విధాత, హైదరాబాద్:
యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకం విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణం తరువాత తొలిసారి రెండు సంవత్సరాల కాల పరిమితితో పాలక మండలిని ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఒక్క ప్రజా ప్రతినిధికి కూడా అవకాశం ఇవ్వకపోవడం ప్రధానంగా చర్చనీయాంశమైంది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే, విప్ బీర్ల అయిలయ్యను సభ్యుడిగా నియమించకపోవడంపై ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు ఇప్పటికే విప్ పదవి ఇచ్చినందున భువనగిరి లేదా మునుగోడు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తే బాగుండేదనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కనీసం ఉమ్మడి వరంగల్ లేదా మెదక్ జిల్లా నుంచి ప్రజా ప్రతినిధులకు అవకాశం కల్పించకపోవడం శోచనీయమంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని తెలుస్తున్నది. ఈ సమయంలో తెలంగాణలోనే ప్రముఖ దేవాలయానికి పాలక మండలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో ఆమెను సంప్రదించే నిర్ణయం తీసుకున్నారా? లేక ఆమె ప్రమేయం లేకుండానే ఉత్తర్వులు ఇచ్చారా? అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నది.
సామాజిక తమతూకమేది?
కులాల పరంగా కూడా సమతూకం పాటించలేదని పలువురు వ్యాఖ్‌యానిస్తున్నారు. పైపెచ్చు బీజేపీ నాయకుడికి అవకాశం ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని జరిగిన తప్పిదాన్ని సరిదిద్దేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో సభ్యులను పెంచాలని భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఏపీలోని టీటీడీ బోర్డులో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులకు చోటు కల్పించి సముచిత అవకాశం కల్పిస్తున్నారని, అదే తరహాలో తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి పొందిన యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డులోనూ పాటించాలనే డిమాండ్ ఊపందుకుంటున్నది.
బీఆరెస్ హయాంలో పునర్నిర్మాణం
యాదగిరి గుట్టపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పునర్నిర్మాణం చేశారు. సిమెంట్, ఇటుకలను వినియోగించకుండా పూర్తిగా కృష్ణ శిలలతో, అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం, నిపుణులైన స్తపతులతో ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. పునర్నిర్మాణం ముందు, తరువాతి ఆదాయంతో పోల్చితే ఎంతో వ్యత్యాసం ఉంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఆదాయం కూడా అంతే స్థాయిలో లభిస్తున్నది. 2022 నవంబర్ 13వ తేదీన రికార్డు స్థాయిలో రూ.1.9 కోట్ల ఆదాయం వచ్చింది. అదే నెల 30వ తేదీన కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో 80వేల మంది భక్తులు సందర్శించుకున్నారు. భక్తుల కైంకర్యాలు, ప్రసాదాలు, వ్రతాలు, సుప్రభాత సేవలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.1.16 కోట్లు ఆదాయం సమకూరింది. ఎందరో దాతలు ఇచ్చిన బంగారం, రూ.1,800 కోట్ల ప్రభుత్వ నిధులతో యాదగిరిగుట్ట దేవాలయాన్ని నిర్మాణం చేశారు. పునర్నిర్మాణంలో ప్రధాన స్తపతి, 11 మంది ఉప స్తపతులు, రెండు వేల మంది శిల్పులు పనిచేయగా శిల్పులలో తెలంగాణ తమిళనాడు, ఏపీ రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయంగా లక్ష్మీ నరసింహ స్వామి గుడి నిర్మితమైంది. గతంలో ఒక ఎకరంలో మాత్రమే ఉన్న ఆలయ ప్రాంగణాన్ని 14.5 ఎకరాల్లో నిర్మాణం చేసి 2022 మార్చి నెలలో పున ప్రారంభించారు. ఉద్ఘాటన తరువాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడమే కాకుండా సెలవు రోజులలో 50వేల మందికి పైగా భక్తులు సందర్శించి, పలు కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డును నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రస్టు బోర్డు సభ్యులను నియమించకుండా ఎగ్జిక్యూటివ్ అధికారి, అనువంశిక ధర్మకర్తతోనే కొనసాగిస్తున్నారు. అయితే రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్‌గా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె సత్యనారాయణ రెడ్డిని నియమించారు. సభ్యులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గడ్డం వినోద్ వెంకటస్వామి, నటుడు చిరంజీవి భార్య కొణిదెల సురేఖ, విజయక్రాంతి దినపత్రిక యజమాని భార్య చిలప్పగారి విజయరాజం, తూళ్ల విజయేందర్ గౌడ్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంఠమనేని, ఎం రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్‌తోపాటు అనువంశిక ధర్మకర్తను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వీరు కాకుండా ఎక్స్ అఫిషియో మెంబర్లుగా మరో ఆరుగురు ఉన్నారు. ఆరుగురిలో ఐదుగురు ప్రభుత్వ ఉన్నతాధికారులు కాగా ఒకరు ప్రధాన అర్చక స్థానాచార్యుడు.
ఉమ్మడి నల్లగొండలో ప్రముఖులే లేరా?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆధ్మాత్మిక చింతన కలిగిన వారు ఎంతో మంది పెద్దలు, రాజకీయ కురువృద్ధులు ఉన్నారు. సినిమా రంగంలో తెలంగాణ నుంచి పేరు పొందిన నటులు, దర్శకులు, నిర్మాతలు ఉన్నారు. నితిన్, విజయ్ దేవరకొండలకు ప్రేక్షక ఆదరణతో పాటు ప్రజల్లో మంచి గుర్తింపు కూడా ఉంది. బీసీ సామాజిక వర్గంలో యాదవ, గౌడ కులం వాళ్లు తప్ప మరే ఇతర కులస్తులు కన్పించడం లేదా? అనే విమర్శలు మొదలయ్యాయి. ప్రముఖ కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూపు అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డి, మాజీ బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడు కాగా, విజయేందర్ గౌడ్ మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ కుమారుడు. నాట్కో ఫార్మాకు చెందిన ట్రస్టులో కాంతామణి స్వాతి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ట్రస్టు బోర్డులోని పది మంది నామినేటెడ్ సభ్యులలో ఓసీలు ఆరుగురు, ఒకరు మాల (ఎస్సీ), ఒకరు గౌడ (బీసీ), ఒకరు యాదవ (బీసీ), ఒకరు లంబాడ (ఎస్టీ) చొప్పున ఉన్నారు. ఇదిలా ఉంటే పాలక మండలి కూర్పుపై పెద్ద ఎత్తున భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేమీ పాలక మండలి అంటూ అటూ కాంగ్రెస్ నాయకులు, ఇటు భక్తులు పెదవి విరుస్తున్నారు. తెలంగాణ తిరుమల గా పేరొందిన యాదగిరిగుట్ట నరసింహ స్వామికి సేవ చేసుకునే భాగ్యం కల్పించారా అంటూ ఆక్షేపిస్తున్నారు.
తిరుమల ట్రస్ట్‌బోర్డులో సముచిత స్థానాలు
ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్.చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత 2024 అక్టోబర్ లో టీటీడీ నూతన పాలక మండలి ని ఏర్పాటు చేశారు. ప్రముఖ దివ్యక్షేత్రం అయిన టిటీడీ పాలక మండలి ఏర్పాటులో కులాలు, రాష్ట్రాలు, తెలంగాణకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. ఛైర్మన్ తో కలిపి మొత్తం 24 మంది కాగా ఇందులో ఏపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, తెలంగాణ నుంలచి ఐదుగురు, కర్నాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరి చొప్పున బోర్డులో అవకాశం కల్పించారు. తెలంగాణ నుంచి అవకాశం పొందిన వారిలో నన్నూరి నర్సిరెడ్డి, బొంగునూరు మహేందర్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల, అనుగోలు రంగశ్రీ, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయికి చోటు లభించింది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ ప్రకారంగా ప్రాంతాలు, కులాల వారీగా సమతూకం పాటించడంలో విఫలమైనట్లు తాజా ఉత్తర్వుల్లో స్పష్టమవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఒక్క ప్రజా ప్రతినిధికి కూడా అవకాశం కల్పించకపోవడం జిల్లా ప్రజలను మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నది. మా జిల్లా దేవుడికి సేవ చేసుకుని, భక్తులకు సిఫారసు లేఖలు ఇచ్చుకునే భాగ్యం లేదా అంటూ మండి పడుతున్నారు. జిల్లా లో ఎందరో హెమాహెమీ రాజకీయ నాయకులు, ధాతృత్వ గుణం కలిగిన పెద్దలు ఉన్నా వారికి చోటివ్వకపోవడం శోచనీయం అంటున్నారు. తెలంగాణ చారిటబుల్, హిందూ రిలిజీయస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ (అమెండ్ మెంట్) యాక్టు, 2025కు మరోసారి సవరణలు తెచ్చి సభ్యుల సంఖ్యను పెంచాలని భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి వాసులకు కచ్చితంగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
విదేశీ పర్యటనలో కొండా సురేఖ…
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొద్ది రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్నారు. సచివాలయ వర్గాల సమాచారం ప్రకారం గురువారం రాష్ట్రానికి వస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలోనే ప్రముఖ దేవాలయం అయిన యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకం సమయంలో ఆమె లేకపోవడం పలు అనుమానాలకు తెరతీస్తున్నది. విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో నియమించడం వెనకాల ఏమైనా కారణాలు ఉండవచ్చని, పాలక మండలిని చూస్తే స్పష్టమవుతుందనే చర్చ సచివాలయంలో జరుగుతోంది. ఈ పాలక మండలికి ఆమె ఆమోదం ఉన్నా, రాష్ట్రంలో ఉన్న సమయంలో ఉత్తర్వులు జారీ చేస్తే గౌరవప్రదంగా ఉండేదని గాంధీ భవన్ వర్గాలు అనుకుంటున్నాయి. ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల అయిలయ్య తో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక అడుగు ముందుకు వేసిన రాజగోపాల్ రెడ్డి బుధవారం నాడు తన ఆగ్రహాం, ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల వ్యవహారం బాగా లేదని, పీసీసీ అధ్యక్షుడు బీ మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛఆర్జీ మీనాక్షీ నటరాజన్ కు కలిసి వివరిస్తానని అన్నారు. హైదరాబాద్ లో కూర్చుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం మొదటి నుంచి కొట్లాడిన కాంగ్రెస్ వాదులకు విలువ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లతోనే అంతా నడుస్తోందని, సీనియర్లను గౌరవించడం లేదన్నారు. ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలని, హంగామాలు చేయడం కాదని హితవు పలికారు. ట్రస్టు బోర్డు నియామకంపై ముందే చెబితే నేను పేర్లు ప్రతిపాదించేవాడినని, ఇలాగా అగౌరవ పరుస్తుంటే ముందుకు వెళ్ళలేమని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.