Gold | ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం! దుబాయ్‌లో.. బంగారంపై భారీ డిస్కౌంట్లు!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల విషయంలో వింత పరిస్థితులు నెలకొన్నాయి.
Gold | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల విషయంలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం మొదలైన వేళ భారత్‌లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకినప్పటికీ.. నాలుగైదు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు దుబాయ్ మార్కెట్‌లో ఏకంగా బంగారంపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడం, రవాణా వ్యవస్థ స్తంభించడంతో ట్రేడర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆసియా, ఆఫ్రికా దేశాలకు దుబాయ్ నుంచే బంగారం ఎగుమతి అవుతుంది. ఇక్కడ బంగారాన్ని శుద్ధి చేసి ఇతర దేశాలకు పంపిస్తుంటారు. ప్రయాణికుల విమానాల్లోని కార్గో విభాగంలో బంగారాన్ని రవాణా చేస్తుంటారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దుబాయ్‌లోని అన్ని ప్రధాన విమానాశ్రయాలను మూసివేశారు. దీంతో బంగారం ఎగుమతి కష్టతరమైపోయింది. విమానాలు రద్దు కావడంతో ట్రేడర్లు తమ వద్ద ఉన్న స్టాక్‌ను భద్రపరచడానికి అయ్యే ఖర్చులను భరించలేకపోతున్నారు. అందుకే లండన్ బెంచ్‌మార్క్ ధర కంటే ఔన్సుపై ఏకంగా 30 డాలర్ల వరకు డిస్కౌంట్‌ను ప్రకటించారు. అంటే ఒక్క గ్రాముకు రూ.100కు పైగానే రాయితీ లభిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
రిస్క్ తీసుకోలేకనే..
దుబాయ్ నుంచి విమాన సర్వీసులు బంద్ అయినప్పటికీ బంగారాన్ని తరలించేందుకు ప్రత్యామ్నయ మార్గాలు ఉన్నాయి. సౌదీ అరేబియా లేదా ఒమన్ దేశాలకు బంగారాన్ని రోడ్డుమార్గంలో తీసుకెళ్లి, అక్కడి నుంచి విమానాల ద్వారా ఆసియా, ఆఫ్రికా దేశాలకు తరలించవచ్చు. కానీ గోల్డ్ ట్రేడర్లు అంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. యుద్ధం కారణంగా సరిహద్దుల వద్ద తనిఖీలు, భద్రతాపరమైన సమస్యలు, ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా భారీగా పెరగడంతో ట్రేడర్లు వెనుకంజ వేస్తున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి లాజిస్టిక్స్ ఖర్చులు 60 నుంచి 70 శాతం వరకు పెరగాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రవాణాకు అంత ఖర్చు చేసే బదులు.. ఉన్న చోటనే డిస్కౌంట్లతో అమ్మేస్తే బెటర్ అని ట్రేడర్లు భావిస్తున్నారు.
భారత్‌పై ప్రభావం ఎలా ఉండబోతుంది?
భారత్‌కు దుబాయ్ నుంచే ఎక్కువ శాతం బంగారం దిగుమతి అవుతుంది. కానీ దుబాయ్ నుంచి రవాణా నిలిచిపోవంతో.. బంగారం లభ్యత కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. అయినా కూడా ప్రస్తుతానికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. జనవరిలో భారత్ భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడంతో ప్రస్తుతానికి భారత్‌లో తగినంత స్టాక్ అందుబాటులో ఉండటంతో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే ఇరాన్ యుద్ధం మరికొద్ది నెలలు కొనసాగితే మాత్రం భారత్‌లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram