viral video | పాము విషాన్ని మనుషులు నేరుగా తాగవచ్చునా? గ్రీన్ మాంబా విషాన్ని తీసే ప్రక్రియ చూశారా?
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన సర్పాల్లో గ్రీన్ మాంబా ఒకటి. ఒక నిపుణుడు దాని విషాన్ని ఒక గాజు గ్లాసులోకి తీస్తున్న వీడియో.. వైరల్ మారింది.

Extracting Venom from Green Mamba | పాములు కాటు వేస్తే.. వాటి కోరల్లోంచి విషం.. ఆ కాటు పడిన మనిషి లేదా జంతువు శరీరంలోకి.. అటు పిమ్మట మొత్తం రక్త ప్రసరణ వ్యవస్థల్లోకి ప్రవేశించి ప్రాణాలు తీసేస్తుంది. కానీ.. ఇదే విషం అనేక ప్రాణ రక్షణ ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఈ విషాన్ని తీసే ప్రక్రియ అత్యంత క్లిష్టమైనది. ప్రమాదకరమైనది కూడా. అత్యంత నైపుణ్యం, అర్హత ఉన్నవారు మాత్రమే ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. బ్రేవ్ వైల్డర్‌నెస్ పేరిట ఒక యూట్యూబ్ చానెల్ ఉంది. దానిని కయోట్ పీటర్సన్ అనే నిపుణుడు నిర్వహిస్తున్నాడు. ఆయన చానల్‌కు 2.2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారంటే ఆయన ప్రఖ్యాతి ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న క్లిప్‌లో ఆయన అత్యంత ప్రమాదకరమైన గ్రీన్ మాంబా నుంచి ఒక నిపుణుడు విషాన్ని తీసే ప్రక్రియను చూపించారు. మాంబా నుంచి ఎంత విషం సేకరించవచ్చునో కయోట్ ఒక షార్ట్ వీడియోలో చూపించారు. ఆ విషం సేకరించినప్పుడు ఏదో ఒకటి రెండు చుక్కలు కారడం కాకుండా.. చిమ్మినట్టు విషం బయటకు రావడం కనిపిస్తుంది.
అత్యంత ప్రమాదకర విషం
బ్లాక్ మాంబా (Dendroaspis polylepis) అనేది ఆఫ్రికాలోనే అత్యంత పొడవైన, వేగవంతమైన విషపూరిత సర్పం. ఇది సుమారు 12 అడుగుల వరకూ పెరుగుతుంది. గంటకు పది మైళ్ల వేగంతో దూసుకుపోతుంది. సవన్నా భూములలోనూ, కొండ ప్రాంతాల్లోనూ ఉంటుంది. తనకు ఏదైనా ముప్పు వాటిల్లనుందని భయపడితే.. పైకి లేచి.. నోటితో గట్టిగా బుస కొడుతుంది. గ్రీన్ మాంబాలు చిన్నగా, సన్నగా ఉంటాయి. ఎక్కువగా చెట్లపై నివసిస్తాయి. కాంతివంతమైన వాటి పొలుసులు వాటిని చెట్లలో కనిపించకుండా దాచిపెడతాయి. అవి పక్షులను వేటాడుతాయి. చిన్నచిన్న క్షీరదాలను కూడా తింటుంటాయి. దాడి చేయడానికంటే దాక్కునేందుకే ప్రాధాన్యం ఇస్తాయి. ఈ రెండు రకాల మాంబాలు కూడా చాలా విషపూరితమైనవి. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పాల్లో ఒకటిగా ఉన్నాయి. ఇందులో బ్లాక్ మాంబా విషం అత్యంత వేగంగా పనిచేస్తుంది. అందులోని న్యూరోటాక్సిన్ మెదడు, కండరాల మధ్య సిగ్నల్స్‌ను బ్లాక్ చేసి.. మొత్తం నాడీ వ్యవస్థను పనిచేయకుండా నిరోధిస్తాయి. ఫలితంగా పక్షవాతం, శ్వాసకోస సమస్య ఎదురవుతుంది. అరగంట నుంచి గంట వ్యవధిలో తగిన చికిత్స అందకపోతే ప్రాణం పోతుంది.
విషాన్ని ఎలా సేకరిస్తారు?
విషానికి విరుగుడు ఇంజెక్షన్లు, ఔషధాలు తయారు చేయడంలో పాముల విషం అత్యంత కీలకమైనది. ఆ విషాన్ని అత్యంత జాగ్రత్తగా సేకరిస్తారు. తర్వాత దానిని యాంటివెనమ్ ఉత్పత్తి, పరిశోధనల్లో వాడుతారు. ప్రత్యేకించి యాంటివెనమ్ ఉత్పత్తికి ఉద్దేశిస్తారు. పాము కాట్ల నుంచి ప్రజలను బతికించే ఔషధాలు తయారు చేస్తారు. అందుకోసం సేకరించిన విషాన్ని గుర్రాలు, గొర్రెలు వంటి జంతువుల్లోకి చిన్నమొత్తంలో పంపిస్తారు. అవి యాంటిబాడీస్‌ను (ప్రతిరక్షకాలు) తయారు చేసుకున్న తర్వాత వాటిని తీసి, శుభ్రపరిచి యాంటివెనమ్ సీరంగా మార్చుతారు. ఈ ప్రక్రియను శిక్షణ పొందిన హ్యాండ్లర్స్.. నిర్దిష్ట ప్రయోగశాలల్లో పూర్తి రక్షణ నడుమ నిర్వహిస్తారు. తొలుత విషం సేకరించాల్సిన పామును హ్యాండ్లర్.. హుక్ లేదా టాంగ్స్ సహాయంతో నియంత్రించి.. దానిని తల వద్ద పట్టుకుంటాడు. విషాన్ని సేకరించేందుకు సిద్ధం చేసిన బాటిల్‌పై పలుచటి పొర కప్పి ఉంటుంది. దానిపై పాముతో కాటు వేయిస్తాడు. కోరలు ఆ పొరను చీల్చుకుని లోనికి వెళ్లగానే.. వాటి నుంచి ఆటోమేటిక్‌గా విషం ఆ బాటిల్‌లోకి చేరుతుంది. తదుపరి పరిశోధనలు, అవసరాల కోసం ఆ విషాన్ని ఫ్రీజ్ చేసి భద్రపరుస్తారు.
పాము విషాన్ని నేరుగా తాగవచ్చా?
పాము విషం రక్తంలోకి చేరితే ప్రమాదం కానీ.. కడుపులోకి వెళితే ప్రమాదం లేదని చాలా మంది అనుకుంటారు. దీనిలో కొంతే వాస్తవం ఉంది కానీ.. అత్యంత ప్రమాదకరమే. నిజానికి కడుపులోకి వెళ్లిన విషాన్ని తటస్తం చేసే అవకాశం కొంత మేరకే ఉంటుంది. ఈ లోపు కడుపులో లేదా ఇతర భాగాల్లో ఏదైనా చిన్నపాటి ఇన్‌ఫెక్షన్, లేదా గాయం లేదా కురుపు ఉంటే.. విషం నేరుగా రక్తంలోకి వెళ్లిపోతుంది. మనం జానపద కథల్లో విష కన్యల గురించి చదివే ఉంటాం. కొంచెం కొంచెం చిన్నప్పటి నుంచే విషం ఇచ్చి.. వారిని విషకన్యలుగా మార్చామని వింటుంటాం. అలాంటి వాటిని నమ్మి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ప్రాణాలు గాల్లోకి వెళ్లిపోవడం ఖాయమని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.