రెప్పపాటులో కాటేయగల బ్లాక్‌ మాంబా గురించి ఈ సీక్రెట్లు మీకు తెలుసా?

బ్లాక్‌ మాంబా.. ఈ పేరు వినగానే చాలా మంది తెలియనివాళ్లు ఇది నల్లగా ఉంటుందనే ఫీలింగ్‌లో ఉంటారు. కానీ ఇది నల్లగా ఉండదు.. మరి దీనికి బ్లాక్‌ మాంబా అని పేరెందుకు వచ్చింది? దీని కాటు పడితే మనిషికి ఎంత సమయం మిగిలి ఉంటుంది? ఇలాంటి అనేక ఆసక్తికర అంశాలు...

Reported by: Jagan Mohan Talluri | సైన్స్​ – టెక్నాలజీ | Edited by: విధాత సైన్స్ డెస్క్ | Jul 01, 2026, 8:12 pm IST
Read Time: 10 mins
రెప్పపాటులో కాటేయగల బ్లాక్‌ మాంబా గురించి ఈ సీక్రెట్లు మీకు తెలుసా?

బ్లాక్‌ మాంబా! సాధారణంగా సబ్‌ సహారా ఆఫ్రికాలోని సవన్నా, అడవులు, పొడి పొదల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ పాము.. నిజానికి పేరుకు తగినట్టు నల్లగా ఉండదు. ఆలివ్‌ గోధుమ, బూడిద లేదా గన్‌ మెటల్‌ గ్రే రంగుల్లో ఉంటుంది. అయితే.. కాటు వేయడానికి నోరు తెరిచినప్పుడు లోపలి భాగం పూర్తి నల్లగా కనిపిస్తుంది. ఇదే ఆ పాముకు బ్లాక్‌ మాంబా అని పేరు తెచ్చిపెట్టింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా కాటు వేయగల పాముల్లో ఇదొకటి. మనిషి రెప్పపాటు కాలంలో ఇది కాటు వేయగలదు. ఈ పాము శరీరంలోని శక్తిమంతమైన కండరాల వ్యవస్థ.. వందల సంఖ్యలో ఉండే వెర్టీబ్రా (వెన్నెముక ఎముకలు), సన్నగా ఉండే శరీరం దీని వేగవంతమైన కాటుకు కారణాలు. కాటు పడిన వెంటనే తగిన చికిత్స అందకపోతే చావు జేబులో ఉన్నట్టే లెక్క. క్షణాల్లో దాడి చేసే సామర్థ్యం, వేగంగా కాటు వేసే చురుకుదనం, దానిలోని విష తీవ్రత బ్లాక్‌ మాంబాను సర్ప జాతుల్లో ప్రత్యేకంగా నిలుపుతాయి.

నిజానికి ఈ పాముల గురించి కథలు, అపోహలు చాలా ఉన్నప్పటికీ.. శాస్త్రీయ సమాచారం మాత్రం అంతగా లేదు. ఇది మారుమూల అటవీ ప్రాంతాల్లో, సవన్నా అడవులు, పొడి పొదల ప్రాంతాల్లో ఎక్కువగా నివస్తుంటుంది. ఈ కారణంగా అక్కడకు వెళ్లి వాటిపై ప్రయోగాలు చేయడం అంటే.. మరణాన్ని వెంటబెట్టుకొని వెళ్లినట్టే. ఎందుకంటే ఈ ప్రయోగాల సమయంలో బ్లాక్‌ మాంబా కాటు వేసిందంటే వెంటనే చికిత్స అందించేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే దీనిపై పూర్తి శాస్త్రీయ సమాచారాలు పరిమితంగా ఉన్నాయి.

తాజా అధ్యయనంలో ఆసక్తి

అయితే.. ఇటీవలి కొన్ని పరిశోధనలు బ్లాక్‌ మాంబా శరీర నిర్మాణం, కండరాల వ్యవస్థ, అది కదిలే తీరు, దాడి చేసే పద్ధతులు వంటి అంశాలపై కేంద్రీకరించాయి. ఈ అధ్యయనాల్లో బ్లాక్‌ మాంబా ఇంత వేగంగా ఎలా దాడి చేయగలుగుతుంది? దీని విషయం ఎంత ప్రమాదకరం? బ్లాక్‌ మాంబా కాటు వేసిన తర్వాత శరీరంలో ఏం జరుగుతుంది అనే ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కింగ్‌ కోబ్రాల తరహాలో ఇది కూడా గరిష్ఠంగా 14 అడుగుల పొడవు వరకూ పెరుగుతుంది. దాదాపు 1.6 కిలోల బరువు ఉంటుంది. అయినప్పటికీ అత్యంత చురుకుగా కదలడం దీని ప్రత్యేకత. గంటకు 19 కిలోమీటర్ల వేగంగా పాకుతుంది. చెట్లు ఎక్కుతుంది.. నీటిలో ఈదుకుంటూ పోతుంది. తనను తాను రక్షించుకునేందుకు అవసరమైతే తన శరీరంలో మూడు వంతు భాగాన్ని పైకి లేపి దాడి చేయగల శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

"బ్లాక్‌ మాబా.. తన విషాన్ని తయారు చేసుకోవడానికి చాలా శక్తి అవసరం అవుతుంది. అందువల్ల కొన్ని సార్లు శత్రువును భయపెట్టేందుకు మాత్రమే కాటు వేస్తుంది. ఆ సమయంలో విషాన్ని విడుదల చేయదు. "

- అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ అక్రాన్‌కు చెందిన జీవశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హెన్రీ ఆస్ట్లీ

కాటేసిందా.. క్షణాల్లోనే లక్షణాలు..

బ్లాక్‌ మాంబా విషం చాలా శక్తిమంతమైనది. ఇది ప్రధానంగా మనిషి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది కాటు వేస్తే.. 15 నిమిషాల లోపే కాటు పడిన ప్రాంతంలో మంట మొదలవుతుంది. ఆ వెంటనే నొప్పి.. వాపు కనిపిస్తాయి. పెదవులు, నోటి చుట్టూ సూదులతో గుచ్చినట్టు అనిపిస్తుంది. చూపు మసకబారిపోతుంది.. శరీరం బలహీనపడుతుంది. నోట్లో ఏదో ఇనుప వస్తువు పెట్టుకుంటే వచ్చేలాంటి రుచి భావన కలుగుతుంది. ఇక గంట గడిచే సరికి మాట తడబడిపోతుంది. నోట్లో లాలాజలం అధికంగా ఊరుతుంది. బాగా దాహం వేస్తుంది. చెమటలు పట్టేస్తాయి. వాంతులు అవుతాయి. కండరాలు అదుపు తప్పి.. పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స అందకపోతే చివరికి శ్వాస ఆగిపోతుంది.. గుండె కొట్టుకోవడం మానేస్తుంది. ఫలితం.. మరణం.

ఒక్కోసారి 20 నిమిషాల్లోనే..

బ్లాక్‌ మాంబా చాలా చిత్రమైన జీవి కాటు వేసిన ప్రతిసారీ విషాన్ని చొప్పించదు. దీన్నే డ్రై బైట్‌ అంటారు. అంటే.. కాటు పడుతుంది కానీ.. విషం మాత్రం వదలదన్నమాట. అయితే.. విషం విడుదల చేస్తే.. కొన్ని సందర్భాల్లో 20 నిమిషాల వ్యవధిలోనే పరిస్థితి విషమించే అవకాశాలు ఉంటాయని అధ్యయనాల్లో వెల్లడైంది. విషం ఎంత పరిమాణంలో బాధితుడి శరీరంలోకి ప్రవేశించింది? అప్పటికే అతడి ఆరోగ్య పరిస్థితి.. వయస్సు వంటి అంశాల ఆధారంగా పరిస్థితి విషమించే సమయం ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

విషం తయారు చేసుకోవడమూ పాములకు కష్టమైన పనే..

బ్లాక్‌ మాబా.. తన విషాన్ని తయారు చేసుకోవడానికి చాలా శక్తి అవసరం అవుతుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ అక్రాన్‌కు చెందిన జీవశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హెన్రీ ఆస్ట్లీ చెబుతున్నారు. అందువల్ల కొన్ని సార్లు శత్రువును భయపెట్టేందుకు మాత్రమే కాటు వేస్తుందని, ఆ సమయంలో విషాన్ని విడుదల చేయదని ఆయన తెలిపారు. అంత మాత్రాన అది ఎప్పుడు డ్రై బైట్స్‌ వేస్తుందో, విషంతో కూడిన కాటు ఎప్పుడు వేస్తుందో ఎవ్వరూ అంచనా వేయలేరు.

యాంటివెనమ్‌ అందకపోవడమే సమస్య

బ్లాక్‌ మాంబా కాటు వేస్తే సంభవించే మరణాలకు విషం ఒక్కటే ప్రధాన అంశం కాదని, యాంటివెనమ్‌ ఇంజెక్షన్‌ వెంటనే అందుబాటులో లేకపోవడం కూడా కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ పాము ఉండే ప్రాంతాలు చాలా మారుమూలన ఉంటాయి. ఈ క్రమంలో బాధితులను తగిన వసతులు ఉన్న హాస్పిటల్స్‌కు తరలించేందుకు కొన్ని గంటల సమయం తీసుకుంటుంది. యాంటివెనమ్‌ ఔషధం ఎప్పటికప్పుడు అత్యంత శీతల ఉష్ణోగ్రత మధ్య నిల్వ చేయాల్సి ఉంటుంది. కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఇది నిల్వ చేయడం అనేక ప్రయాసలతో కూడుకొన్నది.

నిజానికి బ్లాక్‌ మాంబాకు సిగ్గెక్కువట!

బ్లాక్‌ మాంబా గురించి చాలా కథలు ప్రచారంలో ఉంటాయి. కానీ.. ఇది చాలా సిగ్గరి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవకాశం దొరికితే మనుషులకు దూరంగా వెళ్లిపోయేందుకే ప్రయత్నిస్తుందని అంటున్నారు. కానీ.. నెట్టివేయాలని ప్రయత్నించినా, అకస్మాత్తుగా భయపెట్టాలని చూసినా, దానికి పారిపోయేందుకు మార్గం లేకపోయినా ఊహించని వేగంతో కాటు వేయగలదని హెచ్చరిస్తున్నారు. అంటే.. ఇది మనిషిని వెంటాడి దాడి చేసే పాము కాదని, కానీ.. దానికి ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే ఎలాంటి తేడా లేకుండా కాటువేసి తీరుతుందని చెబుతున్నారు.