• Telugu News
  • /Telangana

ఉద్యోగుల డిమాండ్లపై 17న తహశీల్దార్లకు వినతులు: లచ్చిరెడ్డి

ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేస్తామని టీజీఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Apr 16, 2026, 3:14 pm IST
Read Time: 4 mins
ఉద్యోగుల డిమాండ్లపై 17న తహశీల్దార్లకు వినతులు: లచ్చిరెడ్డి

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకై టీజీఈ జేఏసీ ప్రకటించిన కార్యాచరణలో భాగంగా ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు భోజన విరామంలో మండల తహశీల్దార్లు , రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో ఆర్డీవోలకు వినతి పత్రాలు అందించడం జరుగుతుందని జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మే 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పిస్తామని తెలిపారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సరికాదని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ జాప్యం కారణంగా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో తమ సమస్యలను పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌ రెండో తేదీన పీఆర్సీ అమలుతోపాటు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ఐదు డీఏలను కూడా విడుదల చేయాలన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌ చేయాలని, ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు జారీ చేసి తక్షణమే అమల్లోకి తీసుకురావాలన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం(ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్‌ఏల వారసుల ఉద్యోగ నియామక సమస్యను సత్వరం పరిష్కరించాలన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి :

సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానం మూర్ఖత్వం: ఎంపీ తేజస్వీ సూర్య ఫైర్
తెలంగాణ కుల గణన లెక్కలు వెల్లడించిన ప్రభుత్వం