High Speed Camera Snake Bites | స్లోమోషన్‌లో పాము కాటు వీడియోలు.. చూస్తే గుండెలు గుభేలే!

పాము కాటు వీడియోలు చూసి ఉంటారు కానీ.. సెకనుకు వెయ్యి ఫ్రేములతో చిత్రీకరించిన పాము కాటు వీడియోలను ఎప్పుడైనా చూశారా? పాము కాట్లపై అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారు.

  • By: TAAZ |    trending |    Published on : Oct 24, 2025 4:44 PM IST
High Speed Camera Snake Bites | స్లోమోషన్‌లో పాము కాటు వీడియోలు.. చూస్తే గుండెలు గుభేలే!

High Speed Camera Snake Bites | సాధారణ వేగంతో కదిలే చాలా వీడియోలను మనం చూసి ఉంటాం. కానీ.. వాటిలో ఉన్నవి ఎలా కదులుతున్నదీ గమనించలేం. కానీ.. స్లోమోషన్‌ కెమెరాలు.. అందునా హైక్వాలిటీ కెమెరాలు వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒక పరిణామం ఎలా చోటు చేసుకుంటున్నది అత్యంత సూక్షస్థాయిలో గమనించే అవకాశం వచ్చింది. ఈ స్లోమోషన్‌ కెమెరాలతో అనేక మంది అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటారు. తాజాగా పాములు కాటు వేసే సమయంలో ఎలా ఉంటుందనే విషయాన్ని స్లోమోషన్‌ కెమెరాను వాడి ఆసక్తి రేపారు శాస్త్రవేత్తలు. వాస్తవానికి పాము కాటు సెకనులో వందో వంతులో అయిపోతుంది. కానీ.. హైస్పీడ్‌ కెమెరాను ఉపయోగించి.. ఒక్కో సెకనుకు వెయ్యి ఫ్రేములు చిత్రీకరించేలా సెట్‌ చేసి.. పాము కాటు వేసే విధానాన్ని రికార్డ్‌ చేశాడు. దీనికి సంబంధించిన అధ్యయనం ఎక్స్‌పెరిమెంటల్‌ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది.

ఈ అధ్యయనం మూడు రకాల సర్పాలు – వైపర్స్‌, ఎలాపిడ్స్‌, కొలుబ్రైడ్స్‌కు చెందిన 36 జాతులు ఎలా కాటు వేస్తాయనే అంశాన్ని పరిశీలించింది. కాటు వేసే సమయాన్ని మరింత కూలంకుషంగా గమనించడం ద్వారా కాటు వేసే సమయంలో పాములు ఎలా ప్రవర్తిస్తాయనే అంశాన్ని తెలుసుకునేందుకు ఈ అధ్యయనం నిర్వహించారు. నిజానికి హైస్పీడ్‌ కెమెరాలను ఉపయోగించి పాము కాట్లను అధ్యయనం చేయడం 1950వ దశకంలోనే మొదలైందని సైన్స్‌ అలర్ట్‌ కోసం రాసిన ఆర్టికల్‌లో ఈ అధ్యయనం సహ రచయిత ప్రొఫెసర్‌ అలిస్టైయిర్‌ ఎవాన్స్‌ వివరించారు. కానీ.. అప్పటితో పోల్చితే సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి అయింది. తాజా అధ్యయనం గతంలో ఎన్నడూ లేనంత అత్యంత ఎక్కువ రిజొల్యూషన్‌ కలిగిన ఫుటేజ్‌ ఆధారంగా సాగింది. ఇలాంటి అధ్యయనం గతంలో ఎన్నడూ నిర్వహించలేదు.

మెడికల్‌ జెల్‌ వంటి పదార్థంతో తయారు చేసిన ఒక మెత్తటి సిలిండర్‌ ఆకారాన్ని పాము కాట్లకు ఉపయోగించారు. ఇది క్షీరదాల శరీర కణాల ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. పాములు ఎంత వేగంగా కదులుతాయో, వాటి నోరు ఎలా తెరుచుకుంటుందో, కోరలు ఎలా కాటు వేసే శరీరంలోకి దిగుతాయో కచ్చితంగా అంచనా వేయడానికి పరిశోధకులు ఈ వీడియోలను త్రీడీలోకి మార్చారు.

వీటిలో వైపర్స్‌ అత్యంత వేగంగా కాటు వేసినట్టు గుర్తించారు. చుట్టచుట్టుకుని ఉన్న వైపర్‌, వెస్ట్రన్‌ డైమండ్‌బ్యాక్‌ రాటిల్‌స్నేక్‌లు వంద మిల్లీ సెకన్లలోనే కాటు వేయడం గమనించారు. ఇది పాముకాట్లకు గురయ్యే క్షీరదాల వేగానికంటే ఎక్కువ. వైపర్స్‌లో పొడవాటి కోరలు విచ్చుకోవడం కనిపించింది. ‘సాధారణంగా పాములు కాటు వేయడానికి ముందు వాటి కోరలు బయటకు విచ్చుకుంటాయి’ అని మోనాష్‌ యూనివర్సిటీకి చెందిన జూవాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ ఎవాన్స్‌ వివరించారు. కాటు వేయాల్సిన జీవిని కాంటాక్ట్‌ అవ్వగానే చాలా వైపర్స్‌ తమ కాటును దానికి అనుగుణంగా అడ్జస్ట్‌ చేసుకుంటాయని తెలిపారు. విషాన్ని వెదజల్లేందుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించి.. కోరలను విచ్చుకునేలా చేసుకుంటాయని ఆయన వివరించారు. పొరపాటున కోరలు దెబ్బతిన్నా.. వాటి స్థానంలో మళ్లీ కొత్త కోరలను అవి మొలిపించుకుంటాయని ఎవాన్స్‌ తెలిపారు. అది పాముల్లో జీవితాంతం జరిగే ప్రక్రియ అని వివరించారు.

విషపూరిత పాములు ప్రమాదకరమైనవే అయినప్పటికీ.. సహజంగానే తమ రక్షణను తాము చూసుకునే జీవులని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులు వాటిని పట్టించుకోకపోతే అవి కూడా మనుషులను పట్టించుకోవని, వాటికి ప్రమాదం కలుతుందని భయపడినప్పుడే అవి దాడి చేస్తాయని చెబుతున్నారు.

ఇవే ఆ వీడియోలు..