యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో స్థానికులు ఎక్కడా ? గొంగిడి సునీత

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు, స్థానికులకు ప్రాధాన్యం కల్పించకపోవడాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, రాష్ట్ర నాయకులు తుంగ బాలు తీవ్రంగా ఖండించారు. స్థానిక యాదగిరిగుట్ట మండలం నుండి ఒకరిని, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ఐదుగురుని మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు గురుని యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించాలని గొంగిడి సునిత డిమాండ్ చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 01, 2026, 3:52 pm IST
Read Time: 5 mins
యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో స్థానికులు ఎక్కడా ? గొంగిడి సునీత

విధాత, హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు, స్థానికులకు ప్రాధాన్యం కల్పించకపోవడాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, రాష్ట్ర నాయకులు తుంగ బాలు వేర్వేరుగా ఖండించారు. స్థానిక యాదగిరిగుట్ట మండలం నుండి ఒకరిని, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ఐదుగురుని మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు గురుని యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించాలని గొంగిడి సునిత డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తుంగ బాలు మాట్లాడుతూ.. యాదాద్రి ప్రాంతానికి మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ, యాదాద్రి వంటి పవిత్ర దేవస్థానం ట్రస్ట్ బోర్డులో యాదాద్రి జిల్లా నుంచి ఒక్క స్థానిక ప్రతినిధికి కూడా అవకాశం కల్పించలేకపోవడం కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. కేఆర్ నాయకత్వంలో దేవస్థానం అభివృద్ధి కోసం అనేకమంది రైతులు వారి జీవన ఆధారమనుటవంటి పొలాలను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ విలువైన భూములను ఇచ్చారని గుర్తు చేశారు. ఈ యాదాద్రి అభివృద్ధి కోసం భూములను, ఇళ్లను ఇచ్చిన స్థానిక ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. ఆలయ సంప్రదాయాలు, స్థానిక పరిస్థితులు, అభివృద్ధి అవసరాలపై అవగాహన ఉన్న వారికే ట్రస్ట్ బోర్డులో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా, స్థానికులను పూర్తిగా విస్మరించడం బాధాకరమన్నారు.

స్థానికులకు అవకాశం ఇవ్వకుండా కొందరు బడా పెట్టుబడిదారులు, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులను ట్రస్ట్ బోర్డులో నియమించడం వెనుక రాజకీయ, స్వార్థ ప్రయోజనాలే ఉన్నాయని ఆరోపించారు. ప్రపంచంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా యాదాద్రిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ కృషి చేశారు. అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం దేవస్థాన ట్రస్ట్ బోర్డును వినియోగించుకోవడం అత్యంత విచారకరం, సిగ్గుచేటు అన్నారు. రేవంత్ రెడ్డి కార్పొరేట్ శక్తులు, బడా వ్యాపారవేత్తల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ, ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తున్నారని విమర్శించారు. యాదాద్రి ట్రస్ట్ బోర్డులో వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తుంగ బాలు డిమాండ్ చేశారు. లేకపోతే స్థానిక ప్రజలను కలుపుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.