Snake Bite First Aid | పాము కాటేస్తే చేయాల్సినదేంటి? చేయకూడనిదేంటి?

పాము కాటేస్తే కొందరు కంగారు పడిపోతుంటారు. నిజానికి చాలావరకూ పాములు విషరహితమే. కానీ.. కొన్ని మాత్రం అత్యంత ప్రమాదకరమైనవి. ఏది ఏమైనా పాము కాటు పడిన వెంటనే బాధితుడికి ఏం చేయాలో ఏం చేయకూడదో నిపుణులు చెబుతున్న విషయాలు.. మీ ప్రాథమిక అవగాహన కోసం..

  • By: TAAZ    news    Jun 09, 2025 4:44 PM IST
Snake Bite First Aid | పాము కాటేస్తే చేయాల్సినదేంటి? చేయకూడనిదేంటి?

Snake Bite First Aid | వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తరచూ పాములు తిరుగుతూ ఉంటాయి. తమ పుట్టలను వదిలి.. బయటకు వస్తుంటాయి. ప్రత్యేకించి అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. సాధారణంగా చాలా వరకూ పాములు విషరహితమైనవే. కట్లపాములు, రక్తపింజర, నాగుపాము, కోబ్రాల వంటివి కొన్ని మాత్రం అత్యంత ప్రమాదకరమైన పాములు. ఏ పాము అయినా మనిషిని చంపాలనే ఉద్దేశంతో కాటు వేయదు. కేవలం తనను తాను రక్షించుకునే క్రమంలో కాటు వేస్తాయి. కొన్ని రకాల పాము కాట్లు అత్యంత ప్రమాదకరమైనవి. సకాలంలో తగిన చికిత్స అందించకపోతే మరణం సంభవించే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. చాలా మంది పాము కాటు వేయగానే మొదట కంగారు పడిపోతారు. తీవ్ర ఆందోళనకు గురవుతారు. అదే సమయంలో కొందరు కాలం చెల్లిన పద్ధతులు, మూఢ నమ్మకాలతో పాము కాటుకు గురైన వ్యక్తులకు పసర పేరుతో చికిత్సలు చేస్తూ ఉంటారు. వాటిలో ఎక్కువ భాగం సదరు పాము కాటు బాధితుడికి మరింత హాని చేసేవిగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి అనేక చర్యలు ఎందుకూ పనికిరావని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు కచ్చితంగా పాము కాటుకు ప్రాథమిక చికిత్సపై (Snake Bite First Aid ) పూర్తి స్థాయి అవగాహనలో ఉంటే అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని చెబుతున్నారు.

పాము కాటు వేస్తే ప్రాథమికంగా ఏం చేయాలి?

పాము కాటుకు గురైన వ్యక్తి ముందుగా ప్రశాంతంగా ఉంచేలా చూడాలి. భయపడితే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దాని వల్ల విషం శరీరంలోకి వేగంగా పాకుతుంది. బాధితుడిని నిశ్చలంగా ఉంచాలని లేని పక్షంలో విషం వేగంగా శరీరంలోకి పాకుతుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంటున్నది. పాము కాటుకు గురైన వ్యక్తి కదలికలను తగ్గించేందుకు ముందుగా కూర్చొనబెట్టాలి. లేదా పడుకోబెట్టాలి. అతడికి ధైర్యం చెప్పాలి. పాము కాటుకు గురైన అవయవం గుండె కంటే కిందికి ఉండేలా చూసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. వెంటనే అతడికి తగిన వైద్య సేవ అందేలా ఏర్పాట్లు చేయాలి. ఇంటి వైద్యాలు, మూఢ నమ్మకాలు తగవు. పాము విషం నాడీ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రక్తాన్ని గడ్డకట్టిస్తుంది. అంతర్గత అవయవాల పనితీరును నిలిపివేస్తుంది. అందుకే వెంటనే సమీప హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. యాంటివెనమ్‌ ఇంజక్షన్‌ మాత్రమే పాము కాటుకు సరైన విరుగుడు. అది కూడా వైద్య నిపుణలు మాత్రమే ఇవ్వాలి. ‘తగిన సమయంలోపు విరుగుడు ఇంజక్షన్‌ ఇవ్వటం మరణాన్ని లేదా అంగవైకల్యాన్ని నివారించడంలో కీలకంగా ఉంటుంది’ అని డబ్ల్యూహెచ్‌వో చెబుతున్నది. ఒంటిమీద బిగుతుగా ఉన్న దుస్తులను వదులు చేయాలి. ప్రత్యేకించి చేయి మీద కాటు పడితే.. వాచీలు, ఉంగరాలు తీసేయాలి. కాటు వేసిన పాము ఏం రంగులో ఉన్నది? ఎలా ఉన్నది? వీలైతే దానిని గుర్తించే ప్రయత్నం చేయాలి. దానిని పట్టుకునేందుకు అజాగ్రత్తగా ప్రయత్నం చేయకూడదు. పాము స్వభావాన్ని చెప్పడం వైద్యులకు మరింత అవగాహన కలిగేందుకు దోహదం చేస్తుంది.

పాము కాటు వేస్తే చేయకూడనివి ఏంటి?

చాలా మంది పాము కాటు పడిన ప్రాంతాన్ని కోసి, రక్తం బయటకు పిండటం చేస్తుంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన మూఢ నమ్మకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొందరు పాము కాటు పడిన ప్రదేశం వద్ద నోరు పెట్టి.. విషాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు. ఇటువంటి పనులతో మరింత గాయం అవటం లేదా ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది. ‘పాము కాటు పడిన ప్రదేశంపై ఐస్‌ ముక్కలు ఉంచడం, గాయం వద్ద కోత పెట్టడం లేదా విషాన్ని పీల్చేయాలని చూడటం చేయవద్దు’ అని అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (CDC) చెబుతున్నది. ఈ పద్ధతులు నిరూపితమైనవి కావని పేర్కొంటున్నది. పాము కాటు పడిన ప్రదేశానికి పై భాగంలో గట్టిగా కట్టు కట్టాలనేది కూడా తప్పుడు పద్ధతి అని సీడీఎస్‌ చెబుతున్నది. వీటి వల్ల రక్త ప్రసరణ వేగం మరింత పెరుగుతుందని పేర్కొంటున్నది. దాని బదులు రక్తప్రసరణకు అంతరాయం లేకుండా.. విషం పాకడాన్ని నెమ్మదింపజేయడానికి కట్టుకట్టి అవయవాన్ని కదలకుండా చేయాలని సూచిస్తున్నది.
ఈ వార్తా కథనం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమేనని గమనించాలి. ధృవీకరణ పొందిన వైద్యులు మాత్రమే పాము కాటు విషయంలో తగిన వైద్యం అందించగలరని గుర్తించాలి. మరింత అవగాహన కోసం మీ సమీప హాస్పిటల్‌లోని వైద్యులను సంప్రదించి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి.. 

snakes take revenge: పాములు పగబడతాయా? నాదస్వరానికి నాట్యం చేస్తాయా? నిజమెంత?
Snakes: పాములు ఏ సమయంలో నిద్రిస్తాయి.. ఏ సమయంలో యాక్టివ్ గా ఉంటాయి.. ?
snake venom: పాము విషంలో ఔషధగుణాలున్నాయా..

Snake Bite | పాము కాటుకు బాలిక బ‌లి.. బ‌తికిస్తాన‌ని ఆవుపేడ‌, వేప కొమ్మ‌ల‌తో పూజ‌లు
Cobra Dry Bites | కోబ్రా కాట్లన్నీ విషపూరితమేనా? వాటి విషం, పొడి కాట్ల వెనుక రహస్యాలేంటి?