Narcisse Snake Dens | మైనస్‌ 30 డిగ్రీల చలి.. భూగర్భంలో ఒకే చోట లక్షకుపైగా పాములు..

చలికాలంలో పాములు బొరియల్లో, పుట్టల్లో, కొండల మధ్య సందుల్లో రక్షణ పొందుతూ ఉంటాయి. కానీ.. ఇలా ఒకే ప్రాంతంలో లక్షకుపైగా పాములు రక్షణ పొందే ప్రాంతం ప్రపంచంలోనే ఒకేఒక్కటి ఉందని తెలుసా?

  • By: TAAZ |    trending |    Published on : Feb 13, 2026 8:16 PM IST
Narcisse Snake Dens | మైనస్‌ 30 డిగ్రీల చలి.. భూగర్భంలో ఒకే చోట లక్షకుపైగా పాములు..

Narcisse Snake Dens | వంద కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా లక్షకుపైగా పాములు! అది కూడా భూమిలోపల ఒక చోట గుంపుగా చేరి.. శీతాకాలం నుంచి రక్షణ పొందుతాయి. చలితో గడ్డకట్టిపోయే సమయంలో ఇవన్నీ మాయమైపోయినట్టే కనిపిస్తాయి. వసంత రుతువు రాగానే వేల సంఖ్యలో బయటకు వస్తూ పర్యాటకులను విస్మయానికి గురిచేస్తూ ఉంటాయి. ఇది సినిమా కాదు.. ప్రకృతి అద్భుతం. ఆ ప్రాంతం కెనడాలోని మనిటోబా ప్రావిన్స్‌లో ఉంది. ఇక్కడి నార్సిస్సే ప్రపంచంలోనే అతిపెద్ద స్నేక్స్‌ డెన్‌గా పిలుస్తారు. ఈ ప్రత్యేకత కారణంగా ఈ ప్రాంతాన్ని వైల్డ్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఏరియాగా పరిగణిస్తున్నారు.

చలికాలంలో పాములు మనుగడ సాగించలేవు. ఎందుకంటే వాటి రక్తం చల్లగా ఉంటుంది కనుక. అందుకే అవి చలికాలంలో బ్రూమేషన్‌ అనే ప్రక్రియ పాటిస్తూ.. నిస్తేజంగా ఉంటాయి. కదలికలను బాగా తగ్గించుకుంటాయి. శ్వాస తీసుకునే ప్రక్రియను కూడా తమంతట తాముగా తగ్గించుకుంటాయి. ఇదే క్రమంలో నార్సిస్సేలోని డెన్స్‌.. చలికాలంలో లక్షకుపైగా రెడ్‌ సైడెడ్‌ గార్టర్‌ స్నేక్స్‌కు ఆవాసాలుగా ఉంటాయి. ఇక్కడ పెద్ద ఎత్తున లైమ్‌స్టోన్‌ కొండలు ఉంటాయి. వాటి పగుళ్ల మధ్య, నీరు పారి నున్నగా మారిన గుంతల్లో ఈ పాములు రక్షణ పొందుతూ ఉంటాయి. మళ్లీ వసంతకాలం ప్రారంభం కాగానే బొరియలు, గుంతలు, పుట్టల నుంచి బయటకు వచ్చి తోడు కోసం వెతుక్కుంటాయి. బ్రీడింగ్‌ సీజన్‌ ముగియగానే మళ్లీ చుట్టుపక్కల పచ్చికబయళ్లలోకి వెళ్లిపోతాయి. అక్కడే వేసవికాలం మొత్తం ఉండి.. ఆహారం వేటాడుకుంటూ తిరుగుతుంటాయి.

నార్సిస్సే స్నేక్‌ డెన్స్‌.. గ్రామీణ మున్సిపాలిటీ ప్రాంతమైన ఆర్మ్‌స్ట్రాంగ్‌లో ఉంది. ఇక్కడ గడ్డభూములు, అడవులు, వాటి కింద రంథ్రాలతో నిండిన సున్నపురాతి పొరలు ఉంటాయని బీబీసీ వైల్డ్‌ లైఫ్‌ పేర్కొంటున్నది. బయట మైనస్‌ 30 డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ.. ఈ సున్నపురాతి గుహలు, పగుళ్ల మధ్యలో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయిలో ఉండవు. అందుకే ఇవి పాములకు సేఫ్‌ వింటర్‌ షెల్టర్‌గా మారాయి.

ప్రతి ఏడాది సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ మధ్యలో లక్షకుపైగా రెడ్‌ సైడెడ్‌ గార్టర్‌ పాములు ఇక్కడికి చేరుకుంటాయి. ఆ తర్వాత సుమారు ఐదారు నెలలు గుంపులు గుంపులుగా ఇక్కడే నిశ్శబ్దంగా, నిశ్చేష్టంగా ఉండిపోతాయి. ఇంతకు ముందు చెప్పుకొన్నట్టు పాముల రక్తం చల్లగా ఉంటుంది. దీంతో బయటి వాతావరణపైనే దీని మనుగడ ఆధారపడి ఉంటుంది. చలికాలంలో పాముల్లో జీర్ణక్రియ దాదాపు స్తంభించిపోతుంది. అలా అవి తమ శక్తిని కాపాడుకుంటూ చలికాలాన్ని నెట్టుకొస్తాయి. ఇలా గుంపులుగా ఉండటం వల్ల తేమ తగ్గదని, పాముల శరీర ఉష్ణ్రోగ్రత స్థిరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఈ ప్రక్రియ ద్వారా అవి ప్రాణాలతో ఉంటాయన్నమాట.

స్ప్రింగ్‌ సీజన్‌లో మేటింగ్‌ బాల్స్‌

మంచు కరగడం మొదలైన తర్వాత మొదటగా మగపాములు బయటకు వస్తాయి. ఆ తర్వాత ఆడపాములు ప్రత్యేకమైన ఫెరోమోన్లు విడుదల చేస్తాయి. ఆ వాసనను పసిగట్టిన మగపాములు .. ఆడపాముతో జత కట్టేందుకు వస్తాయి. ఇలా ఒక్కోసారి వందకుపైగా పాములు కూడా వస్తాయి. అప్పుడు అవి బంతిలా కదులుతూ ఉంటాయి. దానినే మేటింగ్‌ బాల్‌ అని పిలుస్తుంటారు. ఇవి పర్యాటకులకు కనువిందు చేస్తాయి.

రెడ్‌ సైడెడ్‌ గార్టర్‌ పాములు విషరహితాలు. వాటితో మనుషులకు పెద్ద ప్రమాదం ఏమీ లేదు. కానీ.. వాటిని భయపెడితే.. అవి దూకుడుగా ప్రవర్తిస్తాయి. సాధారణంగా మూడు నుంచి నాలుగు అడుగుల పొడవు వరకూ పెరుగుతాయి. ఆలివ్‌ బ్రౌన్‌ లేదా నలుపు రంగులో ఉంటాయి. వెనుక పసుపు గీత, ఇరువైపులా ఎర్రని మచ్చలతో చూడటానికి ముచ్చటగొల్పుతాయి. ఇంకో విశేషం ఏమిటంటే.. ఇవి గుడ్లను పెట్టవు.. నేరుగా పాము పిల్లలను ప్రసవిస్తాయి.

సంతానోత్పత్తి సీజన్‌ ముగిసిన తర్వాత చుట్టుపక్కల మడులు, చెరువులు, కాలువలు, పచ్చికబయళ్లలో తిరుగుతూ అక్కడి ఎలుకలు, పురుగులను తింటాయి. ఇలా పర్యావరణానికి మేలు చేస్తాయి. వేసవి మొత్తం అక్కడే గడిపి.. మళ్లీ చలికాలం ప్రారంభమయ్యే నాటికి వాటి రక్షణ కేంద్రాలకు చేరుకుంటాయి.