అమరావతి పేరుతో అధిక దోపిడీ : వైఎస్ జగన్ ఫైర్

అమరావతి నిర్మాణం పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఖర్చులపై ప్రశ్నలు లేవనెత్తారు.

అమరావతి పేరుతో అధిక దోపిడీ : వైఎస్ జగన్ ఫైర్

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ సాగిస్తుందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌ ఉన్నా.. పర్మినెంట్‌ పేరిట మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారని, మళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచినప్పటికి.. పాత వాళ్లకే టెండర్లు కట్టబెట్టారు అని విమర్శించారు. కొత్తగా నిర్మిస్తున్న ఐదు బిల్డింగుల దోపిడీ చూసి జనం నివ్వెరపోతున్నారని, భవన డిజైన్లకే రూ.401 కోట్లు ఖర్చు చేశారు అని, ఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ. 20,427 వేలు అని, పాత లెక్క రూ.5వేల లోపే ఉందని, వాటి ఫర్నీచర్‌, ఇంటీరియర్‌ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే ఇప్పుడు చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందని జగన్ ఆరోపించారు. ఫైవ్‌స్టార్‌ హంగులతో కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే అవుతుందని గుర్తు చేశారు.

తెలంగాణలో దాదాపు 10 లక్షల చదరపు అడుగుల్లో ఎస్ఎఫ్టీ 6 వేల రూపాయలతో, రూ.615 కోట్లతో కేసీఆర్‌ సచివాలయం కట్టారని, మన సెక్రటేరియట్‌కు మాత్రం ఇంత ఖర్చు ఎందుకు? అవుతుందని, కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని : వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. దేశంలో ఒక కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి ఏవరేజ్‌గా రూ.24 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని, కానీ అమ‌రావ‌తిలో రోడ్డు నిర్మాణానికి చంద్ర‌బాబు చేస్తున్న‌ ఖ‌ర్చు కిలోమీటర్‌కి రూ.53 కోట్లుగా ఉందన్నారు. విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్ ఫ్లైఓవ‌ర్‌కు కిలోమీటర్‌కి రూ.69 కోట్లు ఖర్చు చేశారని, అమరావతిలో సీడ్ యాక్సిస్ నుంచి నిర్మిస్తున్న ఫ్లైఓవ‌ర్‌కు కిలోమీటర్‌కు రూ.189 కోట్లు చంద్ర‌బాబు ఖర్చు పెడుతున్నారని వివరించారు.

మావిగన్‌ అంటే చంద్రబాబుకి గుండె ఆగిపోయేలా ఉంది

చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ చేసుకున్న దురదృష్టం అని, ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారు అని, చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, ఆచరణ సాధ్యం కాదని తెలిసినా ముందుకు వెళ్తున్నారన్నారు. స్కామ్‌ల కోసమే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని, ఇప్పటికే అమరావతి కోసం రూ.47, 387 కోట్ల అప్పుచేశారు అని, ఖజానా నుంచి రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు అని, స్కామ్‌ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరుగుతోందని,
రాజధాని ఉండాలనే మావిగన్‌ ప్రతిపాదించామని, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్‌ను ప్రత్యామ్నాయంగా చూపించాం అని, మావిగన్‌ అంటే చంద్రబాబుకి గుండె ఆగిపోయేలా ఉందన్నారు. అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలి అని, మావిగన్‌లో అన్నీ ఉన్నాయి అని, ప్రజలు కూడా మావిగన్‌కు మద్దతు పలికారు అని జగన్ చెప్పుకొచ్చారు. అది తట్టుకోలేకనే చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తాను మాట్లాడిందే కాకుండా మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారని విమర్శించారు.

బాబు.. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరివి హత్యా రాజకీయాలు?: వైఎస్‌ జగన్‌

చంద్రబాబు పాలనలోనే మా తాత రాజారెడ్డిని టీడీపీ వాళ్లు చంపారు.. వాళ్ల‌ను నీ పార్టీ ఆఫీసులో పెట్టుకుని కాపాడలేదా? అని జగన్ ప్రశ్నించారు. మా నాన్న వైఎస్సార్ చనిపోవడానికి ముందు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా’ అని అన్నారని, ఆ తర్వాత 2-3 రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో నాన్న చనిపోయారు అని జగన్ గుర్తు చేశారు. నీ హ‌యంలోనే మా బాబాయి వివేకానందరెడ్డిని చంపించారని, మేము బాధితులం, కాని మాపైనే తప్పుడు ప్రచారం చేయిస్తున్నావని జగన్ విమర్శించారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ గతంలో ఇద్దరిని తుపాకీతో కాల్చలేదా? అని, ఆ తర్వాత కొన్ని రోజులకే సాక్ష్యాలు ఉండకూడదని.. ఇంట్లోని వాచ్‌మ్యాన్‌ను బండరాయితో కొట్టి చంపారని గుర్తు చేశారు. ఏది గొడ్డలి పార్టీ.. ఎవ‌రిది గన్ కల్చర్‌.. ఎవ‌రివి హత్య రాజకీయాలో చంద్రబాబు ఇప్పుడు చెప్పాలన్నారు. వంగవీటి మోహన్ రంగా, ఎన్‌కౌంటర్‌ ధశరథ్‌, మల్లెల బాబ్జీల హత్యలు టీడీపీ హయాంలోనే జరిగాయి కదా అని గుర్తు చేశారు.

“బోత్ ఆర్ నాట్ ది సేమ్” అంటూ లోకేశ్‌పై జగన్ విమర్శలు

మంత్రి నారా లోకేశ్ వాడుతున్న “బోత్ ఆర్ నాట్ ది సేమ్” డైలాగ్‌పై వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. వెన్నుపోటు రాజకీయాలు, మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం టీడీపీ చరిత్ర అయితే… ఒంటరిగా పోరాడి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తమ క్యారెక్టర్ అని స్పష్టం చేశారు. ఐదేళ్లలో తాము రూ.2,73,000 కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో వేస్తే, టీడీపీ కేవలం రెండేళ్లలోనే రూ.3,40,000 కోట్ల అప్పులు చేసి, “సూపర్ సిక్స్” పేరుతో ప్రజలను మోసం చేస్తోందని జగన్ విమర్శించారు. “బోత్ ఆర్ నాట్ ది సేమ్” అంటూ లోకేశ్ మాటలను జగన్ తిప్పికొట్టారు. వెన్నుపోటుతో పార్టీని లాక్కుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మీది , ప్రజామద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మాది అని, ప్రజలకు ద్రోహం, వాడుకోవడం, వదిలేయడం మీ క్యారెక్టర్‌ అయితే..
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్‌ అని, పనులు చేసి చూపించడం మా స్టైల్‌.. పబ్లిసిటీ చేయడం మీ స్టైల్‌ అని, బటన్‌ నొక్కి ప్రజలకు డబ్బులు వేసిన చరిత్ర మాది, రెండేళ్లలో పథకాలు రద్దు చేసిన చరిత్ర మీది అని..బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌ అని జగన్ ఎద్దేవా చేశారు. ప్రజల గురించి ఆలోచించకుండా, వారి ఇంధన అవసరాలను తీర్చాల్సింది పోయి, అమరావతి కాంట్రాక్టర్లకు రిటైల్‌ అవుట్‌ లెట్ల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దారుణం అని జగన్ గుర్తు చేశారు. అసలు విషయాలు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం చీవాట్లు పెడుతూ చంద్రబాబుకు లేఖ రాసిందని, రిటైల్‌ అవుట్‌ లెట్స్‌ నుంచి కమర్షియల్‌ అవసరాలకు వాడకూడదని గడ్డిపెట్టింది అని జగన్ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు చెప్పేవి కనీసం ఆయన కొడుకు అయినా పాటించాలి

సంతానమే సంపద అని, ముగ్గురిని నలుగురిని కనండి అంటూ చంద్రబాబు ప్రొత్సహిస్తున్నారు అని, సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ హామీల తర్వాతే ఆ మాట మాట్లాడమని ప్రజలు మొత్తుకుంటున్నారని వైఎస్ జగన్ విమర్శించారు.
చంద్రబాబుకు ఒక్కడే కొడుకు అని, బాబు చెప్పేవి కనీసం ఆయన కొడుకు అయినా పాటించాలి కదా…లోకేష్‌కు ఒక్కడే కొడుకు అని, ప్రజలు మాత్రం ముగ్గురు, నలుగురు కనాలని చెబుతున్నారని తప్పుబట్టారు. విద్య, వైద్యం, పోషకాహారం పథకాలతో కూడిన వ్యవస్థలు అన్ని అద్వాన్నంగా ఉంటే.. పిల్లలు కనమని పిలుపు ఇవ్వడమేంటి? అని, మహిళలను పిల్లల్ని కనే మెషీన్లుగా చంద్రబాబు చూడడం దుర్మార్గం అని జగన్ విమర్శించారు. చంద్రబాబు పాలనా విధానలను ప్రశ్నించకుండా ఏపీలో సోషల్‌ మీడియా పైనా కూడా ఆంక్షలు పెడుతున్నారని, కేసులతో వేధిస్తున్నారని, ప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే అవకాశం లేకుండా చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి :

యూఏఈ క్వీన్ మదర్‌కు కరీంనగర్ ఫిలిగ్రీ బాక్స్ కానుక
ఆదాయ వేటలో తెలంగాణ సర్కార్‌ తొలి అడుగు.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ విలువ భారీగా పెంపు