Raghava Constructions | 111 జీవో పరిధిలో పొంగులేటి అక్రమ మైనింగ్.. వెంటనే బర్తరఫ్ చేయాలన్న బీఆర్ఎస్ నేత ప్రవీణ్
ట్రిపుల్ 1 జీవో పరిధిలో ఉన్న కొత్వాల్‌గూడలో మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ చేస్తున్నారని బీఆరెస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తాము ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వస్తున్నామని తెలిసి, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అనే పేరుపై రంగు పూశారని మండిపడ్డారు. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
విధాత, హైదరాబాద్:
Raghava Constructions | రాజేంద్రనగర్ నియోజకవర్గం కొత్వాల్‌గూడ 111 జీవో పరిధిలోకి వస్తుందని, ఈ ప్రాంతంలో కనీసం ఇండ్లు కట్టడానికి కూడా అనుమతించని అధికారులు ఇంత పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతుంటే ఏం చేస్తున్నారని బీఆరెస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడుగడునా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఓఆర్ఆర్‌కు పక్కనే మంత్రి పొంగులేటికి సంబంధిచిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో క్రషర్స్ పెట్టి వేల టన్నుల కాంక్రీట్ తరలిస్తూ అక్రమ మైనింగ్‌కు పాల్పడితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. స్థానిక తహశీల్దార్, మైనింగ్ అధికారులు, పోలీసులు, గ్రామ పంచాయితీ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారని నిలదీశారు. అక్రమ మైనింగ్ వెంటనే ఆపాలని, అధికారులు స్పందించి ఇక్కడి మెషినరీని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి బుధవారం కొత్వాల్ గూడలో పర్యటించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఆకాశ హర్మ్యాలకు ఇక్కడి నుంచే కాంక్రీట్ సరఫరా చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను నేల మట్టం చేసి, ఆ ప్రాంతాన్ని గాజా లా మార్చారన్నారు. హైదరాబాద్‌లో అక్రమ మైనింగ్ చేస్తుంటే ప్రశ్నించని, అడ్డుకోలేని మీ పోలీసులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు పెయిడ్ బ్యాచ్ కాదా అని మండిపడ్డారు.
2024 సెప్టెంబర్‌లో పొంగులేటి నివాసం, కార్యాలయాలల్లో ఈడీ సోదాలు జరిగాయని, కానీ.. ఇప్పటికీ ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. కొడంగల్–నారాయణపేట ప్రాజెక్టు నుండి సమ్మక్క సారలమ్మ దేవాలయ నిర్మాణం వరకు ఏ కాంట్రాక్టు కూడా వదలడం లేదన్నారు. కొత్వాల్ గూడలో అక్రమ మైనింగ్ జరుగుతుందని తెలిసి మీడియా వస్తే, ఐడీ కార్డులు ఏవంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వట్టినాగులపల్లిలో రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిన పొంగులేటి కుమారుడిపై కేసు నమోదు చేసిన పోలీసు ఇన్‌స్పెక్టర్ హబీబుల్లాను వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయించారని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని తెలిసి పనులను నిలిపివేసి, రాత్రికి రాత్రే కంటైనర్లకు ఉన్న రాఘవ కన్‌స్ట్రక్షన్స్ పేరుకు నీలి రంగు పేయింట్ వేసి ప్రజల కళ్లు కప్పే ప్రయత్నం చేశారన్నారు. అక్రమ క్రషింగ్‌ను ప్రోత్సహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram