World Snake Day | పాము చెబుతున్న ఆత్మకథ.. జూలై 16 అంతర్జాతీయ పాముల దినోత్సవం

మేం పర్యావరణ మిత్రులం. మమ్మల్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని రక్షిస్తే.. పర్యావరణ సమతుల్యాన్ని మీరు రక్షించినట్టే. పాముల దినోత్సవం సందర్భంగా ఒక సంకల్పం తీసుకోండి. మా మీద అపోహలు తొలగించుకోండి.

World Snake Day | పాము చెబుతున్న ఆత్మకథ.. జూలై 16 అంతర్జాతీయ పాముల దినోత్సవం

World Snake Day | జూలై 16ను ప్రతియేటా పాముల దినోత్సవం నిర్వహించుకుంటున్న మానవాళికి మా జాతి తరఫున కృతజ్ఞతలు. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 3,900కుపైగా వివిధ రకాల పాములను గుర్తించారు. పాముల పట్ల అపోహలు తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. పాముల దినోత్సవాన్ని పురస్కరించుకుని మా జాతికి సంబంధించిన కొన్ని అంశాలు పంచుకోవాలని అనిపించింది. పాములంటేనే అందరూ భయపడిపోతుంటారు. మేము పొరపాటున మీ ఆవాస ప్రాంతాల్లోకి వస్తే.. మమ్మల్ని కొట్టి చంపుతారు. ఒక విషయం చెప్పిన తర్వాత మిగతా అంశాలు ప్రస్తావిస్తాను. మా జాతిలో విషజీవులు కూడా ఉన్నాయి. కానీ.. మా జాతిలో 75 నుంచి 85 శాతం పాములు విషపూరితం కానివే. మమ్మల్ని చంపాలనుకునే ముందు ఇదొక్కటి గుర్తు పెట్టుకోండి చాలు. ఏవో ఎలుకలు, బల్లులు వంటి చిన్న చిన్న జీవులను తిని బతికే జీవులం. ఇక మా కథ.. మా వ్యథ చెబుతాను.. నిజానికి మేము పర్యావరణ హిత జీవులం. పంటపొలాలను పాడు చేసే ఎలుకలు మా ప్రధాన ఆహారం. మాలో చాలా వరకూ విషరహితమే అయినప్పటికీ.. మమ్మల్ని మేం కాపాడుకునేందుకే బుస కొడతాం. మేం భయపడితేనే మిమ్మల్ని కాటు వేస్తాం. మమ్మల్ని కలల్లో పీడించే జీవులుగా చూడకండి. మమ్మల్ని ప్రకృతి మిత్రులుగా భావించండి.

మా రక్తం చల్లగా ఉంటుంది. అంత మాత్రాన దారుణమైన నేరాలు జరిగినప్పుడు కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌ అంటూ మా రక్తాన్ని ఎందుకు అవహేళన చేస్తారో మాకు అర్థం కాదు. మేం ఎలుకలు, పంది పిల్లలు, చిన్న చిన్న జంతువులు, పక్షులు, ఈదురుపుట్టలు, కీటకాలను తిని బతుకుతాం. అడవులు, పొలాలు, పల్లెటూర్లు, ఎడారులు, నీరు లభించే ప్రాంతాలు, కొండల్లో మా ఆవాసాలు ఉంటాయి. దారితప్పిన కొన్ని పాములు పట్టణ ప్రాంతాల్లోనూ కనిపిస్తుంటాయి.

మాలో కొన్నిజాతులు గుడ్లు పొదిగి పాము పిల్లలను పెడతాయి. కొన్ని నేరుగా పిల్లలను ప్రసవించే జాతులూ ఉన్నాయి. మేం పర్యావరణహిత జీవులం. పర్యావరణ సమతుల్యానికి కీలకంగా వ్యవహరిస్తాం. మానవాళికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కొన్ని రకాల మేలు చేస్తుంటాం. వ్యవసాయానికి ఎలుకలు, చెద పురుగులు, ఇతర పురుగులు ఎంతో హాని చేస్తుంటాయి. పొలాలకు తెగుళ్లు ఆశించకుండా చూసుకునేదీ మేమే. మేం వాటిని తినడం ద్వారా పొలాల్లో సహాయకులుగా ఉండి.. రైతుల పంటలు కాపాడుతుంటాం. ఈ సృష్టిలో జీవ వైవిధ్యాన్ని కాపాడే క్రమంలో చిన్న చిన్న జంతువులు లెక్కకు మిక్కిలి పెరిగిపోకుండా వాటి జనాభాను నియత్రించేది మేమే. గాలిలో, నేలపై, నీటిలో జీవుల సంఖ్యను సమతుల్యంలో ఉంచేందుకు మేం వాటిని తింటూ ఉంటాం. కొన్ని సార్లు పాములను కూడా తింటుంటాం. దానితో అవి లెక్కకు మిక్కిలి పెరగకుండా చూస్తాం. ఒక ఏడాదిలో ఒక పాము వందల ఎలుకలను తినగలదు. పాముల సంఖ్య తగ్గిపోయిన చోట్ల ఎలకలు, కీలకాల బెడద ఎక్కువవుతుంది. వ్యవసాయం ఇబ్బందిగా మారుతుంది.

మా విషం ప్రాణాలు తీసేది మాత్రమే కాదు.. ప్రాణాలు పోసేది కూడా. పాముల విషయాన్ని వివిధ ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, అల్లోపతి ఔషధాల తయారీలోనూ మీ శాస్త్రవేత్తలు ఉపయోగిస్తుంటారు. అనేక ప్రాణాధార ఔషధాల తయారీలో మా విషయాన్ని వాడుతారు. ప్రత్యేకించి, బీపీ, క్యాన్సర్‌ చికిత్స, బ్లడ్‌ క్లాటింగ్‌ వంటి ఔషధాల తయారీలో వాడుతారు. పాము కాట్లతో మరణాలు సంభవించకుండా ఇచ్చే యాంటివెనమ్‌ ఇంజెక్షన్లకు కూడా పాము విషాన్ని వాడుతారు.

అయినా.. మా పాము జాతి అంటే మీకు ఇంకా అపోహలే ఉన్నాయి. మేం పగబడతామని, వెంటాడి మరీ కాటు వేస్తామని చెప్పే కథలన్నీ కట్టుకథలే. మాకు ఒకసారి తారసపడిన లేదా మమ్మల్ని హింసించిన లేదా, మాలో ఒకరిని చంపిన వ్యక్తులెవరూ మాకు గుర్తుండరు. నిజానికి మనిషిపై దాడి చేసే క్రూరమైన ప్రాములు చాలా కొన్నే ఉంటాయి. చాలా వరకూ మా దారిన మేం పోతాం.. అన్నట్టు ఉంటాయి. పొరపాటున మేం మీ ఇళ్లల్లో లేదా ఇంటి పరిసరాల్లో కనిపిస్తే మమ్మల్ని హింసించకండి. అస్సలు చంపకండి. మమ్మల్ని గమనించిన వెంటనే అటవీశాఖ సిబ్బందికి తెలియజేయండి. మమ్మల్ని సురక్షితంగా పట్టుకునే స్నేక్‌ క్యాచర్స్‌ ఉంటారు. వారికి సమాచారం ఇవ్వండి. మమ్మల్ని పట్టుకోవడంలో కొంత నేర్పు అవసరం. అది ఉంటే మీరు ప్రయత్నించండి. లేదంటే స్నేక్‌ క్యాచర్స్‌ మమ్మల్ని రక్షించి.. మా సహజ నివాస ప్రాంతాలైన అడవుల్లో వదిలేస్తారు. మీరు మమ్మల్ని సమీపిస్తున్నారంటే మాకు ఏదో ప్రమాదం ఉందని భావించే మేం బుసలు కొడతాం. కాటు వేయడానికి ప్రయత్నిస్తాం. అందుకని.. మేం కనిపించినప్పడు నిశ్శబ్దంగా ఉండండి లేదా మాకు దూరంగా వెళ్లిపోండి. మీ పిల్లలకు కూడా మా జీవన విధానం ఎలా ఉంటుంది? మాతో పర్యావరణానికి కలిగే మేలు ఏంతో తెలియజేయండి. మా గురించి అవగాహన పెంచుకునేందుకు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనండి.

చివరిగా ఒక విషయం మరోసారి చెప్పి ముగిస్తాను. మేం పర్యావరణ మిత్రులం. మమ్మల్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని రక్షిస్తే.. పర్యావరణ సమతుల్యాన్ని మీరు రక్షించినట్టే. పాముల దినోత్సవం సందర్భంగా ఒక సంకల్పం తీసుకోండి. మా మీద అపోహలు తొలగించుకోండి. మా రక్షణకు మీరు వేసే అడుగు.. మిమ్మల్ని మీరు అనేక ఉత్పాతాల నుంచి రక్షించుకునేందుకు వేసే అడుగుగా భావించండి.

ఇట్లు

భవదీయుడు

పాముల నాగరాజు

 

ఎక్కువ మంది చదివిన పాముల కథనాలు

Snakes| మీ ఇంటి దగ్గర పాములు లేవా? అయితే తస్మాత్ జాగ్రత్త!
Snakes Love explained | పాముల ప్రేమ నిజమేనా? నాగరాజు, నాగిని అనుబంధంపై మళ్లీ చర్చను రేపిన రెండు పాముల విషాదాంతం!
Snake Dens | దాదాపు లక్షన్నర పాములు ‘కలిసే’ అతిపెద్ద ‘పాముల జాత‌ర’ ఎక్కడో తెలుసా?
King Cobra | ఈ పామును చూస్తే.. మీకు రాత్రి నిద్ర కూడా పట్టదు!