Meta Ray-Ban AI Glasses | వామ్మో… ఏఐ గ్లాసెస్‌తో ఇన్ని డేంజర్లా? మీ బెడ్‌రూమ్‌ యాక్టివిటీ కూడా చూసేస్తారు!

ఏఐ గ్లాసెస్‌ పెట్టుకుని మీరు చూసే దృశ్యాలను మీకు తెలియకుండా వేరే దేశంలో వేరొకరు గమనిస్తుంటారని మీకు తెలుసా? అవి ఏ పార్కులో, పర్వతాలో అయితే సరే.. కానీ.. మీ ఇంట్లో... మీ వ్యక్తిగత జీవితమైతే?

Meta Ray-Ban AI Glasses | వామ్మో… ఏఐ గ్లాసెస్‌తో ఇన్ని డేంజర్లా? మీ బెడ్‌రూమ్‌ యాక్టివిటీ కూడా చూసేస్తారు!

Meta Ray-Ban AI Glasses | మన జీవితాల్లోకి వేగంగా దూసుకొస్తున్న స్మార్ట్‌ టెక్నాలజీ.. అంతే వేగంతో మన బతుకులను బజారు పాలు చేస్తున్నదనేందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.. ఏఐ గ్లాసెస్‌! మీరు ఏఐ కళ్ల జోడు పెట్టుకొని కొందరిని చూస్తూ ఉంటారు. మీ వెనుక ఎవరూ లేరు. మీ చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. నేనొక్కడినే చూస్తున్నాను.. అనుకోవచ్చు! కానీ.. కాదు. మీరు ఒంటరిగా లేరు.. మీరు చూసే దృశ్యాలను మరో వ్యక్తి కూడా చూస్తున్నాడు. మీరు చూసే దృశ్యాలు మరో దేశంలో రికార్డు అవుతూ ఉంటాయి! మీ కళ్లు దేన్ని చూస్తే వేరే వ్యక్తి కూడా అవే చూస్తాడు. అది మీ బెడ్‌రూమ్‌ అయినా.. బాత్‌రూమ్‌ అయినా కూడా! నమ్మలేక పోతున్నారా? కృత్రిమ మేధను జోడించి మెటా తీసుకొచ్చిన మెటా రేబాన్‌ కళ్లజోళ్లు… మీరు చూసే దృశ్యాలను ఆటోమేటిక్‌గా మీకు తెలియని వ్యక్తులు కూడా చూసే అవకాశం ఉంది!

ఈ మెటా రేబాన్‌ గ్లాసెస్‌ను వినియోగించడం చాలా సులభం. మనం ఏదైనా దృశ్యాన్ని చూసే సమయంలో ‘“Hey Meta” అని పలికి.. దానిని విశ్లేషించమని అడిగితే.. ఆ వీడియో మెటా సర్వర్లకు వెళిపోతుంది. అక్కడి నుంచి సామాకు చేరుతుంది. ఇది కెన్యాలోని నైరోబీలోని సబ్‌ కాంట్రాక్ట్‌ సంస్థ. ఇక్కడి వర్కర్లు సదరు గ్లాసెస్‌ ధరించిన వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా లేదా యాదృచ్ఛికంగా ఏమైతే రికార్డు చేశారో ఆ వీడియోలన్నీ అక్కడ చూస్తారు. వాటిని మ్యాన్యువల్‌గా లేబుల్ చేస్తారు.

కెన్యాలోని మెటా కంపెనీ వర్కర్లను మెటా రేబాన్‌ గ్లాసెస్‌ ద్వారా రికార్డయిన విజువల్స్‌ను విశ్లేషించాలని చెబితే.. ఆ వర్కర్లే ఆ దృశ్యాలు చూసి ఇబ్బంది పడ్డారట! ఈ మేరకు ఒక పరిశోధనాత్మక కథనాన్ని స్వీడన్‌కు చెందిన స్వెన్స్‌కా డాగ్బ్లాడెట్‌, గొటెన్‌బోర్గ్స్‌ పోస్టెన్‌ పత్రికలు పబ్లిష్‌ చేశాయి. కెన్యాలో మెటా వర్కర్లు ఎనలైజ్‌ చేసిన వీడియోల్లో.. గ్లాసెస్‌ ధరించినవారు చూసిన ఇంటిమేట్‌ సన్నివేశాలు.. ఆఖరుకు డిస్ట్రబింగ్‌ దృశ్యాలు సైతం ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. ఆ గ్లాసెస్‌ పెట్టుకొని మొబైల్‌లో బ్యాంకు లావాదేవీలు నిర్వహించినప్పుడు యూజర్‌ నేమ్స్‌, పాస్‌వర్డ్స్‌ కూడా మరొకరి కళ్లముందే కనిపిస్తున్నాయి. ఇదంతా డాటా లేబులింగ్‌ అని పిలిచే ఒక ప్రక్రియలో భాగం. దీన్ని ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తారు. మొదటగా వ్యక్తులు సమీక్షించి, వ్యాఖ్యానించిన ఫుటేజ్‌తో ఏఐ మోడళ్లకు శిక్షణనిస్తారు. తద్వారా ఏఐ తాను ఏమేం ‘చూస్తున్నదో’ అర్థం చేసుకుంటుంది.

చాలా దృశ్యాలు గ్లాసెస్‌ పెట్టుకున్న వ్యక్తులకు అవి రికార్డవుతున్నాయని కూడా తెలియదని కెన్యా వర్కర్లు చెబుతున్నారు. ఈ గ్రూప్‌.. సామా (sama) అనే సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. ఇదే సంస్థ మెటాకు కాంట్రాక్టర్‌గా ఉన్నది. ప్రస్తుతం ఈ సంస్థపై కంటెంట్‌ మాడరేటర్ల తరఫున క్లాస్‌ యాక్షన్‌ కేసు కూడా నడుస్తోంది. సరైన పని పరిస్థితులు లేకుండానే తమతో పనిచేయించారని, మానసికంగా తీవ్ర ప్రభావం కలిగించే హింసాత్మక, దారుణ కంటెంట్‌ను తాము తరచూ పరిశీలించాల్సి వచ్చిందని వారు ఆరోపించారు. ఓపెన్ ఏఐ కంటెంట్‌లో గ్రాఫిక్‌ కంటెంట్‌ను లేబుల్‌ చేసేందుకు 2023లో ఇదే కంపెనీ కెన్యన్‌ వర్కర్లకు గంటకు 2 డాలర్లు చెల్లించేది. కానీ.. ఓపెన్‌ ఏఐ దగ్గర మాత్రం 12.50 డాలర్లు బిల్‌ చేసేది. ఈ బాగోతాన్ని అప్పట్లో టైమ్‌ బహిర్గతం చేసింది. ఇది తమ శ్రమను దోపిడీ చేయడమేనని సామా స్టాఫ్‌ ఆరోపించారు. ‘వేరొకరి ఆంతరంగిక జీవితాన్ని చూస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే సమయంలో కేవలం విధులు నిర్వర్తిస్తున్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. దాన్ని ప్రశ్నించలేం. ప్రశ్నించినట్టయితే.. ఉద్యోగం ఊడిపోతుంది’ అని ఒక ఉద్యోగి చెప్పారని ఈ కథనాన్ని ప్రచురించిన మీడియా సంస్థలు తెలిపాయి. ‘మేం అన్నీ చూస్తాం.. ఇంట్లో లివింగ్‌ రూమ్స్‌ మొదలుకుని.. న@గ్నశరీరాల దాకా..’ సామా వర్కర్లు చెబుతున్నారు.

తన ఏఐ సర్వీసులతో యూజర్స్‌ నిర్వహించే ఇంటరాక్షన్స్‌.. మానవ సమీక్ష కోసం పంపుతామని మెటా టెర్మ్స్ ఆఫ్‌ సర్వీస్‌లో పొందుపర్చి ఉంటుంది. అంటే.. ఏఐ వ్యవస్థను మరింత మెరుగుపర్చే క్రమంలో కొన్ని వీడియోలు, డాటా మనుషులు పరిశీలించే ప్రక్రియలోకి వెళతాయన్నమాట.

మెటా రేబాన్‌ స్మార్ట్స్‌ గ్లాసెస్‌ను 2023లో లాంచ్‌ చేశారు. ఆ సమయంలో దాని ఫొటో, వీడియో రికార్డింగ్‌ సామర్థ్యాలు, ఏఐ ఫీచర్స్‌పై మిక్స్‌ రెస్పాన్స్‌లు వచ్చాయి. తదుపరి సెప్టెంబర్‌లో అప్‌డేట్‌ చేసిన ఏఐ ఆధారిత మెటా రేబాన్‌ డిస్‌ప్లే మోడల్‌ను మెటా విడుదల చేసింది. దీనిని ‘గ్లాసెస్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌’గా అభివర్ణించింది. 2025 నాటికి ఈ గ్లాసెస్‌ అమ్మకాలు మూడింతలయ్యాయని సీఎన్‌బీసీ నివేదిక పేర్కొంటున్నది. మొత్తంగా 70 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని అంచనా.

ఇవి కూడా చదవండి..

Bengaluru-Hyderabad Train | బెంగళూరు టూ హైదరాబాద్ ప్రయాణం.. ఇక రెండు గంటలే
AI Chat Safety | ఏఐతో మీ చాట్‌లో ప్రైవసీ ఎంత? స్టాన్‌ఫోర్డ్‌ అధ్యయనంలో వెలుగులోకి షాకింగ్‌ అంశాలు..
Actress | సోషల్ మీడియాలో వేధింపులు, శరీరంపై విమర్శలు… ధురంధ‌ర్ నటి సంచలన వ్యాఖ్యలు