టి20 ప్రపంచకప్​ సెమీస్​: మళ్లీ చెలరేగిన సంజూ – ఇంగ్లండ్​పై భారత్​ 253 పరుగుల భారీ స్కోరు

టి20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లో సంజూ శాంసన్ దూకుడు ఇన్నింగ్స్‌తో భారత్ 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా ఫైనల్ దిశగా అడుగులు వేస్తోంది.

  • By: ADHARVA |    sports |    Published on : Mar 05, 2026 9:20 PM IST
టి20 ప్రపంచకప్​ సెమీస్​: మళ్లీ చెలరేగిన సంజూ – ఇంగ్లండ్​పై భారత్​ 253 పరుగుల భారీ స్కోరు వాంఖెడేలో మెరుపు ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడిన సంజూ శాంసన్.

ముంబై వాంఖడేలో జరుగుతున్న టి20 ప్రపంచకప్​ 2వ సెమీస్​లో భారత్​ – ఇంగ్లండ్​ తలపడుతున్నాయి.  టాస్​ గెలిచిన ఇంగ్లీష్​ కెప్టెన్​ హ్యరీ బ్రూక్​ మరో ఆలోచన లేకుండా బౌలింగ్​ ఎంచుకున్నాడు. కానీ, అది ఎంత భారీ తప్పిదమో తర్వాత అర్థమైంది. భారత్​ ఏకంగా 253 పరుగులు చేసి, బ్రూక్​కు తలనొప్పి తెచ్చిపెట్టారు.

ముంబైలో పరుగుల సునామీ : దంచికొట్టిన భారత బ్యాటర్లు

కాగా, టాస్​ ఓడిపోయి, బ్యాటింగ్​కు దిగిన భారత్​కు ఓపెనింగ్​ మళ్లీ కలిసిరాలేదు. అభిషేక్​ శర్మ అలవాటుగా తక్కువ స్కోరు(9)కే మళ్లీ పెవిలియన్​ బాట పట్టాడు. కానీ, సంజూ శాంసన్​ గత మ్యాచ్​లాగే చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు. ఇషాన్​ కిషన్​తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కిషన్​ కూడా దూకుడుగా ఆడి, అదే క్రమంలో అవుటయ్యాడు. కిషన్​ 18 బంతుల్లో 2 సిక్స్​లు, 4 ఫోర్లతో 39 పరుగులు చేసాడు. తరువాత ఆశ్చర్యకరంగా బ్యాటింగ్​ ఆర్డర్​లో ప్రమోటైన శివం దూబే శివమెత్తాడు. 4 సిక్స్​లు, ఒక్క ఫోర్​తో కేవలం 25 బంతుల్లోనే 43 పరుగులు చేసి దురదృష్టవశాత్తు లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్​ అయ్యాడు. అప్పుడొచ్చిన కెప్టెన్​ సూర్యకుమార్​ యాదవ్​ ఒక్క సిక్స్​తో 11 పరుగులు చేసి డగౌట్​కు చేరుకోగా, హార్థిక్​ పాండ్యా(27)  తిలక్​వర్మ(21) మెరుపు మెరిపించి వేగంగా పరుగులు రాబట్టారు. స్కోరుబోర్డును పరుగులెత్తించిన వీరిద్దరి ధాటికి భారత్​ 250 పరుగుల మార్క్​ను దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్​ ముందుంచింది. కాగా, ఈ మ్యాచ్​లో భారత్​ మొత్తంగా 19 సిక్స్​లు బాదడం ఒక విశేషమే కాక, టి20 ప్రపంచకప్​ నాకౌట్​ మ్యాచ్​లో అత్యధిక స్కోరు సాధించింది.

సంజూ శాంసన్​ ఉరుములు – మెరుపులు

Sanju Samson and Ishan Kishan partnership during India vs England T20 World Cup 2026 semifinal at Wankhede Stadium

వాంఖెడేలో సెమీస్ మ్యాచ్‌లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ దూకుడు బ్యాటింగ్‌తో భారత్‌కు బలమైన ఆరంభం ఇచ్చారు.

మళ్లీ చెప్పుకోవాల్సింది సంజూశాంసన్​ గురించే. ఏమాత్రం బెరుకు లేకుండా ఆరంభం నుంచే దూ‌‌కుడుగా ఆడిన సంజూ, వచ్చిన బ్యాటర్లందరితో పటిష్టమైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. 42 బంతుల్లో 7 భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 89 పరుగులు చేసిన సంజూ, జట్టు పరుగులు 13.1 ఓవర్లలో 160 వద్ద జాక్స్​ బౌలింగ్​లో ఫిల్​ సాల్ట్​ చేతికి చిక్కాడు. కిషన్​తో కలిసి 97, దూబేతో 43 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అప్పటికే భారీ స్కోరు దిశగా పయనిస్తున్న భారత్​ను మిగతా బ్యాటర్లు తన సమయోచిత ఆటతీరుతో కొండంత స్కోరును సాధించారు. అయితే సంజూ 17 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్​ను నేలపాలు చేసిన ఇంగ్లీష్​ కెప్టెన్​ హ్యారీ బ్రూక్​ ఆ తర్వాత ఇన్నింగ్స్​ అంతా చింతించాల్సివచ్చింది.

ఇంగ్లండ్​ బౌలర్లలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా భారత బ్యాటర్లు దంచి వదిలిపెట్టారు. జోఫ్రా ఆర్చర్​, సామ్​ కరన్​ లాంటి బౌలర్లు కూడా ఇండియా బ్యాట్లకు బలై, వారి ఎకానమీని పాడు చేసుకున్నారు. స్పిన్నర్లైన అదిల్​ రషీద్​, విల్​ జాక్స్​ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నా, పరుగులు మాత్రం భారీగా ఇచ్చుకున్నారు. ఆర్చర్​కు ఒక వికెట్​ దక్కింది.