AI Chat Safety | ఏఐతో మీ చాట్‌లో ప్రైవసీ ఎంత? స్టాన్‌ఫోర్డ్‌ అధ్యయనంలో వెలుగులోకి షాకింగ్‌ అంశాలు..

ఈ మధ్యకాలంలో ప్రతి సమస్యకూ చాట్‌బాట్‌లను సంప్రదించడం ఎక్కువైంది. ఏదైనా టూర్‌ వెళ్లాలనుకున్నా.. ఏదైనా హెల్త్‌ ఇష్యూ వచ్చినా.. ఆఖరకు వ్యక్తిగత బంధాల్లో సమస్యలొచ్చినా ఏఐని వెతుక్కుంటున్నారు. అయితే.. ఇలా ప్రతి అంశాన్ని ఏఐ చాట్‌బాట్‌తో పంచుకోవడం ఎంత సేఫ్‌? స్టాన్‌ఫోర్డ్‌ అధ్యయనంలో ఇందులో షాకింగ్‌ అంశాలు వెలుగులోకి వచ్చాయి.

AI Chat Safety | ఏఐతో మీ చాట్‌లో ప్రైవసీ ఎంత? స్టాన్‌ఫోర్డ్‌ అధ్యయనంలో వెలుగులోకి షాకింగ్‌ అంశాలు..

AI Chat Safety | ఈ రోజుల్లో ఏఐ చాట్‌బాట్‌ను ఉపయోగించడం సర్వసాధారణంగా మారుతున్నది. సూటిగా సమాధానాలు కోరుకునేవారు నేరుగా చాట్‌ బాట్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ సమయంలో మనకు కావాల్సిన సమాధానం కోసం ప్రాంప్ట్‌ను అందిస్తుంటారు. అయితే.. ఈ చాట్‌బాట్‌లతో చేసే సంభాషణలు సురక్షితమేనా? దీనిపై స్టాన్‌ఫోర్డ్‌ హ్యూమన్‌ సెంటర్డ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Stanford HAI) నిర్వహించిన విశ్లేషణ కీలక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. దీనికోసం Stanford HAI అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఏఐ సంస్థలు.. అమెజాన్‌, ఆంథ్రోపిక్‌, గూగుల్‌, మెటా ప్లాట్‌ఫామ్స్‌, మైక్రోసాఫ్ట్‌, ఓపెన్‌ఏఐ ప్రైవసీ పాలసీలను, సబ్‌ పాలసీలు, FAQ సహా మొత్తం 28 పాలసీలను విశ్లేషించింది. అమెరికాలో అత్యంత సమగ్ర విధానమైన ‘కాలిఫోర్నియా కన్జ్యూమర్‌ ప్రైవసీ యాక్ట్‌’ను దృష్టిలో ఉంచుకుని ఎవాల్యుయేషన్‌ చేశారు. ఇందులో దిమ్మతిరిగే అంశాలు బయటకు వచ్చాయి. చాంతాడంత టెక్స్ట్ ఇచ్చి.. చివరిలో అగ్రీ.. అనే బటన్‌ ఇస్తారు కదా.. మనం అవి మొత్తం చదవకుండా.. నేరుగా కింద అగ్రి బటన్‌ నొక్కి.. ఆమోదం తెలియజేస్తాం. అందులోనే అసలు సంగతులన్నీ దాగి ఉంటాయి.

పైన చెప్పిన ఈ సంస్థలన్నీ యూజర్స్‌ చాట్‌ ఇన్‌పుట్‌లను తమ మోడల్‌ ఇంప్రూవ్‌మెంట్‌కు ఉపయోగించే అవకాశాన్ని పాలసీల్లో ప్రస్తావించాయి. చాలా సందర్భాల్లో ఇవి డిఫాల్ట్‌గా ఉంటాయి. అయితే.. సర్వీసుల వారీగా విధానాలు మాత్రం మారుతాయి. కొన్ని సంస్థలు డాటా నిల్వ కాలపరిమితిపై స్పష్టత ఇవ్వలేదని పరిశోధకులు గమనించారు. అయితే.. అన్ని చాట్‌లు శాశ్వతంగా నిల్వ ఉంటాయా? లేదా ప్రతి చాట్‌ను నిరంతరం ట్రైనింగ్‌కు వాడుతారా? అన్న విషయంలో అధ్యయనం స్పష్టతనివ్వలేదు. అంటే.. మనం ఇన్‌పుట్‌ ఇచ్చిన రూపంలో చాట్‌ను ఏఐ మాడల్‌ను మరింత అభివృద్ధి చేసే క్రమంలో సంస్థలు ఉపయోగించుకుంటాయన్నమాట.

ఇక్కడ ఇంకో కీలక అంశం కూడా ఉంది. కొన్ని కంపెనీలు తమ మోడల్‌ను మెరుగుపర్చే క్రమంలో కొంత డాటాను మనుషులు చదివే అవకాశం ఉందని కూడా అధ్యయనం వెల్లడించింది. అయితే ఇది అన్ని చాట్‌బాట్‌లకు వర్తిస్తుందా? అన్నది పాలసీపై ఆధారపడి ఉంటుంది. ప్రతి కంపెనీ ఒకే విధమైన ప్రక్రియను అనుసరిస్తున్నదని అధ్యయనం పేర్కొనలేదు.

గూగుల్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ కంపెనీలు.. సెర్చ్‌ ఇంజిన్లు, ఈకామర్స్‌ వంటి సామాజిక మాధ్యమాలు, క్లౌడ్‌ సర్వీసులు కూడా నిర్వహిస్తుంటాయి. అయితే.. వాటి ఏఐ చాట్‌బాట్లలో మీరు చేసే ఏఐ చాట్‌లు చాట్‌బాట్‌లకే పరిమితం కావని అధ్యయనం పేర్కొంటున్నది. ఆ కంపెనీలకు ఇప్పటికే మీ గురించి తెలిసిన విషయాలతో వీటిని కూడా కలిపేస్తాయి. మీ సెర్చ్‌ హిస్టరీ, మీ పర్చేజ్‌ డాటా, మీ సోషల్‌ మీడియా యాక్టివిటీ, మీరు అప్‌లోడ్‌ చేసే ఫైల్స్‌… అన్నీ వాటికి చేరిపోతాయి.

మీరు ఇప్పటికే గమనిస్తే.. గూగుల్‌ బ్రౌజర్‌లో మీరు సెర్చ్‌ చేసిన అంశాలకు సంబంధించిన ప్రకటనలు వస్తూ ఉంటాయి. సరిగ్గా ఇదే పద్ధతిలో మీ చాట్‌బాట్‌ సంభాషణ కూడా పనిచేస్తుంది. ఉదాహరణకు.. గుండెకు సంబంధించిన మంచి, ఆరోగ్యకరమైన వంటకాలు అడిగారనుకోండి.. ఈ ప్రశ్నతో సదరు చాట్‌బాట్‌ మోడల్‌ మొదటగా మీకు గుండె సంబంధిత సమస్యలు ఉండొచ్చని ఊహించే అవకాశం ఉంటుంది. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ సమాచారం కంపెనీకి చెందిన ఇతర సర్వీసులలోకి వెళ్లిపోతుంది. అప్పటి నుంచి మీకు గుండె సంబంధిత ఔషధాలు, వాణిజ్య ప్రకటనలు మీ బ్రౌజర్‌లో కనిపిస్తుంటాయి. తదుపరి దశలో ఆ సమాచారం ఇన్సూరెన్స్‌ డాటా బేస్‌లలోకి చేరిపోయే అవకాశమూ ఉంటుంది. ఇది కేవలం చిన్న ప్రశ్నే. కానీ.. ఇక్కడ మొదలైనది.. కాలక్రమంలో పెను ప్రభావాలకు గురి చేయగలదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంటే.. మీరు డిన్నర్‌ విషయంలో ఒక ప్రశ్న షేర్‌ చేశారు.. దాని ఆధారంగా సిస్టమ్‌ మీ హెల్త్‌ ప్రొఫైల్‌ను రెడీ చేసేస్తుంది.

చిన్న పిల్లల విషయంలో ఇది మీరు ఊహించినదానికంటే భయంకరంగా ఉంది. ఈ ఆరు కంపెనీల్లో నాలుగు కంపెనీలు.. చిన్న పిల్లల, టీనేజర్స్‌ డాటాను తమ మోడల్‌ ట్రైనింగ్‌ కోసం వినియోగించుకుంటున్నట్టు కనిపిస్తున్నది. గూగుల్‌ విషయానికి వస్తే.. తాము టీనేజర్‌ డాటాను opt-in consent ట్రైనింగ్‌కు వినియోగిస్తామని చెబుతున్నది. తాము చిన్న పిల్లల డాటాను సేకరించడం లేదని, అయితే.. వయసులను వెరిఫై చేయడం లేదని ఆంత్రోపిక్‌ పేర్కొంటున్నది. తాము 18 ఏళ్లలోపు వారి నుంచి డాటా సేకరించినా.. ఏఐ మాడల్‌ ట్రెయినింగ్‌కు వాడటం లేదని చెబుతున్నది.
వాస్తవానికి పెద్దవాళ్లలో ప్రైవసీ పాలసీని ఎంతమంది చదువుతారనేది ప్రశ్నే. ఇక చిన్న పిల్లల సంగతేంటి? చాలా మంది పేరెంట్స్‌కు ఏం జరుగుతున్నదో కూడా అర్థం కావడం లేదు.

ఇక opt-out వ్యవస్థ చిక్కు ముడి లాంటిదే. కొన్ని కంపెనీలు opt-outను ఆఫర్‌ చేస్తుంటే.. కొన్ని చేయడం లేదు. కొన్నయితే.. ఈ opt-out అనేది ఎక్కడుందో కూడా తెలియని విధంగా సెట్టింగ్స్‌లో ఎక్కడో మూలన దాచి పెడతాయి. నిజానికి ఈ ప్రైవసీ పాలసీలు ఒక పట్టాన అర్థంకావు. పూర్తిగా ముదురు లీగల్‌ టెర్నినాలజీ నిండి ఉంటుంది. పరిశోధకులు సైతం అర్థం చేసుకోలేని విధంగా ఈ పాలసీలు ఉంటాయంటే ఆశ్చర్యం లేదు. ఇది.. ఎవరూ సీరియస్‌గా చర్చించని నిర్మాణాత్మక సమస్య.

ఏఐ కంపెనీలు చాట్‌ డాటాను ఎలా వినియోగించాలన్న విషయంలో సమగ్ర ఫెడరల్‌ ప్రైవసీ యాక్ట్‌ ఏమీ లేదు. రాష్ట్రాలవారీగా వేర్వేరు చట్టాలున్నా.. చాలా లోపాలను వదిలేస్తున్నాయన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పరిశోధకులు మూడు అంశాలను ప్రతిపాదిస్తున్నారు. 1.ఫెడరల్‌ నియంత్రణ చట్టం తప్పనిసరిగా తీసుకురావాలి. 2.ఏఐ మోడల్‌కు శిక్షణ కోసం వినియోగదారుల నుంచి స్పష్టమైన ఆప్ట్‌ ఇన్‌ అనుమతి తప్పనిసరి చేయాలి. 3.చాట్‌లో ఇచ్చే వ్యక్తిగత సమాచారం ట్రైనింగ్‌ ప్రక్రియకు వెళ్లే ముందే ఆటోమేటిక్‌గా ఫిల్టర్‌ చేసే వ్యవస్థ ఉండాలి. ప్రస్తుతానికి అమెరికాలో ఈ మూడూ లేవు.

దురదృష్టకరమైన వాస్తవం ఏంటంటే.. ప్రతి సందర్భంలో మీరు చాట్‌జీపీటీ, జమినై, క్లాడ్‌, మెటా ఏఐ, కోపైలట్‌, లేదా అలెక్సా… ఇలా దేనికైనా సమాచారం ఇస్తున్నారంటే.. శిక్షణ డాటాసెట్‌ కోసం కాంట్రిబ్యూట్‌ చేస్తున్నట్టే. మీరు వైద్య పరంగా లేదా ఆరోగ్య విషయాల్లో అడిగే ప్రశ్నలు.. మీ జీవన బంధాల సమస్యలు, మీ ఆర్థిక స్తోమతు వివరాలు, మీరు అప్‌లోడ్‌ చేసే డాక్యుమెంట్లు.. ఇవన్నీ ఇస్తున్న మీరు.. వాస్తవానికి యూజర్‌ కాదు.. ఏఐకి మీరొక పాఠ్యాంశం.

ఈ అధ్యయనం సదరు సంస్థలపై తుది తీర్పు కానప్పటికీ.. కొన్ని హెచ్చరికలు మాత్రం చేస్తున్నది. ఏఐ చాట్‌బాట్‌లతో ఆరోగ్య, ఆర్థిక, వ్యక్తిగత వివరాలు పంచుకునేముందు కాస్త ఆలోచిస్తే మంచిది. ప్రైవసీ సెట్టింగ్స్‌ను పరిశీలించాలని సూచిస్తున్నది. అవసరమైతే ఆప్ట్‌ ఔట్‌ అవకాశాలు వినియోగించుకోవాలని చెబుతోంది. ఏఐ సేవలు పనిని సులభతరం చేస్తాయి. కానీ.. ప్రైవసీపై తగిన అవగాహన లేకపోతే.. మీ డాటాను ఏఐ చాట్‌బాట్‌లు శాశ్వత చరిత్రగా మార్చి స్టోర్‌ చేసుకొనే ప్రమాదం లేకపోలేదు.. తస్మాత్‌ జాగ్రత్త!!!