Ranveer Singh| ముదురుతున్న ‘డాన్ 3’ వివాదం .. రణ్‌వీర్ సింగ్‌పై సహాయ నిరాకరణ ఆదేశాలు, రూ.45 కోట్ల నష్టం ఆరోపణలు!
Ranveer Singh| బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘డాన్ 3’ చిత్రం చుట్టూ ఊహించని వివాదం నెలకొంది. స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, నటుడు-దర్శకుడు ఫర్హాన్ అక్తర్ మధ్య నడుస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు పరిశ్రమ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది.
Ranveer Singh| బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘డాన్ 3’ చిత్రం చుట్టూ ఊహించని వివాదం నెలకొంది. స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, నటుడు-దర్శకుడు ఫర్హాన్ అక్తర్ మధ్య నడుస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు పరిశ్రమ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. సినిమా నుంచి రణ్‌వీర్ సింగ్ అర్ధాంతరంగా వైదొలిగారనే ఆరోపణల నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) సంచలన నిర్ణయం తీసుకుంది.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో, చిత్ర పరిశ్రమకు చెందిన 38 విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు నాలుగు లక్షల మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు రణ్‌వీర్ సింగ్‌తో కలిసి పనిచేయకూడదని ‘సహాయ నిరాకరణ ఆదేశం’ (Non-Cooperation Directive) జారీ చేసినట్లు ఫెడరేషన్ ప్రకటించింది. ఈ వివాదం పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
రూ.45 కోట్ల నష్టం.. నిర్మాతల ఆరోపణలు
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం డాన్ 3 కోసం నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్న సమయంలో, షూటింగ్ ప్రారంభానికి కేవలం మూడు వారాల ముందు రణ్‌వీర్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని నిర్మాతలు ఆరోపిస్తున్నారు.
ఈ కారణంగా ఇప్పటికే చేసిన ఏర్పాట్లు, సెట్లు, ఇతర ప్రీ-ప్రొడక్షన్ ఖర్చుల రూపంలో సుమారు రూ.45 కోట్ల మేర నష్టం వాటిల్లిందని దర్శకుడు ఫర్హాన్ అక్తర్, నిర్మాత రితేష్ సిధ్వానీ ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (IFTDA) ద్వారా అధికారిక ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మూడుసార్లు నోటీసులు.. స్పందించలేదన్న ఫెడరేషన్
ఈ ఫిర్యాదు అందుకున్న అనంతరం ఫెడరేషన్ రణ్‌వీర్ సింగ్‌కు వరుసగా మూడుసార్లు నోటీసులు పంపినట్లు వెల్లడించింది. అయితే ఆయన తరఫున సరైన సమయంలో స్పందన రాలేదని, అందువల్ల నిర్మాతలు మరియు పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని FWICE ముఖ్య సలహాదారు అశోక్ పండిట్, అధ్యక్షుడు బి.ఎన్. తివారీ వివరించారు.
సినిమా పరిశ్రమ అనేది వేలాది మంది జీవితాలతో ముడిపడి ఉంటుందని, అగ్ర నటులు కీలక దశల్లో తీసుకునే నిర్ణయాలు కేవలం నిర్మాతలనే కాకుండా దినసరి కార్మికులపై కూడా ప్రభావం చూపుతాయని వారు అభిప్రాయపడ్డారు.
మౌనం వీడిన రణ్‌వీర్ సింగ్ టీమ్
ఈ వివాదంపై ఇప్పటివరకు మౌనం పాటించిన రణ్‌వీర్ సింగ్ టీమ్ కూడా తాజాగా స్పందించింది. తమ వాదనను వినిపిస్తూ, వృత్తిపరమైన విషయాలు మరియు వ్యక్తిగత సంబంధాలను ఎప్పుడూ గౌరవప్రదంగా పరిష్కరించాలని రణ్‌వీర్ నమ్ముతారని పేర్కొంది.
అలాగే ఈ వివాదం పూర్తిగా ఒక కాంట్రాక్టు అంశానికి సంబంధించినదని, దీనిపై నిర్ణయం తీసుకునే సరైన వేదిక FWICE కాదని అభిప్రాయపడింది. సినిమా ప్రకటించి చాలా కాలం గడిచినా పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్ అందించలేదని, కథలో స్పష్టత లేకపోవడం వల్లే ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిపింది. అంతేకాకుండా ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో కూడా లోపాలు ఉన్నాయని, తమకు ఎలాంటి అడ్వాన్స్ చెల్లింపులు జరగలేదని రణ్‌వీర్ వర్గాలు పేర్కొంటున్నాయి.
చర్చలకు సిద్ధమన్న ఫెడరేషన్
ప్రస్తుతం సహాయ నిరాకరణ ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ, ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఫెడరేషన్ స్పష్టం చేసింది. రణ్‌వీర్ సింగ్ వచ్చి తమతో చర్చలు జరిపితే, ఇరు పక్షాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘డాన్ 3’ వివాదం హాట్ టాపిక్‌గా మారగా, ఈ వివాదం ఎలా ముగుస్తుంది? రణ్‌వీర్ మళ్లీ ప్రాజెక్ట్‌లో చేరుతారా? లేక కొత్త హీరో రంగంలోకి దిగుతారా? అనే అంశాలపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram