Snake Bites: 103 సార్లు పాముల కాటు.. ప్రతిసారి పునర్జన్మ!

ఒకసారి పాము కాటు వేస్తేనే శరీరంలోకి విషం ఎక్కడానికి ముందుగానే భయానికే సగం చస్తారు. అలాంటిది ఓ మనిషి ఏకంగా 103సార్లు తనను పాములు కాటు వేసినా బతికి బట్ట కట్టడం వైరల్ గా మారింది.

Snake Bites: 103 సార్లు పాముల కాటు.. ప్రతిసారి పునర్జన్మ!

Snake Bites: ఒకసారి పాము కాటు వేస్తేనే శరీరంలోకి విషం ఎక్కడానికి ముందుగానే భయానికే సగం చస్తారు. అలాంటిది ఓ మనిషి ఏకంగా 103సార్లు తనను పాములు కాటు వేసినా బతికి బట్ట కట్టడం వైరల్ గా మారింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా వరుసగా పాము కాటుకు గురవుతున్నాడు. అతడిని పాములు పగ బట్టయా లేక..ప్రమాదవశాత్తు అతడు పాము కాటుకు గురవుతున్నాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సుబ్రమణ్యం ఇప్పటివరకు 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు.. అన్ని సార్లు కూడా పాము కాటుకు గురై.. ఆసుపత్రి పాలై చికిత్స పొంది బతికిపోయి చివరకు మృత్యుంజడయ్యాడు. వినడానికి సుబ్రమణ్యం పడిన పాముకాటుల అవస్థ వింతగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నా..ఇదే నిజం.18 ఏళ్ల వయసులో కర్ణాటక రాష్ట్రంలో నివాసము ఉంటూ తొలిసారి పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యం.. ఏడాదికి నాలుగైదు సార్లు పాముకాట్లకు గురవుతుండటంతో కుటుంబ సభ్యులు సర్పదోష నివారణ, రాహుకేతు పూజలు, పరిహారాల వంటివి చేశారు. అయినా పరిస్థితిలో మార్పు లేదు. ఏ సర్ప దోషం ఉందో తెలియదు కానీ పాములు మాత్రం అతనిపై పగతో రగిలి పోతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

పాముల నుంచి తప్పించుకోవడానికి పదేళ్ల కిందట బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ భవన నిర్మాణ, మట్టి పనులు చేశారు. అక్కడ కూడా పాములు సుబ్రహ్మణ్యంను వదల్లేదు. బెంగళూరులోనూ పాము కాటు వేయడంతో వైద్యం చేయించుకుని బతికాడు. భయాందోళనలతో అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చి స్థానికంగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమలో పని చేస్తునే..పొలం పనులకూ వెళ్తున్నాడు. తాజాగా రెండు రోజుల క్రితం తన ఊరి సమీపంలో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది.

ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం మాత్రం తప్పింది. తరచూ పాములు కరుస్తుండటంతో చికిత్స కోసం అప్పులు చేయాల్సి వస్తోందని, నయమయ్యాక కూలీ పనులు చేసి వాటిని తీర్చడం తీవ్రమైన భారంగా మారిందని సుబ్రహ్మణ్యం భార్య శారదమ్మ వాపోయారు. సుబ్రమణ్యంకు పాము కాటుల బెడద తీరేదెట్లా అన్నది ఎవరికి అంతుపట్టడం లేదు.