Cobra Dry Bites | కోబ్రా కాట్లన్నీ విషపూరితమేనా? వాటి విషం, పొడి కాట్ల వెనుక రహస్యాలేంటి?

కోబ్రాల్లోని విషం.. న్యూరోటాక్సిక్‌. అది నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. నాడుల నుంచి వెళ్లే సంకేతాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా కండరాల పక్షవాతం, శ్వాసకోశ వ్యవస్థ విఫలం, గుండెపోటు వంటివి సంభవిస్తాయి.

Cobra Dry Bites | కోబ్రా కాట్లన్నీ విషపూరితమేనా? వాటి విషం, పొడి కాట్ల వెనుక రహస్యాలేంటి?

Cobra Dry Bites | పాము అనగానే సాధారణంగా ప్రతి ఒక్కరి మదిలో పడగ విప్పి బుసలు కొడుతున్న దృశ్యం మెదులుతుంది. భారతదేశం లాంటి గ్రామీణ ప్రాంతాలు అత్యధికంగా ఉన్న దేశంలో మనుషులకు పాములు తారసపడటం తరచూ జరిగేదే. వీటిలో కోబ్రాలు అత్యంత ప్రమాదకరమైన పాములు. అయితే.. అన్ని కోబ్రాల కాట్లు విషపూరితం లేదా ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నారు. కోబ్రా దాడి చేసిన సమయాల్లో కొన్ని సందర్భాల్లో ‘పొడి కాట్లు’ కూడా ఉంటాయని అంటున్నారు. అంటే.. కాటు వేసినప్పుడు విషాన్ని వదలకపోవడం అన్నమాట. సుమారు మూడింట ఒక వంతు కోబ్రా కాట్లు ‘పొడి కాట్లు’ లేదా డ్రై బైట్స్‌ ఉంటాయట. అంత మాత్రన తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని, పాము కాటుకు గురైన వ్యక్తిని వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. వీటి కాట్ల వెనుక కూడా ఒక సైన్స్‌ ఉన్నది. డ్రై బైట్స్‌, విషం పరిమాణం, జీవసంబంధమైన కోబ్రా ప్రవర్తన లక్షణాల గురించి అవగాహన కలిగి ఉంటే.. కీలక సమయంలో బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక పాముకాటు మరణాలు భారతదేశంలోనే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది. ఏటా 50వేల నుంచి 60 వేల మంది పాము కాట్లతో చనిపోతున్నారని డబ్ల్యూహెచ్‌వో లెక్కలు పేర్కొంటున్నాయి.

కోబ్రా బుసలు.. హెచ్చరికలు

సాధారణంగా కోబ్రా కాటు ప్రాణాంతం అని ఎక్కువ మంది భావిస్తుంటారు. వాస్తవానికి కోబ్రాలు కాటు వేయడానికి ముందు హెచ్చరిస్తూ బుస కొడతాయి. కాటు వేసిన సమయంలో కూడా 20 నుంచి 30 శాతం కాట్లు విషపూరితం కాదని నిపుణులు చెబుతున్నారు. అంటే.. ఆ సమయాల్లో కాటు పడిన ప్రదేశంలోకి విషం చొచ్చుకుపోదు. కోబ్రా వంటి పాములు తమ విషాన్ని ఆత్మరక్షణ, వేట కోసం ఎక్కువగా ఉపయోగిస్తాయి. విషాన్ని ఉత్పత్తి చేసుకోవడం కూడా వాటికి కష్టమైన పనే. అందుకే వాటి విషాన్ని మనుషులను భయపెట్టేందుకంటే.. ఆహారాన్ని వేటాడుకోవటం కోసం దాచి పెట్టుకోవడం వాటికి అవసరం. ఎందుకంటే మనిషిని కోబ్రాలు తినలేవు. అందుకే అటువంటి సమయాల్లో ఎక్కువగా కోబ్రాలు డ్రై బైట్స్‌ వేస్తాయి. అదొక హెచ్చరిక, ఆత్మరక్షణ చర్య మాత్రమే. విషాన్ని ఒకసారి వదలిన తర్వాత మళ్లీ ఉత్పత్తి చేసుకోవడానికి కోబ్రాలకు ఆరు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది. అప్పటికే ఎవరినైనా కాటు వేసి ఉంటే.. తదుపరి కాటు పడిన వ్యక్తికి విషం ఎక్కదు. ఎందుకంటే.. విషం ఆ పాములో ఖాళీ అయిపోతుంది.

కోబ్రా విషం మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

కోబ్రాల్లోని విషం.. న్యూరోటాక్సిక్‌. అది నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. నాడుల నుంచి వెళ్లే సంకేతాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా కండరాల పక్షవాతం, శ్వాసకోశ వ్యవస్థ విఫలం, గుండెపోటు వంటివి సంభవిస్తాయి.

విషంలో ఏముంటాయి.. ఒక కాటులో ఎంత విషం ఉంటుంది?

నాడీ కండరాల జంక్షన్ల వద్ద ఎసిటైల్కోలిన్ గ్రాహకాలను నిరోధించే న్యూరోటాక్సిన్లు, స్థానిక కణజాలాన్ని నష్టపరిచే, చచ్చుబడిపోయేలా ప్రేరేపించే సైటోటాక్సిన్లు, శరీర కణజాలంలో విషం వ్యాప్తి చెందడానికి దోహదం చేసే ఎంజైమ్‌లు కోబ్రా విషంలో ఉంటాయి. సాధారణంగా కోబ్రా కాటు వేసినప్పుడు 200 నుంచి 500 మిల్లీగ్రాముల విషం వెలువడుతుంది. మనిషి లేదా ఏనుగు వంటి భారీ జంతువులను చంపడానికి 700 మిల్లీగ్రాముల విషం కావాల్సి ఉంటుంది. వెంటనే యాంటివెనం ఔషధాలు, తగిన వెంటిలేషన్‌ సపోర్ట్‌ ఇస్తే ప్రాణాపాయ ప్రమాదం నుంచి తప్పించేందుకు గణనీయమైన అవకాశాలు ఉంటాయి. కనుక.. కోబ్రా లేదా ఎలాంటి పాము అయినా కాటు వేస్తే వెంటనే వైద్య చికిత్స అందించడం అనేది అత్యంత ముఖ్యమని, విజ్ఞాన శాస్త్రం ఆమోదించని నాటు వైద్యాలు, పసరు వైద్యాలను నమ్ముకోవడం నష్టమని నిపుణులు సూచిస్తున్నారు.

పాముల గురించిన ఈ ఆసక్తికర కథనాలు చదివారా?

Snake Dens | దాదాపు లక్షన్నర పాములు ‘కలిసే’ అతిపెద్ద ‘పాముల జాత‌ర’ ఎక్కడో తెలుసా?
Snake Bites: 103 సార్లు పాముల కాటు.. ప్రతిసారి పునర్జన్మ!
King Cobra, Mongoose Fight | కింగ్ కోబ్రా, తెల్ల తోక ముంగిస మ‌ధ్య ఫైట్‌లో గెలిచేదేంటి?