Snakes: పాములు ఏ సమయంలో నిద్రిస్తాయి.. ఏ సమయంలో యాక్టివ్ గా ఉంటాయి.. ?
పాములు ఏ సమయంలో నిద్రిస్తాయి.. ఏ సమయంలో మేల్కొని ఉంటాయి.. పాముల ఆహారపు అలవాట్లు ఏమిటి? విషపూరితమైన పాములు జంతువులను ఎలా చంపుతాయి? ఈ కథనంలో తెలుసుకుందాం..

Snakes: పాములు అనే పేరు వినగానే అందరికీ ఒక రకమైన భయం కలుగుతుంది. ఎందుకంటే విషపూరితమైన పాము కాటు వేసిందంటే ప్రాణాంతకం అవుతుంది. పాము విషం నేరుగా నాడీమండలం మీద పనిచేయడమే ఇందుకు కారణం. అయితే పాములు జీవనశైలి ఎలా ఉంటుంది.. అవి ఏ సమయంలో నిద్రిస్తాయి.. ఏ సమయంలో యాక్టివ్ గా ఉంటాయి.. అడవులు, ఎడారులు, మైదాన ప్రాంతాలు, నివాస ప్రాంతాల్లో సైతం తమ ఉనికిని ఎలా చాటు కుంటాయి.. అన్న అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
కొన్ని రకాలైన పాములు నిశాచర జీవులు. ఇవి రాత్రి సమయంలో చాలా అలర్ట్ గా ఉంటాయి. పాములు చల్లటి వాతావరణాన్ని ఇష్టపడతాయి. తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకొనే ప్రయత్నం చేస్తాయని చెబుతుంటారు శాస్త్రవేత్తలు. రస్సెల్ వైపర్, కింగ్ కోబ్రా వంటి పాములు రాత్రి సమయంలో ఎక్కువగా వేటాడతాయి, అయితే రాట్ స్నేక్ లేదా డబోయియా వంటివి పగటిపూట కూడా చురుకుగా కనిపిస్తాయి. వాతావరణం, ఆహార లభ్యత, జాతి లక్షణాలపై ఆధారపడి పాముల చురుకుదనం మారుతుంది.
పాముల ఆహారపు అలవాట్లు
పాములు మాంసాహార జీవులు. అవి చిన్న క్షీరదాలు, పక్షులు, ఉభయచరాలు, ఇతర సరీసృపాలు, కీటకాలు వంటి వివిధ జీవులను వేటాడతాయి. ఉదాహరణకు, కోబ్రా ఎలుకలు, కప్పలు, చిన్న పక్షులను ఇష్టపడితే, పైథాన్‌లు పెద్ద జంతువులైన జింకలు, దున్నపోతులను కూడా వేటాడగలవు. పాములు తమ ఆహారాన్ని రెండు పద్ధతుల్లో వేటాడతాయి: కోబ్రా, వైపర్ వంటి విష పాములు తమ విషాన్ని ఇంజెక్ట్ చేసి జంతువును చంపేస్తాయి. ఈ విషం జీవిని చంపడమే కాకుండా జీర్ణ ప్రక్రియను కూడా సులభతరం చేస్తుందట. పైథాన్, బోవా వంటి పాములు తమ శరీరాన్ని ఆహారం చుట్టూ గట్టిగా చుట్టి ఊపిరాడకుండా చేసి చంపుతాయి. పాములకు దవడలు అసాధారణంగా సాగే సామర్థ్యం ఉండటం వల్ల తమ పరిమాణం కంటే పెద్ద ఆహారాన్ని కూడా మింగగలవు. ఒకసారి ఆహారం తిన్న తర్వాత, పాములు రోజులు లేదా వారాలపాటు ఆహారం లేకుండా జీవించగలవు.
సైలెంట్ కిల్లర్స్
పాములు ఒంటరి జీవులు. అవి సాధారణంగా పెద్ద పెద్ద బండ రాళ్ల దగ్గర, చెట్ల కొమ్మల చాటున, నీటి ఒడ్డున దాక్కొని ఉంటాయి. కొన్ని పాముల శరీర రంగు వాటిని వాతావరణంలో కలిసి పోయే చేస్తూ ఉంటుంది. శత్రువుల నుంచి తప్పించుకొనేందుకు ఇది సహాయపడుతుంది. పాముల శరీరం చల్లగా ఉంటుంది. చలికాలంలో పాములు ఎండలో ఉండేందుకు ఇష్టపడతాయి. అలాగా వేడిగా ఉన్న సమయంలో నీడలో సేదతీరుతూ ఉంటాయి. పాములు సంవత్సరంలో కొంత కాలం శీతాకాల నిద్రలోకి వెళ్తాయి, దీనిని “హైబర్నేషన్” అంటారు. ఈ సమయంలో అవి ఆహారం తీసుకోవు, కదలవు. వర్షాకాలంలో ఎక్కువగా సంతానోత్పత్తి కోసం చురుకుగా ఉంటాయి. పాములు తమ నాలుకను ఉపయోగించి వాసనను గుర్తిస్తాయి. నాలుకను బయటకు చాచి, గాలిలోని రసాయనాలను సేకరించి, జాకబ్‌సన్ అవయవం ద్వారా వాటిని విశ్లేషిస్తాయి. పాములకు కనురెప్పలు లేవు. వీటి కళ్లు ఒక పొరతో కప్పబడి ఉంటాయి, ఇది కంటిని రక్షిస్తుంది.
రైతులకు మేలు చేసే పాములు
పాములు భయానకంగా కనిపించినా, అవి పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎలుకలు, కీటకాలను తినడం ద్వారా పంటలను కాపాడతాయి. అయితే, విష పాముల గురించి అవగాహన, జాగ్రత్తలు అవసరం. భారతదేశంలో ప్రతి సంవత్సరం పాము కాటు వల్ల అనేక మరణాలు సంభవిస్తాయి, కానీ సరైన వైద్య చికిత్సతో వీటిని నివారించవచ్చు.