డేటా సెంటర్ కు సింహచలం ఆలయ భూములు..కోర్టులో పిల్

ఏపీ ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్‌ కోసం 160 ఎకరాల పవిత్ర సింహాచలం ఆలయ భూములను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) దాఖలైంది. జనసేన మాజీ నేత, పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఈ పిల్ దాఖలు చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | ఆంధ్ర ప్రదేశ్ | Jul 01, 2026, 2:05 pm IST
Read Time: 4 mins
డేటా సెంటర్ కు సింహచలం ఆలయ భూములు..కోర్టులో పిల్

అమరావతి : : ఏపీ ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్‌ కోసం 160 ఎకరాల పవిత్ర సింహాచలం ఆలయ భూములను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) దాఖలైంది. జనసేన మాజీ నేత, పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఈ పిల్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం 160 ఎకరాల పవిత్ర దేవస్థానం భూమిని మెస్సర్స్ వైజాగ్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్‌కు బదిలీకి నిర్ణయించింది. ఈ ఉత్వర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (డబ్ల్యుపీ(పీఐఎల్) 137/2026) దాఖలు చేశారు. వివాదాస్పదమైన ఈ భూమి సర్వే నెం. 275 (అడవివరం) మరియు సర్వే నెం. 26 (ముడసర్లోవ)లలో విస్తరించి ఉంది.

డేటా సెంటర్ కు ఆలయ భూముల కేటాయింపు వెనుక వన్యప్రాణి, పర్యావరణ చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయని, భారీ తవ్వకాల వల్ల నగరానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న ముడసర్లోవ జలాశయం నీటి వనరులకు ముప్పు ఏర్పడుతుందని పిల్ లో ఆరోపించారు. అటవీ శాఖ, దేవాదాయ శాఖ భూములను, కొండలను డేటా సెంటర్ కు ఇవ్వడం పర్యావరణ విధ్వంసానికి కారణమవుతుందని, కంబాలకొండ రిజర్వ్ ఫారెస్టుకు నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే భూ కేటాయింపును, దాని పర్యావరణ అనుమతిని తక్షణమే రద్దు చేయాలని పిల్ లో కోరారు. సింహాచలం దేవస్థానానికి తిరిగి 160ఎకరాలను అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఆలయ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం పట్ల స్థానిక భక్తులు, కాంగ్రెస్, సీపీఐ(ఎం) తదితర విపక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంపై కేంద్ర పర్యావరణ శాఖకు కూడా ఫిర్యాదు చేశారు. డేటా సెంటర్ కు కేటాయించిన సింహచలం ఆలయ భూములకు ప్రత్యామ్నాయంగా గాజువాక సమీపంలోని పెదగంట్యాడ, మునగాడ పరిధిలో దాదాపు 600 ఎకరాలను ఆలయానికి కేటాయించేలా రెవెన్యూ అధికారులు ప్రతిపాదించడం గమనార్హం.