Royal Enfiled Bullet 650 | రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బుల్లెట్ 650 మోడల్‌ను ఆ కంపెనీ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధరను రూ.3,64,856 (ఎక్స్ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. క్లాసిక్ బుల్లెట్ డిజైన్‌ను అలాగే కొనసాగిస్తూ.. మరింత శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. ఇప్పటికే 650సీసీ సెగ్మెంట్‌లో మెటోర్ 650, షాట్‌గన్ 60, క్లాసిక్ 650, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 పేరుతో వివిధ మోడళ్లను రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయిస్తుండగా.. ఈ బుల్లెట్ 650 మరో కీలక మోడల్‌గా నిలిచే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

1932లో తొలిసారి బుల్లెట్‌ను పరిచయం చేసినప్పటి నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు 94 ఏళ్లుగా నిరంతర ఉత్పత్తిలో కొనసాగుతున్న అరుదైన మోటార్‌సైకిళ్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఇప్పుడు తరతాలుగా బైకర్ల హృదయాల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న బుల్లెట్‌‌‌ను 650సీసీ వెర్షన్‌గా తీసుకొచ్చింది.

ఈ కొత్త బుల్లెట్‌లో 648సీసీ ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. 78మి.మీ.X 67.8మి.మీ. బోర్ అండ్ స్ట్రోక్‌తో రూపొందించిన ఈ ఇంజిన్ 7250 rpm వద్ద 34.6KW గరిష్ట శక్తిని, 5650rpm వద్ద 52.3nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9.5:1 కంప్రెషన్ రేషియోతో పనిచేసే ఈ బైక్‌లో ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్యూయల్ ఇంజెక్షన్ వ్యవస్థను అందించారు. ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్ క్లచ్‌ను జోడించారు. దీనివల్ల పవర్ డెలివరీ సాఫీగా ఉండటంతో పాటు లాంగ్ జర్నీల్లో కంఫర్ట్‌గా ఉంటుంది. నగర రోడ్లతో పాటు హైవేలపై ప్రశాంతమైన క్రూజింగ్, వేగవంతమైన యాక్సిలరేషన్‌కు కూడా ఈ బైక్ అనుకూలంగా ఉంటుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తెలిపింది.

ఈ బైక్‌ను స్టీల్ ట్యూబ్యులర్ స్పైన్ ఫ్రేమ్‌పై నిర్మించారు. షోవా సస్పెన్షన్ను అందించడం ద్వారా గుంతలు, ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లపై కూడా స్మూత్ రైడింగ్ చేయవచ్చు. ఈ బైక్ ముందు భాగంలో 41 మిల్లీమీటర్ల ఫ్రంట్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లను అమర్చారు. 19 అంగుళాల ముందు చక్రం, 18 అంగుళాల వెనుక చక్రంతో బుల్లెట్‌ సాంప్రదాయ లుక్‌ను కొనసాగించారు.

డిజైన్‌పరంగా బుల్లెట్ ప్రత్యేకతను ఏమాత్రం తగ్గించలేదు. ఇది చూడ్డానికి అచ్చడం బుల్లెట్ 350ని పోలి ఉంటుంది. టియర్ డ్రాప్ ఆకారంలోని ఇంధన ట్యాంక్, చేతితో వేసిన పిన్‌స్ట్రైప్‌లు, పొడవైన బెంచ్ సీటు వంటి క్లాసిక్ అంశాలను అలాగే కొనసాగించారు. ఈ బైక్ మొత్తం పొడవు 2260మి.మీ., వెడల్పు 830మి.మీ., ఎత్తు 1155మి.మీ.గా కంపెనీ పేర్కొంది. సీటు ఎత్తు 800మి.మీ.గా ఉండగా.. కర్బ్ వెయిట్ 243 కిలోలుగా ఉంది. ఈ బైక్ గరిష్ట స్థూల బరువు 429 కిలోలు. ఇంధన ట్యాంక్ కెపాసిటీ 14.8లీటర్లుగా ఉంది. అలాగే క్యాస్కెట్ మౌంటెడ్ LED హెడ్‌ల్యాంప్, టైగర్ ఐ పైలట్ ల్యాంప్‌లు, క్రోమ్ పీషూటర్ ఎగ్జా్ట్, రెట్రో స్టైల్ అల్యూమినిం స్విచ్ గేర్‌ను అందించారు.

బ్రేకింగ్ వ్యవస్థలో ముందు భాగంలో 320మి.మీ. హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 300మి.మీ. డిస్క్ బ్రేక్ అందించారు. డ్యూయల్ చానల్ ఏబీఎస్ సదుపాయం ఇందులో ఉంది. అలాగే ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్‌లో అనలాగ్ డిస్‌ప్లేతో పాటు డిజిటల్ LCD ఇన్‌సెట్‌ను అందించారు. ఇందులో ఫ్యూయల్ లెవల్, గేర్ పొజిషన్, ట్రిప్ మీటర్, సర్వీస్ రిమైండర వంటి వివరాలు కనిపిస్తాయి. ఇక ఈ బైక్‌లో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది Canon Blac, Battleship Blue అనే రెండు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.

Read More:

స్పోర్టీ లుక్.. ప్రీమియం ఫీచర్లతో కొత్త బజాజ్ పల్సర్ N160 లాంచ్.. ధర ఎంతంటే..!

మినీ కూపర్ స్పెషల్ ఇన్‌స్పైర్డ్ ఎడిషన్.. కేవలం 30 కార్లు మాత్రమే.. వీటి ధర ఎంతంటే..!