మీ మొబైల్‌ ఫోన్‌ను ఎన్ని రోజులకు రీస్టార్ట్‌ చేస్తుంటారు? నిపుణులు చెబుతున్నదేంటి?

ఈ రోజుల్లో మొబైల్‌ఫోన్‌ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అంతకంటే.. శరీరంలో ఒక భాగంగా తయారైంది. ఒక్కోసారి స్ట్రక్‌ అయిపోతూ ఉంటుంది. అప్పుడు రీస్టార్ట్‌ చేస్తే.. మళ్లీ పని చేస్తుంటుంది. అసలు ఇలా సమస్య వచ్చినప్పుడే రీస్టార్ట్‌ చేయాలా? లేక నిర్దిష్ట వ్యవధిలో రీస్టార్ట్‌ చేయాలా? నిపుణులేమంటున్నారు?

మీ మొబైల్‌ ఫోన్‌ను ఎన్ని రోజులకు రీస్టార్ట్‌ చేస్తుంటారు? నిపుణులు చెబుతున్నదేంటి?

చాలా మంది ఫోన్‌ను అవసరమైనప్పుడో లేదా అది సరిగ్గా పనిచేయని సమయంలోనో రీస్టార్ట్‌ చేస్తూ ఉంటారు. రీస్టార్ట్‌ చేయగానే అది మళ్లీ లైన్‌లోకి వస్తుంటుంది. అయితే.. సమస్య వచ్చినప్పుడే కాకుండా.. నిర్దిష్ట వ్యవధిలో మొబైల్‌ఫోన్‌ను రీస్టార్ట్‌ చేయడం వల్ల ఫోన్‌లో ఉండే సమస్యలు సెట్‌ కావడమే కాకుండా భద్రతాపరంగా కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గెలాక్సీ ఫోన్లను రోజుకు ఒకసారి తప్పనిసరిగా రీస్టార్ట్‌ చేయాలని సాంసంగ్‌ సపోర్ట్‌ సూచిస్తున్నది. మరోవైపు వారానికి కనీసం ఒకసారైనా మొబైల్‌ ఫోన్‌ను రీస్టార్ట్‌చేస్తే మంచిదని నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ) చెబుతోంది. ఈ రెండూ కరెక్టేనని, ఇవి విభిన్న యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన సలహాలని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకు రీస్టార్ట్‌ చేయాలి?

ఫోన్‌ రీస్టార్ట్‌ చేయడం అంటే.. మెమొరీ (RAM)లో అప్పటికే యాక్టివ్‌గా ఉన్న అన్ని ప్రక్రియలకు బ్రేక్‌ వేయడం. కొన్ని యాప్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ ఉంటాయి. అవి కూడా క్లోజ్‌ అయిపోతాయి. అప్పటి వరకూ ఫోన్‌లో పేరుకుపోయిన చిన్నచిన్న సాఫ్ట్‌వేర్‌ లోపాలు సెట్‌ అవుతాయి. మళ్లీ ఫోన్‌ స్టార్ట్‌ అవగానే.. అవసరమైన సిస్టమ్‌ సర్వీసులు మాత్రమే పనిచేయడం ప్రారంభిస్తాయి. అందుకే కొన్ని ఒక్కో యాప్‌ను క్లోజ్‌ చేయడానికి బదులుగా.. ఫోన్‌ను పూర్తిగా రీస్టార్ట్‌ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఫ్రీజింగ్‌, హ్యాంగ్‌ అవడం వంటి సమస్యలు త్వరగా పరిష్కారం అయిపోతాయని అంటున్నారు. ఎందుకంటే.. ఒకసారి ఫోన్‌ రీస్టార్ట్‌ అవగానే.. బ్యాక్‌గ్రౌండ్‌ ప్రాసెస్‌లు ఏవీ ఉండవు.

బ్యాటరీ పనితీరు మెరుగవుతుంది..

మొబైల్‌ను కొన్ని సందర్భాల్లో వారాల తరబడి రీస్టార్ట్‌ చేయకపోతే.. కొన్ని యాప్‌లు, లేదా సర్వీసులు బ్యాటరీ పవర్‌ను అధికంగా వినియోగించుకుంటాయి. దీంతో ఫోన్‌ బ్యాటరీ వేగంగా డిశ్చార్జ్‌ అవుతుంది. రీస్టార్ట్‌ చేయడం ద్వారా బ్యాటరీ వినియోగాన్ని ఫోన్‌లోని సిస్టమ్‌ మళ్లీ ఫ్రెష్‌గా అంచనా వేస్తుంది. తద్వారా బ్యాటరీ పర్సెంటేజ్‌ ఒక్కసారిగా పడిపోవడం వంటి సమస్యలు తగ్గేందుకు అవకాశాలు మెరుగవుతాయి. అందుకనే బ్యాటరీ సమస్య ఉందని అనుమానించే ముందు ఒకసారి రీస్టార్ట్‌చేసి చూడాలని సాంసంగ్‌ సలహా ఇస్తున్నది. ఫోన్‌ పనితీరు మందగించడం, యాప్‌లు హ్యాంగ్‌ అవడం వంటి సమస్యలు పెద్దగా మారకముందే పరిష్కరించుకునేందుకు ప్రతి రోజూ రీస్టార్ట్‌ చేయాలని సాంసంగ్‌ సూచిస్తోంది. మీరు కనుక గమనిస్తే.. గెలాక్సీఫోన్లలో ఆటోమెటిక్‌ రీస్టార్ట్‌ ఫీచర్‌ కూడా కనిపిస్తుంది. దీనికి తగిన సూచనలు కూడా కనిపిస్తాయి. దాన్ని ఫాలో అవడం ద్వారా బ్యాటరీని దీర్ఘకాలం కాపాడుకోవచ్చు.

భద్రతాపరంగా కూడా చాలా ముఖ్యం

కొన్ని రకాల మాల్వేర్‌లు ఫోన్‌ స్టోరేజ్‌లో కాకుండా.. RAMలో మాత్రమే పని చేస్తుంటాయి. వీటినే మెమొరీ రెసిడెంట్‌ మాల్వేర్స్‌ అని పిలుస్తారు. ఫోన్‌ రీస్టార్ట్‌ చేయడంతో RAM క్లియర్ అవుతుంది. అదే సమయంలో మాల్వేర్ కూడా క్లియర్‌ అయిపోతుంది. అందుకే కనీసం వారానికి ఒక్కసారైనా ఫోన్‌ను పూర్తిగా ఆఫ్‌ చేసి, మళ్లీ ఆన్‌ చేయాలని ఎన్‌ఎస్‌ఏ సూచిస్తున్నది. అయితే.. సైబర్‌ ఎటాక్స్‌ను ఈ ఒక్కటే అడ్డుకుంటుందని చెప్పలేం. కొన్ని తాత్కాలిక మాల్వేర్‌లు, అనుమానాస్పద కోడ్‌లు పనిచేయకుండా ఈ ప్రక్రియ నిరోధించడానికి సహకరిస్తుంది.

ఈ జాగ్రత్తలు కూడా అవసరమేనండోయ్‌…

చాలా మంది ఫోన్‌లో బ్లూటూత్‌ ఆప్షన్‌ను రెగ్యులర్‌గా ఆన్‌లోనే ఉంచుతూ ఉంటారు. వాస్తవానికి అవసరం లేనప్పుడు బ్లూటూత్‌ను ఆఫ్‌ చేయడం మంచిదని ఎన్‌ఎస్‌ఏ అంటోంది. అంతేకాదు.. సాధ్యమైనంత వరకూ పబ్లిక్‌ వైఫైను వాడకపోవడమే మంచిదని చెబుతోంది. అన్నింటికంటే బహిరంగ ప్రదేశాల్లో యూఎస్‌బీ చార్జింగ్‌ పోర్ట్‌లను ఉపయోగించకపోవడమే బెటర్‌ అంటోంది. వివిధ రకాల సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ను వెంటనే ఇన్‌స్టాల్‌ చేయడం మంచిది. దీని ద్వారా ఎప్పటికప్పుడు అవి ఫ్రెష్‌గా ఉంటాయి.

మొత్తంగా.. ఫోన్‌కు సమస్య వచ్చినప్పుడు రీస్టార్ట్‌ చేయడం కంటే.. సమస్య రాకముందే దాన్ని అడ్డుకునే వ్యవస్థను సిద్ధం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.