Actress | సోషల్ మీడియాలో వేధింపులు, శరీరంపై విమర్శలు… ధురంధ‌ర్ నటి సంచలన వ్యాఖ్యలు

Actress | బాలీవుడ్ నటి ఆయేషా ఖాన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న వివక్ష, సోషల్ మీడియాలో ఎదురవుతున్న వేధింపుల గురించి సంచలన విషయాలు వెల్లడించింది.

  • By: sn |    movies |    Published on : Mar 05, 2026 8:52 AM IST
Actress | సోషల్ మీడియాలో వేధింపులు, శరీరంపై విమర్శలు… ధురంధ‌ర్ నటి సంచలన వ్యాఖ్యలు

Actress | బాలీవుడ్ నటి ఆయేషా ఖాన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న వివక్ష, సోషల్ మీడియాలో ఎదురవుతున్న వేధింపుల గురించి సంచలన విషయాలు వెల్లడించింది. ‘We The Women’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, మహిళలు ఎదుర్కొనే సమస్యలపై భావోద్వేగంగా స్పందించింది. ముఖ్యంగా ధురంధర్ సినిమాలోని ‘షరారత్’ సాంగ్ సమయంలో ఎదురైన పరిస్థితులను కూడా ఆమె వెల్లడించింది.

“లావుగా ఉన్నావని అవకాశం తీసేశారు”

తాను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే టి-సిరీస్ రూపొందించే ఒక పాటలో సెకండ్ లీడ్ పాత్రకు అవకాశం వచ్చిందని ఆయేషా తెలిపింది. అయితే షూటింగ్‌కు ఒక రోజు ముందు “లావుగా ఉన్నావు” అనే కారణంతో ఆ అవకాశం నుంచి తనను తొలగించారని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సంఘటన తనపై చాలా ప్రభావం చూపిందని, తన రూపంపై ఆత్మవిశ్వాసం తిరిగి పొందడానికి చాలా కాలం పట్టిందని చెప్పింది.

సోషల్ మీడియాలో రేప్ బెదిరింపులు

సోషల్ మీడియా వేదికలపై తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి కూడా ఆయేషా ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ ఫోటో పెట్టినా, ఏ డ్రెస్ ధరించినా కొందరు నెటిజన్లు తనను కేవలం లైంగిక కోణంలోనే చూస్తున్నారని ఆమె పేర్కొంది. నేను నార్మల్ టాప్ వేసుకున్నా, స్కర్ట్ వేసుకున్నా సమస్యే. ఏదైనా పోస్ట్ చేయాలంటే భయపడాల్సి వస్తోంది. ప్రతిరోజూ నాకు రేప్ బెదిరింపులు వస్తుంటాయి. ఇవి కేవలం కామెంట్లు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న కొందరి మనస్తత్వాన్ని చూపిస్తున్నాయి అని ఆమె పేర్కొంది.

పీరియడ్స్ వ్యాఖ్యలపై ట్రోలింగ్

గతంలో పీరియడ్స్ సమయంలో పని చేసిన విషయాన్ని చెప్పినప్పుడు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదురయ్యాయని ఆమె తెలిపింది. ‘ధురంధర్’ సినిమాలోని పాపులర్ ‘షరారత్’ పాటకు తాను పీరియడ్స్ నొప్పి ఉన్నప్పటికీ డ్యాన్స్ చేశానని చెప్పగా, ఆ వ్యాఖ్యలను మీమ్స్‌గా మార్చి ఎగతాళి చేశారని ఆమె వాపోయింది. నా పీరియడ్స్ గురించి జోకులు వేయడం దేశవ్యాప్తంగా పెద్ద విషయమా? మహిళలు ఆ సమయంలో ఎంత కష్టపడతారో మగవారికి తెలియదు. ఆ పరిస్థితుల్లో కూడా నేను పని చేసినందుకు గర్వపడుతున్నాను అని ఆమె పేర్కొంది.

టీవీ నుంచి సినిమాల వరకు

టెలివిజన్ రంగంలో జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయేషా ఖాన్ ‘కసౌతీ జిందగీ కే’, ‘బాల్ వీర్ రిటర్న్స్’ వంటి సీరియళ్లలో నటించింది. తెలుగులో ‘ముఖచిత్రం’ సినిమా ద్వారా ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అలాగే రియాలిటీ షో బిగ్ బాస్ 17 ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇటీవల కపిల్ శర్మ నటించిన ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’ లో కూడా ఆమె కనిపించింది. ఇక రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సీక్వెల్ మార్చి 19న విడుదల కానుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది విడుదలైన ‘ధురంధర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో సీక్వెల్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.