చెందిన వారి తూటాలకు మహాత్మా గాంధీ నేలకొరిగారు అని, గాంధీ,ఇందిరా,రాజీవ్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం సోనియా గాంధీ సర్వం త్యాగం చేసి కాంగ్రెస్ కు అండగా నిలిచారు అని, కష్టం తెలియకుండా పదవులు పొందే అవకాశం ఉన్నా , త్యాగాల చరిత్ర ఉన్నా రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర,ఆయన సంక్షేమ కార్యక్రమాలు,అభివృద్ధి కాంగ్రెస్ విజయాలలో ప్రస్తావించక తప్పదన్నారు.

కష్టపడినోళ్లకే పార్టీ పదవులు

వైఎస్ షర్మిల తెలంగాణలో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు అని, ఏపీ లో పార్టీ కోసం కష్టపడుతున్నారు అని, వారసత్వంగా పదవులు పొందే అవకాశం వైఎస్ షర్మిలకు ఉన్నప్పటికి ఆమె తీసుకోలేదు అని రేవంత్ రెడ్డి అన్నారు. డీసీసీ అధ్యక్షులుగా ఎంపికైన వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.జిల్లాకు అధిపతులమని డీసీసీ అధ్యక్షులు భావించవద్దు అని, వ్యతిరేకించిన వాళ్ళను అణిచి వేసే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. పైరవీలు చేయకపోతే నాయకుల గౌరవం పెరుగుతుంది అని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలన్నారు. నేను ఏ నాడు పైరవీ కోసం పని చేయలేదు అని, 16ఏళ్ల లో జడ్పీటీసీ నుంచి సీఎం వరకు అడిగానని.. కాంగ్రెస్ నాకు అవకాశం ఇచ్చిందన్నారు.

పెరిగిన కాంగ్రెస్ ఓట్ల శాతం

నేను పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లి కలిసి మద్దతు అడిగానని, కలిసికట్టుగా పనిచేయడం వల్లనే రొండున్నర శాతం ఉన్న కాంగ్రెస్ 40శాతం ఓట్లు తెచ్చుకొని అధికారం లోకి వచ్చింది అని రేవంత్ రెడ్డి తెలిపారు. 119 నియోజక వర్గాల్లో 42 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేయించాం. డీసీసీ అధ్యక్షులు గా బాగా పని చేసిన వారికి ఎంఎల్ ఏ లు గా అవకాశంఇచ్చాం. పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి కార్పొరేషన్ పదవులు ఇచ్చాం అని తెలిపారు. డీసీసీ అధ్యక్షుల ప్రతి చర్యను గమనిస్తూనే ఉంటాం అని, కాంగ్రెస్ లో ఏ కోటా లేదు..మెరిట్ కోటా మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసుకోవద్దు అన్నారు. పార్టీ పెట్టుకున్న విశ్వాసాన్ని దెబ్బ తియ్యవద్దు అని తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు, ప్రత్యర్ధి పార్టీ కి ఉన్న తేడా 2 శాతం ..అది పార్లమెంట్ ఎన్నికల కు 4శాతానికి పెరిగింది..మునిసిపల్ ఎన్నికల్లో 12 శాతానికి పెరిగిందన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఉన్న నమ్మక వల్లనే ఇది జరిగిందని రేవంత్ వెల్లడించారు. 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కులగణన చేశాం అని, ఎస్సీ వర్గీకరణ అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచాం అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 49.83 శాతం బీసీలు సర్పంచ్ లు అయ్యారని, మున్సిపల్ ఎన్నికల్లో 63శాతం మంది ఓబీసీలు ఎన్నికయ్యారు అని, ఇది కాంగ్రెస్ వల్లనే సాధ్యం అయిందన్నారు.

అనంతగిరి హరితా రిసార్ట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తదితరులు హాజరయ్యారు.