Indiramma Indlu | ముగ్గు పోయ‌ని వారికి ఇందిర‌మ్మ ఇల్లు ర‌ద్దు.. జాబితా సిద్ధం చేస్తోన్న అధికారులు..!

Indiramma Indlu | రాష్ట్రంలోని నిరుపేద‌ల‌కు సొంతింటి క‌ల నెర‌వేర్చాల‌నే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) స‌ర్కార్ ఇందిర‌మ్మ ఇళ్ల( Indiramma Indlu ) ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. నియోజ‌క‌వర్గానికి 3500 చొప్పున ఇందిర‌మ్మ ఇళ్ల‌ను మంజూరు చేశారు.

  • By: raj |    telangana |    Published on : Mar 07, 2026 7:32 AM IST
Indiramma Indlu | ముగ్గు పోయ‌ని వారికి ఇందిర‌మ్మ ఇల్లు ర‌ద్దు.. జాబితా సిద్ధం చేస్తోన్న అధికారులు..!

అర్హుల్లో మ‌రొక‌రికి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం యోచ‌న‌
జాబితా సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం..
2 ల‌క్ష‌ల ఇళ్ల‌కు రూ. 4700 కోట్ల నిధులు మంజూరు
మార్చి చివ‌రి నాటికి ల‌క్ష ఇళ్ల‌ల్లో గృహ ప్ర‌వేశం

Indiramma Indlu | రాష్ట్రంలోని నిరుపేద‌ల‌కు సొంతింటి క‌ల నెర‌వేర్చాల‌నే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) స‌ర్కార్ ఇందిర‌మ్మ ఇళ్ల( Indiramma Indlu ) ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. నియోజ‌క‌వర్గానికి 3500 చొప్పున ఇందిర‌మ్మ ఇళ్ల‌ను మంజూరు చేశారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ల‌బ్దిదారులు త‌మకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల‌ను వేగవంతంగా నిర్మించుకుంటున్నారు. కానీ ఇళ్ల ల‌బ్దిదారుల్లో కొంత‌మంది.. ఇప్ప‌టికీ ముగ్గు కూడా పోయ‌లేదు. అలాంటి వారికి ఇందిర‌మ్మ ఇళ్ల‌ను ర‌ద్దు చేసి.. అర్హుల్లో మ‌రొక‌రికి అవ‌కాశం ఇవ్వాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికీ పునాదుల‌కు ముగ్గు పోయ‌ని ల‌బ్దిదారుల వివ‌రాల‌ను సేక‌రించ‌డంపై ప్ర‌భుత్వం దృష్టి సారించింది.

ఒక్క నిజామాబాద్ జిల్లాల్లోనే 7 వేల మందికి పైగా..

ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 17,381 ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అయితే వాటిలో 13,180 మంది లబ్ధిదారులు మాత్ర‌మే ముగ్గు పోసి పునాదులు వేసి నిర్మాణ పనులు మొద‌లు పెట్టారు. ఈ ఇళ్ల నిర్మాణ ప‌నులు ఆయా ద‌శ‌ల్లో ఉన్నాయి. కొన్ని ఇళ్ల నిర్మాణాలు చివ‌రి ద‌శ‌కు కూడా చేరుకున్నాయి. కానీ సుమారు 7 వేల మంది కనీసం పునాదులైనా నిర్మించేందుకు ముందుకు రావడం లేదు. డీఈలు, ఏఈలు క్షేత్రస్థాయికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయినా వారి నుంచి సరైన స్పందన రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇళ్లు మంజూరైనా గత ఆరు నెలలుగా పునాదులకు ముగ్గు కూడా పోయని లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దీని ఆధారంగా వాటిని రద్దు చేసి, అర్హుల్లో మరొకరికి లబ్ధి చేకూరేలా చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా పూర్తి స్థాయి ఆదేశాలు రాలేదని గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు.

2 ల‌క్ష‌ల ఇళ్ల‌కు రూ. 4700 కోట్ల నిధులు మంజూరు

రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి పేద‌వాడికి సొంతింటి క‌ల‌ను నిజం చేయ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని, ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి వీపీ గౌత‌మ్ ఇటీవ‌ల పేర్కొన్నారు. మార్చి చివ‌రి నాటికి ల‌క్ష ఇళ్ల‌ల్లో గృహ ప్ర‌వేశాలు చేయించాల‌నే దిశ‌గా ముందుకు వెళ్తున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే రెండు ల‌క్ష‌ల ఇళ్ల‌కు రూ. 4700 కోట్ల నిధులు మంజూరు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ల‌బ్దిదారుల‌కు సులువుగా సేవ‌ల‌ను అందించేందుకు ఇందిర‌మ్మ ఇళ్ల యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు. ఈ యాప్‌లో వివ‌రాలు న‌మోదు చేసిన 15 రోజుల‌కే ఇళ్ల బిల్లులు చెల్లిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

నిజామాబాద్​ జిల్లాలో ఇదీ పరిస్థితి :

మంజూరైన ఇళ్ల సంఖ్య – 17,381
గ్రౌండింగ్​ చేసినవి – 13,180
బేస్​మెంట్​ లెవర్​ వరకూ చేసినవి – 10,364
రూఫ్​ లెవల్​ వరకూ పూర్తి చేసినవి – 7,488
స్లాబ్​ స్థాయి వరకూ పూర్తి చేసినవి – 5,887
పూర్తయిన ఇళ్లు – 375
ముగ్గు పోయనివి – 4,200
ముగ్గు పోసినా పనులు మొదలు కానివి – 2,800