చైనాలో లక్షల మంది ఫాల్తూ సోషల్ మీడియా క్రియేటర్ల ఖాతాల సస్పెన్షన్
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెర్స్ పేరిట హెల్త్, ఫైనాన్స్, లీగల్, ఎడ్యుకేషన్ రంగాల్లో తోచినట్టుగా సలహాలు ఇచ్చిపారేస్తున్నారు. వారి క్రెడిబిలిటీ ఏంటో, వారి అర్హతలేంటో తెలియదు. ఇలాంటివారితో సమాజానికి నష్టం వాటిల్లుతున్నదని గుర్తించిన చైనా ప్రభుత్వం.. ఇటువంటి లక్షల మంది ఖాతాలను సస్పెండ్ చేసిపడేసింది.
ప్రపంచ అగ్రరాజ్యాలకు వణుకు పుట్టిస్తున్న చైనా… సోషల్ మీడియాలో తప్పుడు కథనాల వ్యాప్తి, నియంత్రణ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నది. ఎవరేమి అనుకున్నా సరే ప్రజల ప్రయోజనాలు, దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇన్‌ఫ్లూయెన్సర్ల పేరుతో ఊరూపేరూలేని వాళ్ల ఖాతాలపై ఉక్కుపాదం మోపుతున్నది. నకిలీ క్రియేటర్ల మూలంగా లక్షల మంది ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా నష్టపోతున్నట్లు అంచనాకు వచ్చింది. ముఖ్యంగా హెల్త్ కేర్, ఫైనాన్స్, న్యాయం, విద్య వంటి అంశాలపై అడ్డమైన ప్రతి ఒక్కరూ మాట్లాడకుండా ఉండేందుకు చట్టం తీసుకువచ్చారు. ఈ అంశాలపై ఉన్నత విద్యను అభ్యసించి, అనుభవం ఉన్నవారు మాత్రమే సోషల్ మీడియాలో పోస్టు చేయాలని నిబంధన అమలు చేస్తున్నారు. దీంతో దేశంలో సోషల్ మీడియా సంస్థలు సబ్జెక్టుతో సంబంధం లేని లక్షలాది మంది క్రియెటర్ల అక్కౌంట్లను సస్పెండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యతో లక్షలాది మంది అక్కౌంట్లు కోల్పోవడమే కాకుండా మళ్లీ కొత్తగా అక్కౌంట్లను తెరిచే పరిస్థితి లేకుండా చేస్తున్నారు.
చైనా దేశానికి చెందిన సైబర్ స్సేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (సీఏసీ) ఇంటర్‌నెట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. మన దేశంలో టెలికం రెగ్యులరేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మాదిరి. సీఏసీకి అమితమైన అధికారాలు ఉండగా, ట్రాయ్‌కు అలాంటి అధికారాలు లేవు. ప్రజలు ఎక్కువగా వీక్షించే, సున్నితమైన హెల్త్‌కేర్, ఫైనాన్స్, లా, ఎడ్యుకేషన్ వంటి అంశాలపై మాట్లాడేవారు సంబంధిత సబ్జెక్టులలో పట్టా కలిగి ఉండాలి. పట్టాతో పాటు ప్రొఫెషనల్ లైసెన్స్ ప్రభుత్వం నుంచి పొంది ఉండాలి. డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ లైసెన్స్ కలిగి ఉన్నవారు మాత్రమే సోషల్ మీడియాలో కంటెంట్ క్రియెటర్లుగా వ్యవహరించాలని చైనా ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడంతో పాటు జవాబుదారీతనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా ప్రకటించింది.
నిరుద్యోగులు, పనీ పాటలేని యువత సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్లుగా అవతారం ఎత్తి ఇష్టానుసారంగా మాట్లాడుతుండడం, ప్రకటనలు గుప్పిస్తుండడంతో ప్రజల్లో గందరగోళం నెలకొనడమే కాకుండా లేనిపోని భయాలు కల్పిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. పెట్టుబడులు మొదలు ఆరోగ్య సంరక్షణ వరకు ఉచిత సలహాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. వేలాది మంది వీరి సందేశాలను చూసి మందులు కొనుగోలు చేసి అనారోగ్యం బారిన పడి ఆసుపత్రులు పాలవుతున్నారు. అనామక, నష్టాల పాలైన కంపెనీలలో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రజలు ప్రభావితమై ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా కుంగిపోతున్నారు. దీని వల్ల దేశ పురోగతిపై ప్రభావం పడుతోందనేది చైనా ప్రభుత్వం వాదన.
దీనిపై బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పట్టాలు కలిగి ఉండి ప్రొఫెషనల్ సర్టిఫికేట్లు ఉన్నవారిని ప్రోత్సహించేందుకు కఠిన నిబంధనలు రూపొందించి అమలు చేస్తున్నారు. వీరికే సోషల్ మీడియాలో అక్కౌంట్లు అనుమతించాలని స్పష్టం చేసింది. అనామకులు, అవాకులు చవాకులు పేలే ఇన్ ఫ్లుయన్సెర్ల అక్కౌంట్లను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో లక్షలాది మంది అక్కౌంట్లు కనుమరుగు అయ్యాయి. ఇదే కాకుండా ప్రతినిత్యం సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్లను పర్యవేక్షిస్తున్నది. సమస్యాత్మకంగా, సంబంధం లేని కంటెంట్ ను తొలగించాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశిస్తున్నారు. ఇదే మాదిరి భారత దేశంలో కఠిన చట్టాలు తీసుకురావాలని సోషల్ మీడియా నిపుణులు కోరుతున్నారు. దీని వల్ల దేశంలో అనవసర కంటెంట్ తగ్గుముఖం పడుతుందని, ప్రజలకు మెరుగైన సమాచారం అందుతుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
ఐదు సీట్లిస్తే.. వెయ్యి కోట్లిస్తా… బీజేపీకి ఓ మాజీ మంత్రి బంపర్ ఆఫర్!
Hyderabad | పెళ్లికి ముందే గర్భం.. ప్రియుడి మోజులో పడి ఆరేళ్ల బిడ్డ హత్య
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram