మే 21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు.. కాళేశ్వరం వద్ద ఏర్పాట్లు పూర్తి

సరస్వతి నది అంత్య పుష్కరాలను ఘనంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సరస్వతి అంత్య పుష్కరాలు మే 21వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకూ 12 రోజులపాటు నిర్వహించనున్నారు.

  • By: TAAZ |    devotional |    Published on : May 20, 2026 7:45 PM IST
మే 21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు.. కాళేశ్వరం వద్ద ఏర్పాట్లు పూర్తి
  • కంచి స్వామి శ్రీ విజయేంద్ర సరస్వతి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలి పుష్కర స్నానాలు

విధాత, హైదరాబాద్:

కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతి అంత్య పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పుష్కర స్నానాలు మే 21 వ తేదీ నుండి 12 రోజుల పాటు (జూన్ 1 వరకు) జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. గత ఏడాది జరిగిన సరస్వతి ఆది పుష్కరాల సందర్భంగా వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంత్య పుష్కరాలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎండలు అధికంగా ఉండటంతో పుష్కర ఘాట్ల వద్ద కాయర్ మ్యాట్లు, చలువ పందిళ్లు వేయడంతోపాటు.. ఓఆర్ఎస్ ప్యాకెట్లను విరివిగా అందుబాటులో పెట్టారు. భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్ పరిసరాల్లోని 23 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసి, ప్రయాణాలు సజావుగా సాగేందుకు అంతర్గతంగా బీ.టి రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పుష్కరాలలో భక్తులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పనుల కోసం ప్రభుత్వం రూ. 30.63 కోట్ల నిధులను కేటాయించింది.

కంచి పీఠాధిపతి తొలి స్నానం

పుష్కరాల తొలి రోజైన 21 వ తేదీ తెల్లవారు జామున 5.43 గంటలకు కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పుష్కర స్నానం చేసి అంత్య పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. 21 వ తేదీ నుండి జూన్ 1 వతేదీ వరకు ప్రతీ రోజూ ఒక ప్రముఖ పీఠానికి చెందిన స్వామిజీ ఈ పుష్కారాల్లో పాల్గొని పుణ్య స్నానం చేస్తారు. ప్రతీరోజూ ఉదయం హోమాల నిర్వహణ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 90 షటిల్ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. రెస్క్యూ బృందాలతోపాటు ప్రత్యేక శిక్షణ పొందిన 100 మంది గజ ఈతగాళ్లను సరస్వతీ ఘాట్, పరిసర ప్రాంతాలలో అందుబాటులో పెట్టారు.

రూ.1.20 కోట్లతో ప్రత్యేక మ్యూజియం

తెలంగాణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.1.20కోట్లలతో ప్రత్యేకంగా మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. నాగేంద్ర స్వామి ఆలయాన్ని రూ.30 లక్షలతో పునర్నిర్మాణం చేశారు. పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ నిర్వహించే హారతి, హోమాలు, తెప్పోత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టారు. పుష్కరాలకు హాజరయ్యే వారి సౌకర్యార్థం 500 టాయిలెట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతోపాటు తాగునీటి కోసం రెండు ఓ.హెచ్.ఆర్.సి లను నిర్మించారు. వాహనాల కోసం ఏర్పాటు చేసిన 23 పార్కింగ్ కేంద్రాలలోనూ తాగునీటి సౌకర్యంతో పాటు టాయిలెట్ల సౌకర్యం కల్పించారు. కాళేశ్వరం పుష్కర ఘాట్ లోని 23 జోన్లలో ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 300 మంది వైద్యాధికారులు, పారా మెడికల్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. అన్ని ప్రధాన ప్రాంతాల్లో అంబులెన్సులు నియమించారు. మహాదేవ పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రెఫరల్ ఆసుపత్రిగా ఏర్పాటు చేశారు.

245 ఎకరాల్లో 1.70 లక్షల వాహనాల పార్కింగ్

ఈసారి సరస్వతీ అంత్య పుష్కారాలకు 1 లక్షా 70 వేల వాహనాలు వస్తాయని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా 245 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ ఏరియాలతో పాటు ఘాట్స్, టెంపుల్ తదితర ప్రాంతాలలో 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పుష్కర స్నానాలకు వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా ఎల్.ఈ.డీ లైట్లను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం కోసం 300 మంది సిబ్బందిని నియమించారు.

అందుబాటులో 100 మంది గజ ఈతగాళ్లు

పుష్కర స్నానాల సందర్భంగా ఎవరైనా మునిగినా, లోతుకు వెళ్లినా కాపాడేందుకు వంద మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వీరే కాకుండా సేఫ్టీ బోట్స్, లైఫ్ రింగ్స్, ఎస్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు పనిచేయనున్నాయి.