Snakes Love explained | పాముల ప్రేమ నిజమేనా? నాగరాజు, నాగిని అనుబంధంపై మళ్లీ చర్చను రేపిన రెండు పాముల విషాదాంతం!

ఇప్పటిదాకా మనం విన్న పురాణాల్లోని కథల ప్రకారం పాములు అద్భుతమైన ప్రేమ జీవులు. సహచర పాముల పట్ల విధేయతతో ఉంటాయి. పాములు ఏకపత్నీవ్రతులు. ఒకదానితో మరొకటి అనుబంధం పెనవేసుకుని ఉంటాయి. అదే సమయంలో పాము పగ పట్టి, ఫలానా వాళ్లను చంపిందనే కథలూ గ్రామీణ ప్రజల్లో తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ వాస్తవాలేనా?

Snakes Love explained | పాముల ప్రేమ నిజమేనా? నాగరాజు, నాగిని అనుబంధంపై మళ్లీ చర్చను రేపిన రెండు పాముల విషాదాంతం!

Snakes Love explained | తను ప్రేమించిన నాగరాజు చనిపోతే అతడిని బతికించుకునేందుకు నాగిని చేసే ప్రయత్నాలపై బోలెడు సినిమాలు వచ్చాయి. పాములు పరిసరాలను మర్చిపోయి పెనవేసుకుంటూ నర్తించే దృశ్యాలు ఇంటర్నెట్‌ నిండా కుప్పలు కుప్పలు. తమ ప్రియుడిని చంపిన వ్యక్తులను నాగుపాములు గుర్తుపెట్టుకొని మరీ చంపుతాయనే ఊహాగానాలూ చదివాం. నాగు పాము పగ పన్నెండేళ్లు.. నాలో రగిలే పగ నూరేళ్లు అంటూ పాటలూ విన్నాం. ఇవన్నీ పాముల మనస్తత్వానికి సంబంధించిన అంశాలు. అయితే.. పాముల మధ్య ప్రేమ విషయంలో మరోసారి చర్చను రేకెత్తించింది.. మధ్యప్రదేశ్‌లోని మొరేనాలో కనిపించిన ఈ దృశ్యం. అక్కడి ఒక రహదారిపై ఒక పామును గుర్తు తెలియని వాహనం తొక్కకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో ఆ పాము చనిపోయింది. అయితే.. సమీప పొదల్లోంచి వచ్చిన మరో పాము.. నిర్జీవంగా పడి ఉన్న ఆ పాము సమీపానికి చేరుకుని.. దానిని ఆప్యాాయంగా తడిమినట్టు తచ్చాడి.. అక్కడే ఉండిపోయింది. అదేదో కాసేపు కాదు.. సుమారు 24 గంటలపాటు.. అది కూడా కనీసం కదలకుండా! స్థానికులను విస్మయానికి గురి చేసిన ఈ దృశ్యం ఆ మొబైల్‌ ఫోన్‌ నుంచి ఈ మొబైల్‌ ఫోన్‌కు చేరి… సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిపోయింది. పాత సినిమాల్లో నాగిని పాత్రను గుర్తుకు తెచ్చింది. విచిత్రం ఏమిటేంట.. మరుసటి రోజు అది కూడా చనిపోయింది! దీంతో వాటి మధ్య అమర ప్రేమ ఉందనే అభిప్రాయానికి స్థానికులు వచ్చారు. తన తోడు చనిపోవడంతో తాను సైతం చనిపోయిందని అనుకున్నారు. దొరికింది కదా సందు అనుకున్న కొంతమందైతే సతీసహగమనం చేసిదంటూ కథలు ప్రచారం చేసుకున్నారు. అయితే.. ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జంతు జాలాల మధ్య నిజంగానే ఇటువంటివి చోటు చేసుకుంటాయా? పురాణాల్లో, వాటి ఆధారంగా సినిమాల్లో చూపించిన విధంగా నాగరాజుకు, నాగినికి మధ్య అనుబంధ బాంధవ్యాలు ఉంటాయా? పుక్కిటి పురాణాలను పక్కనపెట్టి వాస్తవానికి వద్దాం. కొంత లోతుల్లోకి వెళ్లి.. శాస్త్రజ్ఞులు ఏం చెబుతున్నారో విందాం.

అది ఎంత భయపెట్టినా.. మన దేశ సంస్కృతి సంప్రదాయాల్లో పాముకు పవిత్రమైన స్థానం ఉంది. పాములు పాలు తాగవని శాస్త్రవేత్తలు ఘోషిస్తున్నా.. వాటి పుట్టల్లో పాలు పోసేంత భక్తి. నాగుపాములనే తీసుకుంటే.. అవి శివుడికి అత్యంత సన్నిహితంగా మెలిగే జీవి. నిత్యం శివుడి మెడలోనే ఆభరణం తరహాలో చుట్టుకొని ఉంటుంది. ఇప్పటిదాకా మనం విన్న పురాణాల్లోని కథల ప్రకారం పాములు అద్భుతమైన ప్రేమ జీవులు. సహచర పాముల పట్ల విధేయతతో ఉంటాయి. పాములు ఏకపత్నీవ్రతులు. ఒకదానితో మరొకటి అనుబంధం పెనవేసుకుని ఉంటాయి. అదే సమయంలో పాము పగ పట్టి, ఫలానా వాళ్లను చంపిందనే కథలూ గ్రామీణ ప్రజల్లో తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ వాస్తవాలేనా? నిజానికి శాస్త్రీయ విజ్ఞానం అందుకు భిన్నమైన సమాధానం చెబుతున్నది. క్షీరజాలతో పోల్చితే పాములు, ప్రత్యేకించి కోబ్రాలు ఎలాంటి భావోద్వేగమైన సంబంధాలను తనతో జతకట్టిన పాముతో కలిగి ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ.. 24 గంటలపాటు చచ్చిపోయిన పాము వద్ద మరో పాము ఉన్నది చూసి, మరుసటిరోజు అది కూడా చనిపోయి ఉంటే.. అలాగంటే ఎలా అనేవాళ్లూ ఉంటారు.

ప్రకృతిలో పాములు ఏకాంతవాసులు. అవి తమ పుట్టలనుంచి బయటకు వచ్చేది కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే. ఆ వెంటనే అవి విడిపోయి వేటి దారిన అవి వెళ్లిపోతాయి. తనతో జత కట్టిన పామును మరో పాము గుర్తిస్తుందనేందుకు ఇంత వరకూ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లభించలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాటి సంయోగం కేవలం రసాయనిక సంకేతాలు, ఫెరోమోన్స్‌ (పాముల్లో విడుదలయ్యే ఒక రకమైన వాసనలు) ఆధారంగా మరో పాముతో జతకడతాయే తప్పించి.. గుర్తు పెట్టుకుని జత కట్టవని చెబుతున్నారు. ఈ జీవ ప్రపంచంలో హంసలు, కొన్ని జాతుల తోడేళ్లు వంటి కొన్ని జీవులు మాత్రమే ఏకపత్నీ వ్రతులుగా లేదా.. ఒకే భాగస్వామితో కలిసి ఉండటం అనేది కొనసాగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ.. పాములు ఈ కేటగిరీలోకి రావని స్పష్టం చేస్తున్నారు. మరైతే చనిపోయిన పాము పక్కన వేరే పాము ఎందుji ఉందని అడగొచ్చు. దానికీ నిపుణులు స్పష్టమైన సమాధానమే చెబుతున్నారు. ఆడ పాము మగ పాము చనిపోయిందని తెలియక.. దాని నుంచి విడుదలయ్యే వాసన కారణంగానే అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితుల కారణంగా అవి, మగతలో లేదా కదల్లేని స్థితిలో ఉండి ఉండొచ్చని అంటున్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కూడా అవి అక్కడ ఉండేందుకు అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు. మరోసటి రోజు ఆడ పాము చనిపోయిందంటే.. అది కేవలం యాదృచ్ఛికమేనని.. డీహైడ్రేషన్‌, నిస్సత్తువ, గాయం లేదా, చనిపోయి కుళ్లిపోయిన పామును తినే క్రమంలో విష ప్రభావానికి గురై చనిపోయి ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని వివరిస్తున్నారు.

పాముల ప్రపంచంలో మినహాయింపులేమైనా ఉన్నాయా? అంటే కొన్ని అరుదైన సందర్భాల్లో ఉంటాయని జీవశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఉదాహరణకు కింగ్‌ కోబ్రాను తీసుకుంటే.. ఈ జాతిలో కొన్ని ఆడ, మగ పాములు సుదీర్ఘ కాలం కలిసి ఉంటాయి. ప్రత్యేకించి గుడ్లు పొదిగే సమయంలో ఇది ఉంటుంది. అది కూడా గుడ్లను పొదిగే పామును, గుడ్లను రక్షించే ఉద్దేశంలోనే తప్ప.. వాటి మధ్య అనుబంధంతో కాదు. కింగ్‌ కోబ్రాలలో కూడా జత కట్టడం అనేది కాలాన్ని బట్టి ఉంటుంది కానీ.. ఒకే జంట పలుమార్లు జత కట్టవు. అవి జీవితకాలం కలిసి ఉంటూ జత కట్టడం లేదా చనిపోతే బాధపడటం వంటివి ఉండవు. అంతేకాదు.. పాములు అనేక ఆడ పాములతో అనేక సార్లు జతకడుతూ ఉంటాయి. ఆడ పాములు కూడా ఒక బ్రీడింగ్‌ సీజన్‌లో అనేక మగపాములతో జతకడతాయి. ఆడపాము వేర్వేరు మగ పాముల ద్వారా గుడ్లు కలిగి ఉండటం ఇందుకు నిదర్శనంగా జీవ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీన్ని బట్టి, నాగరాజు, నాగిని కథలు కేవలం కల్పితాలేనని తేల్చి చెబుతున్నారు. ప్రకృతితో పెనవేసుకున్న మానవ జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు.. ఒక్కోసారి మూఢనమ్మకాలకు దారి తీస్తుంటాయని చెబుతున్నారు. ప్రత్యేకించి భారతదేశం లాంటి దేశాల్లో ఇటువంటి నమ్మకాలు అధికంగానే ఉన్నాయి. అందుకే మనం పామును పూజిస్తాం. ఇది కొన్ని తరాలుగా కొనసాగుతూనే ఉన్నది. మనం వింటున్న పౌరాణిక కథలు.. మనం చూస్తున్న సినిమాలు మనల్ని ఇంకా అదే చట్రంలో కొనసాగిస్తున్నాయని హేతువాదులు అంటున్నారు. మోరేనాలో పాముల విషాదాంతం చూడటానికి ఊహించుకోవడానికి అబ్బుంగానే కనిపించవచ్చు. కానీ.. అవి కేవలం నమ్మకాలేనని, శాస్త్ర విజ్ఞానాన్ని సవాలు చేయలేవని చెబుతున్నారు. మొరేనాలో చోటు చేసుకున్నది ఒక విషాదమే కానీ.. ప్రేమ, అనుబంధం, తొక్క తోటకూర అలాంటివి ఏమీ ఉండవని తేల్చిచెబుతున్నారు.

పాములకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర కథనాలు..

Protection from Snakes | పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. ఈ మొక్క‌లు పెంచండి మ‌రి..
Snake Bite First Aid | పాము కాటేస్తే చేయాల్సినదేంటి? చేయకూడనిదేంటి?
Snakes: పాములు ఏ సమయంలో నిద్రిస్తాయి.. ఏ సమయంలో యాక్టివ్ గా ఉంటాయి.. ?
King Cobra | ఈ పామును చూస్తే.. మీకు రాత్రి నిద్ర కూడా పట్టదు!