పీఆర్సీ అమలును వెంటనే పూర్తి చేయాలి.. : సెక్రటేరియట్‌లో ఉద్యోగుల నిరసన

పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు శుక్రవారం సచివాలయంలో శాంతియుత నిరసనకు దిగారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని ప్రభుత్వాన్ని కోరారు.

  • By: TAAZ |    telangana |    Published on : Apr 17, 2026 8:45 PM IST
పీఆర్సీ అమలును వెంటనే పూర్తి చేయాలి.. : సెక్రటేరియట్‌లో ఉద్యోగుల నిరసన

విధాత, హైదరాబాద్:

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ అమలును తక్షణమే పూర్తి చేయాలని, ఉద్యోగులకు రావలసిన డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీగిరి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ విభాగాలవారీగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణం చెల్లించాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం సమగ్రంగా పనిచేసే కొత్త హెల్త్ స్కీంను అమలు చేయాలని కోరారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను పూర్తిగా రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు.

తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ సెక్రటేరియట్ ప్రాంగణంలో శుక్రవారం మధ్యాహ్నం బాహుబలి గేటు వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, శాంతియుతంగా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఉద్యోగులపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతున్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జీతభత్యాలను సవరించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఉద్యోగులు నిబద్ధతతో ప్రజాసేవలో పనిచేస్తున్నప్పటికీ, వారి ప్రాథమిక అవసరాలు కూడా సక్రమంగా నెరవేరని పరిస్థితి కొనసాగుతున్నదని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మా సహనాన్ని పరీక్షించకండి..

ఉద్యోగుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షించకూడదని, సమస్యలు త్వరితగతిన పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర స్థాయి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ప్రేమ్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏలూరి శ్రీనివాస రావు, సెక్రెటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్, ఉమెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమాదేవితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.